వైరల్ వీడియో - భారత్, రష్యా విషయంలో మాట మార్చిన ట్రంప్.. పరువుపాయే!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ (2028) సంబంధించిన ఒక విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించింది.
By: A.N.Kumar | 6 Aug 2025 11:51 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల రష్యాతో అమెరికా వాణిజ్య సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. భారత్‌పై సుంకాలు విధిస్తానని ప్రకటించిన ట్రంప్, ఇప్పుడు రష్యా నుంచి అమెరికా కీలక వస్తువులు దిగుమతి చేసుకుంటున్న విషయంపై అవగాహన లేనట్లుగా మాట్లాడటం విమర్శలకు గురైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మాటలు, వాటిపై వచ్చిన స్పందనలు హోరెత్తుతున్నాయి..
-ట్రంప్ వ్యాఖ్యలు, విలేకరుల సమావేశం
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ (2028) సంబంధించిన ఒక విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించింది. గతంలో తాను భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 25% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించానని, కానీ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు తాను ఎప్పుడూ చేయలేదని అన్నారు. ఈ సమావేశంలో ఒక విలేకరి రష్యా నుంచి అమెరికా దిగుమతుల గురించి అడిగినప్పుడు "అలాంటివేమైనా ఉన్నాయా?" అంటూ ట్రంప్ ప్రశ్నించడం విమర్శలకు తావిచ్చింది. యురేనియం, ఎరువులు వంటి కీలక వస్తువులు రష్యా నుంచి దిగుమతి అవుతున్న విషయం తనకు తెలియదని ఆయన చెప్పడంపై నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు వ్యంగ్యంగా స్పందించారు. ట్రంప్ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని చాలామంది భావించారు.
-అమెరికా-రష్యా మధ్య వాణిజ్యం కొనసాగుతుందా?
ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో చాలా దేశాలు రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించాయి. కానీ అమెరికా మాత్రం కొన్ని కీలక వస్తువులను రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం కొనసాగిస్తోంది. 2024లో అమెరికా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని కీలక వస్తువుల విలువ బిలియన్లలో ఉంది. ఎరువులు $1.27 బిలియన్, యురేనియం, ప్లూటోనియం $624 మిలియన్, పల్లాడియం $878 మిలియన్ డాలర్ల దిగుమతులున్నాయి.. ఈ లెక్కలు చూస్తే అమెరికా రష్యాతో వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేయలేదని స్పష్టమవుతోంది. ఇలాంటి కీలక వస్తువులను దిగుమతి చేసుకుంటూనే భారత్ వంటి దేశాలపై సుంకాలు విధించడం గురించి మాట్లాడటం ట్రంప్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు.
-నిక్కీ హేలీ తీవ్ర వ్యాఖ్యలు
భారతీయ మూలాలున్న రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ ట్రంప్ వైఖరిపై తీవ్రంగా స్పందించారు. "భారత్ వంటి మిత్ర దేశాన్ని దెబ్బతీయకండి" అంటూ ట్రంప్‌ను హెచ్చరించారు. "భారత్ రష్యా నుంచి చమురు కొనడం తప్పా, మరి చైనా మాత్రం కొనొచ్చా?" అని ఆమె ప్రశ్నించారు. చైనా రష్యా, ఇరాన్ల నుంచి భారీగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నప్పటికీ, ట్రంప్ పాలనలో చైనాకు 90 రోజుల మినహాయింపు ఇవ్వడంపై ఆమె పరోక్షంగా విమర్శలు చేశారు.
ట్రంప్ మాటలలో స్పష్టత లేకపోవడం, ఒకవైపు భారత్ లాంటి మిత్ర దేశాలపై ఒత్తిడి తీసుకురావడం, మరోవైపు రష్యాతో అమెరికా స్వయంగా వాణిజ్యం కొనసాగించడం వంటి అంశాలు ఆయన విధానాలపై అనుమానాలు పెంచుతున్నాయి. ట్రంప్ మాటలకు, చేతలకు పొంతన లేకపోవడంపై విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ నాయకత్వం ఎంతవరకు సమర్థవంతమైనదనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.
