పుతిన్ ని సరికొత్తగా బెదిరించిన ట్రంప్.. అదే జరిగితే..?
ఈ లోపే పుతిన్ కు బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పారు ట్రంప్. ఇందులో భాగంగా ఉక్రెయిన్ కు క్షిపణుల సాయంపై మాట్లాడారు.
By: Raja Ch | 17 Oct 2025 11:10 AM ISTమరికొన్ని రోజుల్లో హంగరీ రాజధాని బుడాపెస్ట్ లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో అమెరికా అధ్యక్షుడు భేటీ కానున్నారు. అక్కడి చర్చల్లోనైనా రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ముగింపునకు అడుగులు పడాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలిపారు. ఈ లోపే పుతిన్ కు బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పారు ట్రంప్. ఇందులో భాగంగా ఉక్రెయిన్ కు క్షిపణుల సాయంపై మాట్లాడారు.
అవును... తనను తాను ప్రపంచానికి శాంతి దూతగా అభివర్ణించుకుంటున్న ట్రంప్.. తాను అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో ఎనిమిది యుద్ధాలు ఆపినట్లు ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఎన్ని ఆపినా, ఆఖరికి ఇజ్రాయెల్ - ఇరాన్, ఇజ్రాయెల్ – హమాస్ వంటి భీకర వార్ లను ఆపినా కానీ... ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు!
అయినప్పటికీ ఆ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పే అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ను నయానో, బయానో ఒప్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఉక్రెయిన్ కు దీర్ఘశ్రేణి తోమహాక్ క్షిపణులు.. 2,000 వరకు అందజేయాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ తాజాగా తెలిపారు.
ఈ విషయాన్ని తాజాగా వెల్లడించిన ట్రంప్.. దీనిపై పుతిన్ తో ఫోన్ కాల్ మాట్లాడినట్లు తెలిపారు. అయితే పుతిన్ నుంచి బలమైన వ్యతిరేకత వ్యక్తమైందని అన్నారు. ఇదే విషయాన్ని క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ ధృవీకరించారు. ట్రంప్ తో ఫోన్ కాల్ లో ఈ తోమహాక్ క్షిపణుల గురించి పుతిన్ మాట్లాడారని తెలిపారు. అవి ఉక్రెయిన్ కు అందజేస్తే.. అమెరికా - రష్యా సంబంధాలు దెబ్బతింటాయని పుతిన్ ఉద్ఘాటించినట్లు తెలియజేశారు.
ఏమిటీ తోమహాక్ క్షిపణుల ప్రత్యేకత?:
తోమాహాక్ ల్యాండ్ అటాక్ క్షిపణి ఉక్రెయిన్ కోరుతున్న తాజా హై-ప్రొఫైల్ ఆయుధం, ఎందుకంటే ఇది ఖచ్చితమైన దాడులను ప్రారంభించే కైవ్ సామర్థ్యాన్ని గణనీయంగా విస్తరిస్తుంది. ఇందులో భాగంగా... సుమారు 2,500 కిలోమీటర్ల పరిధితో ఈ క్షిపణులు మాస్కోతో సహా రష్యాలోని ఎక్కడికైనా చేరుకోగలవు. ఫలితంగా రష్యాకు పెను నష్టం సంభవించే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా... వాషింగ్టన్ కు చెందిన థింక్ ట్యాంక్ అయిన ఇనిస్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ విశ్లేషకులు స్పందిస్తూ... కనీసం 1,900 రష్యన్ సైనిక లక్ష్యాలు 2,500 కి.మీ వేరియంట్ తోమాహాక్ పరిధిలో ఉంటాయని నిర్ధారించారు. ఇవి సుమారు 6 మీటర్ల పొడవు, 1,500 కిలోల బరువు కలిగి.. దాదాపు 450 కిలోల పేలోడ్ ను మోయగల ఖచ్చితత్వ గైడెడ్ క్షిపణులు.
