రాజులు లేని అమెరికాలో ట్రంప్ కు బంగారు కిరీటం... విషయం ఏమిటంటే..!
అమెరికాలో 'రాజులు లేరు' అని పిలుపునిస్తూ స్వదేశంలో నిరసనలు ఎదుర్కొంటున్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా బంగారు కిరీటాన్ని బహుమతిగా అందుకున్నారు.
By: Raja Ch | 30 Oct 2025 11:10 AM ISTఅమెరికాలో 'రాజులు లేరు' అని పిలుపునిస్తూ స్వదేశంలో నిరసనలు ఎదుర్కొంటున్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా బంగారు కిరీటాన్ని బహుమతిగా అందుకున్నారు. కొరియా ద్వీపకల్పాన్ని క్రీస్తుపూర్వం 57 నుండి క్రీ.శ 935 వరకు పాలించిన సిల్లా రాజవంశం రాజులు ధరించిన కిరీటం ప్రతిరూపాన్ని డొనాల్డ్ ట్రంప్ కు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ బహుకరించారు.
అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దక్షిణ కొరియా అధ్యక్షుడు బంగారు కిరీటం ప్రతిరూపాన్ని బహూకరించి, ఆ దేశ అత్యున్నత పురస్కారం 'గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా'ను ప్రదానం చేశారు. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి దక్షిణ కొరియా చేరుకున్న ట్రంప్ గ్యోంగ్జు నేషనల్ మ్యూజియంను సందర్శించిన అనంతరం ఈ బహుమతి అందింది!
కొరియా ద్వీపకల్పంలో సుదీర్ఘకాలం శాంతిని కొనసాగించిన సిల్లా చరిత్రకు ఈ కిరీటం ప్రతీకగా ఉంటుందని అధ్యక్షుడు లీ కార్యాలయాన్ని ఉటంకిస్తూ వార్తా సంస్థ బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఇదే సమయంలో.. ట్రంప్ శాంతి స్థాపన ప్రయత్నాలకు గుర్తింపుగా కొరియా ప్రభుత్వం ఆయనకు 'గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా'ను కూడా ప్రదానం చేసింది.
డొనాల్డ్ ట్రంప్ కు బహూకరించిన కిరీటంలో పొడవైన బంగారు ముళ్ళు, వేలాడుతున్న బంగారు ఆకు లాంటి అలంకరణలు ఉన్నాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ కిరీటం కొరియా ద్వీపకల్పంలో శాంతియుత భవిష్యత్తు కోసం యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియా కలిసి పనిచేసే కొత్త శకానికి ప్రతీకగా భావిస్తున్నారు.
ట్రంప్ కు బహూకరించిన కిరీటం జియోంగ్జు నగరంలో లభించిన చియోన్మాచోంగ్ అనే నిజమైన బంగారు కిరీటానికి ప్రతిరూపం. ఇదే సమయంలో... దక్షిణ కొరియా అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా కూడా లభించగా.. ఈ గౌరవానికి 'ముగుంగ్వా' పువ్వు పేరు పెట్టారు. దీనిని ఆంగ్లంలో 'రోజ్ ఆఫ్ షారన్' అని పిలుస్తారు. ఇది దక్షిణ కొరియా జాతీయ పుష్పం.
ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్.. తాను అందుకున్న ఈ బహుమతి చాలా ప్రత్యేకమైనది అని అన్నారు. అయితే తాను ఇప్పుడే దాన్ని ధరించాలనుకుంటున్నాను అని పేర్కొన్నారు. ఈ అందమైన పతకాన్ని తాను ఎంతో ఆదరిస్తానని, దానిని అందుకోవడం తనకు లభించిన గొప్ప గౌరవం అని ట్రంప్ తెలిపారు.
అనంతరం స్పందించిన ప్రెసిడెంట్ లీ సహాయకుడు కిమ్ యోంగ్ బియోమ్.. దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ సుంకాల చర్చలు ఒక ఒప్పందానికి వచ్చాయని తెలిపారు. ఇందులో భాగంగా...దక్షిణ కొరియా అమెరికాకు ప్రకటించిన $350 బిలియన్స్ ఆర్థిక పెట్టుబడి ప్యాకేజీలో $200 బిలియన్లు నగదు పెట్టుబడి, $150 బిలియన్లు నౌకానిర్మాణ సహకారం ఉన్నాయని అన్నారు.
