Begin typing your search above and press return to search.

భారత్ ను దూరం కొట్టి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం ట్రంప్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

By:  A.N.Kumar   |   5 Sept 2025 5:58 PM IST
భారత్ ను దూరం కొట్టి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం ట్రంప్?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రష్యా, చైనా, భారతదేశం ఒకే వేదికపై కలిసి ఉన్న చిత్రాన్ని తన ట్రూత్ సోషల్ మీడియాలో పంచుకుంటూ.. అమెరికా ఈ రెండు కీలక దేశాలు భారత్ , రష్యాలను కోల్పోవడం దురదృష్టకరం అని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ నాయకుడి అభిప్రాయంగా కాకుండా అమెరికా-భారత్ సంబంధాలలో ఉన్న సంక్లిష్టతను, గ్లోబల్ పవర్‌షిఫ్ట్ (ప్రపంచ శక్తి సమతుల్యతలో మార్పు)ను సూచిస్తున్నాయి.

భారత్ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి, రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధిస్తున్న దేశం చైనాకు దగ్గర కావడం అమెరికాకు ఆందోళన కలిగించే విషయమే. కానీ భారత్ ఎప్పుడూ ఒక దేశానికి పూర్తిగా కట్టుబడి ఉండే వైఖరిని అవలంబించలేదు. ప్రపంచంలో చోటుచేసుకుంటున్న పరిణామాలకు అనుగుణంగా తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది.

* భారత్‌-అమెరికా సంబంధాలు: అవాంతరాలూ, బంధాలూ

ట్రంప్ వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి, ఎందుకంటే ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే భారత్-అమెరికా సంబంధాలు బలపడ్డాయి. 'హౌడీ మోడీ' , 'నమస్తే ట్రంప్' వంటి కార్యక్రమాలు ఇరు దేశాల నాయకుల మధ్య వ్యక్తిగత బంధాన్ని బలోపేతం చేశాయి. రక్షణ, వాణిజ్యం, టెక్నాలజీ రంగాలలో భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది. అయితే కొన్ని అంశాలలో వైరుధ్యాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు S-400 ట్రయంఫ్ మిస్సైల్ సిస్టమ్ కోసం రష్యా, ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాలు అమెరికా ఆంక్షలకు దారితీశాయి. కానీ ఈ విభేదాలు అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్ తన నిర్ణయాలకు కట్టుబడి ఉండి, తన సార్వభౌమత్వాన్ని ప్రదర్శించింది. ఇది భారత్ తన విదేశాంగ విధానంలో ఎవరికీ లొంగి ఉండదనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.

* బహుళ-కేంద్ర ప్రపంచం వైపు భారత్

ప్రస్తుతం ప్రపంచం ఏక-కేంద్రక వ్యవస్థ నుంచి బహుళ-కేంద్రక వ్యవస్థ వైపు మారుతోంది. కేవలం ఒక్క దేశం అంటే అమెరికా మాత్రమే ప్రపంచాన్ని శాసించే రోజులు గడిచిపోయాయి. చైనా, భారత్, రష్యా వంటి దేశాలు ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత్ ఈ మార్పును తన ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకోవాలని చూస్తోంది. చైనాతో సరిహద్దు సమస్యలు ఉన్నప్పటికీ, వాణిజ్యం - ఆర్థిక అంశాల్లో సహకారం అవసరం. అలాగే రష్యా నుంచి సైనిక ఉపకరణాలు, ఇంధనం కొనుగోలు చేయడం భారత్ కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా లాభదాయకం. అదే సమయంలో అమెరికాతో సైనిక , టెక్నాలజీ సహకారాన్ని కొనసాగిస్తూ, తన భద్రతను బలోపేతం చేసుకుంటోంది. దీన్ని చూస్తుంటే భారత్ 'బ్యాలెన్సింగ్ యాక్ట్' చేస్తోందని చెప్పొచ్చు.

ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా తన సంప్రదాయ మిత్రులను కోల్పోతుందనే ఆందోళనను సూచిస్తున్నాయి. కానీ భారత్‌ను దూరం చేసుకున్నది ఎవరూ కాదు, భారత్ తన జాతీయ ప్రయోజనాలను అనుసరిస్తూ స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. భవిష్యత్‌లో కూడా భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తుంది. ట్రంప్ బాధలో అమెరికా తన వైఫల్యాలను గ్రహించి, ప్రపంచంలో తన స్థానాన్ని తిరిగి బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. భవిష్యత్‌లో అమెరికా-భారత్ సంబంధాలు ఎలా ముందుకు వెళ్తాయి.. భారత్ తన స్వతంత్రతను ఎలా నిలబెట్టుకుంటుంది అనేది ఆసక్తికరమైన ప్రశ్న.