Begin typing your search above and press return to search.

ఫలితాలు రివర్స్ : ముగింపు దశలో ట్రంప్‌ శకం?

న్యూయార్క్‌లో సోషలిస్ట్, కమ్యూనిస్టు భావజాలం కలిగిన జోహ్రాన్ మమ్ దానీ మేయర్‌గా గెలవడం అనూహ్య పరిణామం.

By:  A.N.Kumar   |   5 Nov 2025 3:19 PM IST
ఫలితాలు రివర్స్ : ముగింపు దశలో ట్రంప్‌ శకం?
X

అమెరికా రాజకీయాల్లో మరోసారి పెద్ద మార్పుకు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో జరిగిన కీలక ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఈ ఫలితాలు ట్రంప్‌ ఆధిపత్యానికి, ఆయన విధానాలకు ప్రజల నుంచి స్పష్టమైన వ్యతిరేక సంకేతాలుగా భావించబడుతున్నాయి.

రిపబ్లికన్ పార్టీకి దెబ్బ

న్యూయార్క్‌లో సోషలిస్ట్, కమ్యూనిస్టు భావజాలం కలిగిన జోహ్రాన్ మమ్ దానీ మేయర్‌గా గెలవడం అనూహ్య పరిణామం. ట్రంప్‌ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి భారీ మెజారిటీతో గెలవడం రిపబ్లికన్ పార్టీకి తీవ్రమైన షాక్‌గా మారింది. అంతేకాదు, వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాల గవర్నర్ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ అభ్యర్థులు ఓడిపోవడం పార్టీ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.

ట్రంప్ పాలనపై పెరుగుతున్న వ్యతిరేకత

ట్రంప్‌ 2.0 పాలన మొదలై ఏడాది పూర్తికాకముందే దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఆయన తీసుకున్న ఎక్స్‌ట్రీమ్ రైట్‌ విధానాలు, కఠిన నిర్ణయాలు, వలసదారులపై చూపిస్తున్న వైఖరి, సామాజిక అంశాలపై అనుచిత వ్యాఖ్యలు అమెరికా ప్రజల్లో విస్తృత అసంతృప్తిని కలిగించాయి. "నో కింగ్" పేరుతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరసనలకు దిగడం, ట్రంప్‌ పాలనపై ఉన్న కోపాన్ని స్పష్టంగా తెలియజేసింది.

* షట్‌డౌన్‌ ప్రభావం.. ప్రజల కోపం ఉప్పొంగింది

ట్రంప్‌ విధానాల కారణంగా అమెరికాలో 30 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్‌ ప్రజల జీవితాలను దెబ్బతీసింది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, విదేశీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజలు రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు.

*ప్రజాభిప్రాయంలో స్పష్టమైన మార్పు

ఈ ఫలితాలు అమెరికా రాజకీయాల్లో గణనీయమైన మార్పుకు సూచనగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ట్రంప్‌ వ్యక్తిగత ఇమేజ్‌ తగ్గిపోగా, ఆయన పార్టీ సంప్రదాయ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం బలపడుతోంది. "పార్టీ కాదు – మన దేశం ముందుగా" అనే నినాదం తిరిగి ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

*భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం

ఈ పరాజయాలు రిపబ్లికన్‌ పార్టీకి హెచ్చరికగానే కనిపిస్తున్నాయి. ట్రంప్‌ ఆధిపత్యం పార్టీని ప్రజల నుంచి దూరం చేస్తోందని స్పష్టమవుతోంది. మిడ్‌టర్మ్‌ ఎన్నికల ముందు పార్టీ పాలసీలు, నాయకత్వం మార్పు లేకుంటే రిపబ్లికన్ల పతనం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ట్రంప్‌ శకం ముగింపు దశలోనా?

ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్‌ ప్రభావం తగ్గిపోతుండటంతో “ట్రంప్‌ శకం ముగిసిపోతోందా?” అనే ప్రశ్న అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజల నమ్మకం తిరిగి పొందాలంటే రిపబ్లికన్ పార్టీ పెద్ద మార్పులు చేయాల్సిందే. లేదంటే, ఈ ఎన్నికలే ఆ పార్టీ భవిష్యత్తుకు తుదిగంటలు మోగించినట్టే అవుతుందని నిపుణుల అభిప్రాయం.

మొత్తం మీద అమెరికా ఎన్నికల ఫలితాలు ట్రంప్‌కు స్పష్టమైన వార్నింగ్ బెల్‌గా మారాయి. ప్రజల తీర్పు మారుతోంది. అది రిపబ్లికన్‌ పార్టీకే కాకుండా అమెరికా రాజకీయ వ్యవస్థకూ పెద్ద పాఠమే.