'ఆమె పెదాల కదలిక చాలా అందంగా ఉంటుంది'... ట్రంప్ పొగడ్తలు!
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు.
By: Raja Ch | 2 Aug 2025 9:00 PM ISTవైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. తాజాగా 'న్యూస్ మాక్స్'లో రాబ్ ఫిన్నెర్టీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... అమెరికాకు అధ్యక్షుడిగా సేవలు అందించిన అందరు అధ్యక్షుల్లో తనకు మాత్రమే అద్భుతమైన, ఉత్తమ ప్రెస్ సెక్రటరీ ఉందని కరోలిన్ లీవిట్ ను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు.
అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ను ప్రశంసించారు. ఆమె మెదడు, ముఖం, పెదవులపై ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. 27 ఏళ్ల ఆమె పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ.. గతంలో ఏ అధ్యక్షుడిగా దొరకని అద్భుతమైన ప్రెస్ సెక్రటరీ తనకు దొరికిందని వ్యాఖ్యానించారు.
ఆగస్టు 1న ప్రసారమైన ఈ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ... "ఆమె ఒక స్టార్ అయ్యింది. ఆ ముఖం, ఆ మెదడు, ఆ పెదవులు, అవి కదిలే విధానం.. ఆమె ఒక మెషిన్ గన్ లాగా కదులుతుంది.. ఆమె ఒక స్టార్, ఆమె నిజానికి గొప్ప వ్యక్తి" అని ట్రంప్ అన్నారు. కరోలిన్ లీవిట్ కంటే ఉత్తమ ప్రెస్ సెక్రటరీ ఎవరికీ లేదని నేను అనుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు.
అదే ఇంటర్వ్యూలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా... 2016 ఎన్నికల్లో తాను విజయం సాధించిన తర్వాత తన పాలనను నియంత్రించేందుకు ఒబామా సన్నిహిత వర్గాలు అసత్య ప్రచారం చేశాయని మండిపడ్డారు. ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందంటూ తప్పుడు వాదన తెచ్చారని ఆరోపించారు.
దీనికి ఆయన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇది అమెరికా దేశ చరిత్రలో గొప్ప కుంభకోణాలలో ఒకటి అని తాను అనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. అయినప్పటికీ.. క్లింటన్, ఒబామా లేదా ఇతరులపై వచ్చే నేరారోపణల విషయంలో తాను తటస్థంగా ఉంటానని ట్రంప్ వెల్లడించారు.
ఇదే సమయంలో తన మాజీ సహచరుడు జెఫ్రీ ఎప్ స్టీన్ కు మైనర్లను అక్రమంగా రవాణా చేసినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న మాక్స్ వెల్ గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ఈ కేసు గురించి తనకు ఏమీ తెలియదని.. ఈ వ్యవహారంలో తాను ఇంతకు ముందు ప్రజలకు క్షమాపణలు చెప్పానని తెలిపారు.
ఇక.. ఇటీవలే కుట్ర, లైంగిక అక్రమ రవాణా ఆరోపణల నుండి విముక్తి పొందిన కాంబ్స్ నుండి క్షమాపణ అభ్యర్థన అందినట్లు ట్రంప్ ధృవీకరించారు.
