Begin typing your search above and press return to search.

నన్ను గెలిపిస్తే మనిషికి 5వేల డాలర్లు.. ఓట్ల కోసం అమెరికన్లకు ట్రంప్ బిస్కెట్

అమెరికా రాజకీయాల్లో ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి.. ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన హామీతో ముందుకు వచ్చారు.

By:  A.N.Kumar   |   10 Sept 2026 11:13 AM IST
నన్ను గెలిపిస్తే మనిషికి 5వేల డాలర్లు.. ఓట్ల కోసం అమెరికన్లకు ట్రంప్ బిస్కెట్
X

అమెరికా రాజకీయాల్లో ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి.. ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన హామీతో ముందుకు వచ్చారు. రాబోయే మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధిస్తే దేశంలోని ప్రతి వయోజన పౌరుడికి 5,000 డాలర్లు (సుమారు రూ. 4.15 లక్షలు) నగదు డివిడెండ్ అందిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రంప్ వేసిన ఈ పెద్ద ప్లాన్ ప్రస్తుతం ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

డల్లాస్‌లో జరిగిన రిపబ్లికన్ మిడ్‌టర్మ్ కన్వెన్షన్‌లో ప్రసంగిస్తూ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల్లో నుంచి షేర్‌హోల్డర్లకు డివిడెండ్ ఇచ్చే విధానాన్ని ఆయన ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నారు. "అమెరికా అనేది ఒక అతిపెద్ద కంపెనీ లాంటిది. నా నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ సాధించే విజయాల ఫలాలు నేరుగా ప్రజలకే చెందాలి" అని వ్యాఖ్యానించారు. ఈ పథకానికి “ట్రంప్ డివిడెండ్” అని పేరు పెట్టారు.

అయితే ఈ $5,000 ఆఫర్‌కు ట్రంప్ ఒక ఆసక్తికరమైన షరతు విధించారు. ప్రభుత్వం అందించే ఈ నిధులను అమెరికా సరిహద్దులు దాటి బయట ఖర్చు చేయడానికి వీలుండదు. ఈ డబ్బును దేశీయంగానే వస్తువులు, సేవల కొనుగోలుకు ఉపయోగించడం ద్వారా స్థానిక వ్యాపారాలు పుంజుకుని, అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని ఆయన విశ్లేషించారు.

ఈ భారీ ఆఫర్ పొందడానికి ఎన్నికల ఫలితాలతో నేరుగా ముడిపడి ఉన్న ఒక నిబంధనను కూడా చెప్పారు. ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) , సెనేట్.. ఈ రెండింటిలోనూ రిపబ్లికన్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తేనే ఈ ప్రతిపాదన చట్టంగా మారుతుందని స్పష్టం చేశారు. ప్రకటన ఘనంగా ఉన్నప్పటికీ, దీని అమలుపై ఆర్థిక నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వందల మిలియన్ల మంది పౌరులకు చెల్లించడానికి అవసరమైన శతకోటి డాలర్ల బడ్జెట్‌ను ప్రభుత్వం ఎలా సమకూరుస్తుంది? కాంగ్రెస్ ఆమోదం పొందడం, ఇతర చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడం ఎంతవరకు సాధ్యం? మార్కెట్లోకి ఇంత భారీగా నగదును వదిలితే ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందా? అన్నది డౌట్ కొడుతోంది.

ఏది ఏమైనప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాధారణ అమెరికన్ ఓటర్లను ఆకర్షించేందుకు ట్రంప్ విసిరిన ఈ "5,000 డాలర్ల బిస్కెట్" మిడ్‌టర్మ్ ఎన్నికల ప్రచారంలో అత్యంత కీలకమైన అంశంగా మారబోతోంది. అది ట్రంప్ కు ఓట్ల వర్షం కురుస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.