ట్రంప్ మిడ్‌నైట్ 2PM బాంబ్: భారత్‌పైనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
By: A.N.Kumar | 6 Aug 2025 3:47 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయన ప్రకటించిన మీడియా సమావేశం తాలూకు సమయం, పరిస్థితులు గమనిస్తే అంతర్జాతీయ రాజకీయాల్లో ఏదో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్ ప్రకటనపై ఉత్కంఠ
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 2:00 గంటలకు) ట్రంప్ ఓవల్ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైట్‌హౌస్ ధృవీకరించడంతో ఆయన ఏం చెప్పబోతున్నారు అన్న ఉత్కంఠ అంతర్జాతీయంగా నెలకొంది.
భారత్‌పై సుంకాల ప్రకటనేనా?
ఇటీవలి రోజుల్లో భారత్‌పై ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. “భారత్ మంచి వ్యాపార భాగస్వామి కాదు” అంటూ ఆయన ఆరోపించగా, రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తున్నదాన్ని టార్గెట్ చేశారు. మాస్కోకు ఈ కొనుగోళ్లు నేరుగా "యుద్ధ ఇంజిన్‌కి ఇంధనం" అందిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో భారత్‌పై ఇప్పటికే 25% టారిఫ్‌లు విధించిన ట్రంప్, కొత్తగా మరిన్ని సుంకాలు విధించే అవకాశం ఉందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ మీడియా సమావేశంలో అదే ప్రస్తావన ఉండవచ్చన్న అనుమానాలు వెల్లివిరుస్తున్నాయి.
రష్యాపై ఆంక్షల వైపు?
ఇక అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కోఫ్ ప్రస్తుతం మాస్కోలో పర్యటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరగబోయే భేటీ అనంతరం కీలక ప్రకటనలున్నాయన్న సంకేతాలు ట్రంప్ ఇప్పటికే ఇచ్చారు. రష్యా కాల్పుల విరమణకు అంగీకరించకపోతే ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇతర రంగాల్లోనూ కీలక మార్పులు?
ఇక ట్రంప్ విమర్శల జాడలో అమెరికా బ్యాంకులు, ఫెడరల్ రిజర్వ్ వ్యవస్థ కూడా ఉన్నాయి. బ్యాంకులు రాజకీయ వివక్ష చూపుతున్నాయని ఆయన ఆరోపించగా, ఫెడ్ ఛైర్మన్ పదవి కోసం నలుగురు నామినీలు పోటీ పడుతున్నారని వెల్లడించారు. అదికూడా ఆయన రేపు ప్రకటించే అంశాల్లో ఒకటై ఉండే అవకాశముంది. అంతేకాదు సెమీకండక్టర్లు, ఫార్మా రంగాలపై త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటానని గతంలో ట్రంప్ చెప్పిన మాటలు కూడా ఈ సందర్భంగా గుర్తుకు వస్తున్నాయి.
ట్రంప్ ఈ మిడ్‌నైట్ బాంబ్ ప్రకటనతో ప్రపంచ రాజకీయాలు, గ్లోబల్ మార్కెట్లు ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇది భారత్‌పైనా సుంకాల బాంబా? లేక రష్యాపై ఆంక్షల ప్రబల సంకేతమా? అన్నది అర్ధరాత్రి రెండు గంటలకు తేలనుంది.
