ట్రంప్ పదవికి గండం? అమెరికాలో తెరపైకి 25వ సవరణ..
ముఖ్యంగా ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు, విదేశాంగ విధానంలో ఆయన అనుసరిస్తున్న కఠిన వైఖరి ఈ చర్చకు ఆజ్యం పోశాయి.
By: A.N.Kumar | 6 April 2026 10:21 AM ISTఅమెరికా రాజకీయాల్లో మళ్లీ అలజడి మొదలైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత వైఖరి.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అగ్రరాజ్యంలో పెను దుమారం రేపుతున్నాయి. తాజాగా ఆయనను పదవి నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు, విదేశాంగ విధానంలో ఆయన అనుసరిస్తున్న కఠిన వైఖరి ఈ చర్చకు ఆజ్యం పోశాయి.
ట్రంప్ తొలగింపు దిశగా అడుగులు?
వాషింగ్టన్ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక ప్రముఖ అమెరికా చట్టసభ్యుడు ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని అధికారికంగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడనప్పటికీ రాజకీయంగా ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం.. ఒక అధ్యక్షుడు తన బాధ్యతలను నిర్వహించలేకపోతున్నారని లేదా ఆయన నిర్ణయాలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని భావిస్తే ఆయనను పదవి నుంచి తప్పించే అధికారం ఉంటుంది.
బెట్టింగ్ మార్కెట్లలో పెరిగిన అంచనాలు
రాజకీయ ఊహాగానాలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రిడిక్షన్ మార్కెట్లలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘కల్షి’ వంటి ప్రముఖ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ట్రంప్ పదవీచ్యుతుడవుతారా అనే అంశంపై పందాలు జోరందుకున్నాయి. గత నెలలో ట్రంప్‌ను 25వ సవరణ ద్వారా తొలగించే అవకాశం ఉందన్న వారి శాతం 28.6% గా ఉండేది.ప్రస్తుతం ఆ అంచనా ఏకంగా 35.1%కి చేరుకుంది. ప్రజాభిప్రాయంలో వస్తున్న ఈ మార్పు ట్రంప్ పరిపాలనపై పెరుగుతున్న అసంతృప్తికి లేదా ఆందోళనకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రధాన కారణాలు.. విదేశాంగ విధానం, భద్రత
ట్రంప్ తన విదేశాంగ విధానంలో చూపిస్తున్న దూకుడు ముఖ్యంగా ఇరాన్‌తో పెరుగుతున్న యుద్ధ మేఘాలు ఈ చర్చకు ప్రధాన కారణం. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని విమర్శకులు వాదిస్తున్నారు. రక్షణ, దౌత్య పరమైన వ్యూహాల్లో ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇది మిత్రదేశాలతో సంబంధాలను దెబ్బతీస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. "దేశ భద్రత, ప్రపంచ శాంతి దృష్ట్యా అధ్యక్షుడి నిర్ణయాలు అత్యంత కీలకం. అక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అది కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది." అని ఒక రాజకీయ విశ్లేషకుడి అభిప్రాయపడ్డారు.
25వ సవరణ అమలు సాధ్యమేనా?
రాజ్యాంగ పరంగా 25వ సవరణను అమలు చేయడం అంత సులభం కాదు. దీనికి కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఈ ప్రక్రియ ప్రారంభం కావాలంటే ముందుగా ఉపాధ్యక్షుడు దీనికి అంగీకరించాలి. మెజారిటీ కేబినెట్ సభ్యులు అధ్యక్షుడి అసమర్థతను ధృవీకరిస్తూ లేఖ రాయాలి. ఒకవేళ అధ్యక్షుడు దీనిని వ్యతిరేకిస్తే అప్పుడు అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) లో రెండింట మూడొంతుల మెజారిటీతో దీనిని ఆమోదించాల్సి ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ అనుచరులు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత ప్రచారమని.. ట్రంప్ పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర అని వారు మండిపడుతున్నారు.
మొత్తానికి ట్రంప్ పదవిలో కొనసాగుతారా లేదా అన్నది ఇప్పుడు కేవలం అమెరికా సమస్యే కాదు.. ప్రపంచవ్యాప్త చర్చగా మారింది. రాబోయే రోజుల్లో వైట్ హౌస్ నుంచి వచ్చే అధికారిక సమాచారం.. కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలు అమెరికా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. అప్పటి వరకు ఈ ఊహాగానాలు, బెట్టింగ్ మార్కెట్ల జోరు కొనసాగుతూనే ఉంటుంది.
