ట్రంప్ చేస్తే సంసారం.. మిగతా వాళ్లు చేస్తే కాదు.. ఏం నీతి అయ్యా 'అగ్రరాజ్యాధినేత'
అగ్రరాజ్య పీఠంపై కూర్చుంటే చాలు.. ఇష్టానుసారంగా నిబంధనలు మార్చేయొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిరూపించారు.
By: A.N.Kumar | 10 Oct 2026 10:22 AM ISTతెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఒక పాత బూ*తు నానుడి ఉండేది. ‘ట్రంప్ చేస్తే సంసారం.. మిగతా వారు చేస్తే ‘వ్యభి*చారం’.. బూతు అన్నందుకు పాఠకులు క్షమించాలి. ట్రంప్ ఫ్లిప్ అవ్వడం చూసి తట్టుకోలేక రాస్తున్న పదం ఇదీ.. దయచేసి మీ పెద్దమనుసుతో అర్థం చేసుకొని.. ట్రంప్ చెండాలపు అవతారాల గురించి ఫస్ట్రేషన్ తో రాస్తున్నదని గ్రహించాలి. అగ్రరాజ్యపు అధ్యక్షుడు రూల్స్ పెడుతాడు.. కానీ పాటించడు... మన బాలయ్య సినిమాల్లో ఈ డైలాగ్ చెప్తే.. ట్రంప్ మాత్రం నిజజీవితంలోనే తన అగ్రరాజ్యపు దురహంకారంతో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ప్రజలను ఆకట్టుకోవడానికి ఇలా ప్రపంచ దేశాలపైకి.. ముఖ్యంగా భారత్ పై బరితెగిచింపోతున్నాడు. ఎన్నికల్లో ఓడిపోతే.. అమెరికన్లు చీ కొడితే కానీ తెలియదు కానీ ఈ మహాశయుడికి తాను ఎంత పెద్ద తప్పు చేశానో.. ఆ రోజు కోసం ఎదురుచూడడం తప్పితే.. లేదా మోడీ ‘మౌన’ ఆయుధాన్ని వాడితేనే మనం బతకగలం.. లేదంటే ఇలానే ఫస్ట్రేషన్ తో ట్రంప్ పై కారాలు మిరియాలు నూరి పోయడం తప్ప ప్రస్తుతానికి ఏమీ చేయలేం.
అగ్రరాజ్య పీఠంపై కూర్చుంటే చాలు.. ఇష్టానుసారంగా నిబంధనలు మార్చేయొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిరూపించారు. ప్రపంచ దేశాలకు మాత్రం నీతులు వల్లించే అగ్రరాజ్యం, స్వార్థ రాజకీయాలొచ్చేసరికి ఏ సూత్రాలనైనా ఇట్టే గాలికి వదిలేస్తుందనడానికి తాజా పరిణామాలే నిదర్శనం.
నీతులొకరికొకటి.. నీచ రాజకీయాలు మరొకరికొకటి
ఉక్రెయిన్‌పై రష్యా దూకుడును అడ్డుకోవాలని మాస్కో ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని గతంలో అమెరికా పెద్దఎత్తున గద్దించింది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. రష్యన్ ఆయిలే ప్రపంచ శాంతికి ముప్పంటూ ప్రపంచ దేశాలను కట్టడి చేయాలని చూసింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికాలో రాబోయే మిడ్‌టర్మ్ ఎన్నికల వేళ ఇంధన ధరల మంట ఓటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చడం, ఓట్లను రాల్చుకోవడం కోసం ట్రంప్ సర్కార్‌కి ఇప్పుడు రష్యా చమురు మళ్లీ అమృతంలా కనిపిస్తోంది.
ఎన్నికల రాజకీయాల కోసం ఏకంగా రష్యాతోనే రహస్య డీల్ కుదుర్చుకుని.. చమురు దిగుమతులకు తెరలేపారన్న వార్తలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. పరులొకరు చేస్తే అది నేరమని.. తాము చేస్తే అది 'అత్యవసర వ్యూహమంటూ' బుకాయించే అగ్రరాజ్య నైజం మరోసారి బట్టబయలైంది.
'అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు'
ట్రంప్ రాజకీయ శైలిని చూస్తుంటే సరిగ్గా ‘అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు’ అనే సామెత గుర్తుకు వస్తుంది. పక్క దేశాలను శాసించే చట్టాలు చేసేటప్పుడు కనిపించని నైతికత, స్వార్థం.. అమెరికాలో గ్యాసోలిన్, డీజిల్ ధరలు పెరిగి ఓట్లు రాలిపోయే పరిస్థితి వచ్చేసరికి గుర్తుకొచ్చాయి. రష్యా క్రూడ్‌పై ఆంక్షలంటూ భారత్ , చైనా సహా కొన్ని వర్ధమాన దేశాలపై 100శాతం టారిఫ్ లు విధించి నీతులు వల్లించిన నోళ్లతోనే ఇప్పుడు అవసరానికొచ్చేసరికి అదే రష్యాతో డీల్ కుదుర్చుకోవడం ఎలాంటి నీతికి చెందింది అగ్రరాజ్యపు అధినేత చెప్పి తీరాలి.
ప్రపంచ దేశాల ముందు ప్రజాస్వామ్యానికి పెద్దన్నగా ఫోజులిచ్చే అమెరికా.. సంక్షోభ సమయాల్లో తన ప్రయోజనాలే పరమావధిగా ఎలా మారుతుందో ఈ ఘటన అద్దం పడుతోంది. పాలకుల డబుల్ స్టాండర్డ్స్ చూసి విమర్శకులు తలలు పట్టుకుంటున్నారు.
మొత్తానికి ట్రంప్ రాజకీయ క్రీడలో నీతి, నిజాయితీ అనేవి కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందే పావులుగా మాత్రమే మిగిలిపోతున్నాయని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నీతి,నిజాయితీ లేని ఇలాంటి దౌర్భగ్యపు నేతను అసలు అమెరికన్లు ఎలా ఎన్నుకున్నారని.. భారతీయ నెటిజన్లు సోషల్ మీడియాలో తమ ఫస్ట్రేషన్ ను పీక్స్ లో వ్యక్తపరుస్తున్నారు. చూడాలి మరీ ఈ ట్రంప్ రాజకీయ గేమ్ అమెరికాలో వర్కవుట్ అవుతుందా? మిడ్ టర్మ్ ఎన్నికల కోసం ఇలా భారత్ పై పడుతూ.. అమెరికన్ల మనసు దోచే పనులు వర్కవుట్ అవుతాయా? అన్నది వేచి చూడాలి.
