ఆ దేశాన్ని టచ్ చేస్తే అమెరికాకు భస్మాసుర హస్తమే?
వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ ముదురో ను కిడ్నాప్ చేసిన ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లో అహంకారం పెరిగిందనే విమర్శలు అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తున్నాయి.
By: A.N.Kumar | 14 Jan 2026 1:54 PM ISTవెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ ముదురో ను కిడ్నాప్ చేసిన ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లో అహంకారం పెరిగిందనే విమర్శలు అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తున్నాయి. “ఎక్కడైనా, ఎప్పుడైనా చొరబడగలం” అన్న ధోరణితో ట్రంప్ ముందుకెళ్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే తదుపరి లక్ష్యంగా ఇరాన్ పేరు వినిపిస్తోంది. ఇరాన్‌పై సైనిక చర్యలకు అమెరికా సిద్ధమవుతోందన్న ప్రచారం పెరుగుతోంది. అయితే ఇరాన్‌ను టచ్ చేస్తే… అది అమెరికాకే కాదు.. మొత్తం ప్రపంచానికే పెను ప్రమాదంగా మారుతుందన్న హెచ్చరికలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఇరాన్‌కు బలమైన సైనిక శక్తి
ఇరాన్ ఆధునిక క్షిపణులు, డ్రోన్ దళాలు, సైబర్ యుద్ధ సామర్థ్యంతో సిద్ధంగా ఉంది. అమెరికా దాడి జరిగితే హోర్ముజ్ జలసంధి మూసివేత అనివార్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 25 శాతం రవాణా జరుగుతుంది. ఇది నిలిచిపోతే పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరతలు చెలరేగే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్‌కు రహస్య ముప్పు
ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా అడుగులు వేస్తే హూతీలు, హిజ్‌బుల్లా, ఇరాక్‌లోని మిలిటెంట్ గ్రూపులు అమెరికా–ఇజ్రాయెల్ లక్ష్యాలపై తిరుగుబాటుకు దిగే ప్రమాదం ఉంది. మరోవైపు రష్యా, చైనా నేరుగా యుద్ధంలోకి దిగకపోయినా ఇరాన్‌కు సాంకేతిక, దౌత్య సహకారం అందించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది అమెరికాను అంతర్జాతీయంగా ఒంటరిగా నిలబెట్టే పరిస్థితికి దారితీయవచ్చు.
గ్రీన్‌ల్యాండ్ స్వాధీన ప్రకటనతో నాటోలో చీలిక
ట్రంప్ తరచుగా గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించడం మరో వివాదానికి దారి తీస్తోంది. ఈ విషయంలో డెన్మార్క్ పై ఒత్తిడి పెరుగుతోంది. డెన్మార్క్ ఒక నాటో సభ్యదేశం కావడంతో దాన్ని టచ్ చేస్తే నాటో మిత్రదేశాలు అమెరికాకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇది పశ్చిమ దేశాల ఐక్యతను దెబ్బతీయవచ్చని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విదేశీ దాడి… ప్రభుత్వానికి ప్రజా మద్దతు?
ఇరాన్‌లో అంతర్గత అసంతృప్తి ఉన్నప్పటికీ విదేశీ దాడి జరిగితే అదే ప్రభుత్వానికి ప్రజా మద్దతుగా మారే అవకాశముంది. చరిత్ర చూస్తే, బయటి శత్రువు ఎదురైనప్పుడు ప్రజలు తమ ప్రభుత్వానికి అండగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ట్రంప్ ఈ వాస్తవాలను పూర్తిగా అర్థం చేసుకోకపోతే పరిస్థితులు చేయిదాటి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.
ఇరాన్‌పై దాడి అనేది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధంగా మిగలదు. అది మధ్యప్రాచ్యం నుంచి యూరప్, ఆసియా వరకు ప్రభావం చూపే ప్రపంచ సంక్షోభంగా మారుతుంది. అమెరికా తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు ప్రపంచ సమీకరణాలను పూర్తిగా మార్చివేసే శక్తి కలిగి ఉన్నాయి. కాబట్టి “ఆ దేశాన్ని టచ్ చేస్తే.. భస్మమయ్యేది అమెరికానే” అన్న హెచ్చరికను తేలికగా తీసుకోలేమన్నదే అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల మాట.
