Begin typing your search above and press return to search.

ట్రంప్ - పుతిన్ భేటీలో గెలుపెవరిది... తెరపైకి ఇంట్రస్టింగ్ కామెంట్స్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య ఉక్రెయిన్‌ యుద్ధం ముగించే విషయంపై అలాస్కా వేదికగా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   17 Aug 2025 11:36 AM IST
ట్రంప్ - పుతిన్  భేటీలో గెలుపెవరిది... తెరపైకి ఇంట్రస్టింగ్  కామెంట్స్!
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య ఉక్రెయిన్‌ యుద్ధం ముగించే విషయంపై అలాస్కా వేదికగా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ చర్చల్లో అక్కడ ఎలాంటి ఒప్పందం కుదరనప్పటికీ.. ఈ భేటీపై అటు అమెరికా, రష్యాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. అదే... ఈ భేటీలో పుతిన్ వాయిస్ బాగా పెరగగా.. ట్రంప్ జావకారిపోయారాని!

అవును... అలాస్కా వేదికగా ట్రంప్‌, పుతిన్‌ మధ్య ఉక్రెయిన్‌ యుద్ధం ముగించే విషయంపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీలో యుద్ధం ముగించేందుకు పుతిన్‌ ఓ కీలక డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... యుద్ధం ముగించాలంటే తూర్పున ఉన్న దొనెట్‌ స్క్‌ ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌ పూర్తిగా వైదొలగాలని ఆయన డిమాండ్‌ చేసినట్లు కథనాలొస్తున్నాయి.

మరోవైపు చర్చల నిమిత్తం అలాస్కాకు వచ్చిన పుతిన్‌ ను ట్రంప్‌ స్వయంగా స్వాగతించడంతోపాటు రెండు దేశాల మధ్య సంబంధాలను కొనియాడారు. ఇదే సమయంలో.. రష్యా బలమైన దేశమని, ప్రపంచంలో రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. అయితే... ఇన్ని రోజులుగా చెబుతున్న శాంతిస్థాపనకు కాల్పుల విరమణను పాటించాలనే విషయాన్ని వదిలేసిన పరిస్థితి!

దీనికి బదులు పూర్తిస్థాయి శాంతి ఒప్పందం కుదరడానికే తాను అనుకూలమని ట్రంప్‌ చెప్పారు. వాస్తవానికి చాలాకాలం నుంచి రష్యా ఇదే చెబుతోంది. ఈ సందర్భంగా... ఈ హడావుడి అలాస్కా చర్చలు ట్రంప్‌ కు ఎలాంటి ప్రయోజనం కలిగించలేదని.. పుతిన్‌ మాత్రం తాను కోరుకున్నవాటిలో చాలావరకు పొందగలిగారని రష్యాలో బ్రిటన్‌ మాజీ రాయబారి లారీ బ్రిస్టో విశ్లేషించారు.

ఇదే సమయంలో... సైనికపరంగా గెలవలేమని పుతిన్‌ పూర్తిగా భావిస్తే తప్ప యుద్ధం ఆగదని మాజీ బ్రిస్టో అంచనా వేస్తున్నారు. ఇక.. రష్యాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా అడ్డుకోవడం ప్రధాన లక్ష్యంగా అలాస్కాకు వచ్చిన పుతిన్‌.. ఆ లక్ష్యం నెరవేర్చుకున్నట్లేనని లండన్‌ లోని రాయల్‌ యునైటెడ్‌ సర్వీసెస్‌ ఇనిస్టిట్యూట్‌ అంతర్జాతీయ భద్రత డైరెక్టర్‌ నీల్‌ మెల్విన్‌ తెలిపారు.

కాగా... మూడున్నరేళ్లకు పైగా సాగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమింపజేసేందుకు అలాస్కా వేదికగా పుతిన్‌ తో ట్రంప్ సుమారు రెండున్నర గంటలసేపు భేటీ అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ భేటీలో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఈ విషయంలో తాము విఫలమైనట్లు ఇద్దరు నేతలు అంగీకరించడం గమనార్హం.

ఈ క్రమంలో... తదుపరి సమావేశం కోసం మాస్కోకు రావాలని ట్రంప్‌ ను పుతిన్‌ ఆహ్వానించారు. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సోమవారం వాషింగ్టన్ లో ట్రంప్‌ తో భేటీ కానున్నారు. మరి ఆ భేటీ ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది వేచి చూడాలి.