Begin typing your search above and press return to search.

ఆ మూడు దేశాలతో పెద్దన్నకు మూడినట్లే !

అంతర్జాతీయంగా అమెరికా పెద్దన్న పాత్రకు తగ్గింపు మొదలవుతోంది. భారీ సుంకాలతో మిత్ర దేశాలను సైతం శత్రు దేశాలుగా ట్రంప్ మార్చుకుంటున్నారు.

By:  Satya P   |   7 Aug 2025 5:00 AM IST
ఆ మూడు దేశాలతో పెద్దన్నకు మూడినట్లే !
X

అంతర్జాతీయంగా అమెరికా పెద్దన్న పాత్రకు తగ్గింపు మొదలవుతోంది. భారీ సుంకాలతో మిత్ర దేశాలను సైతం శత్రు దేశాలుగా ట్రంప్ మార్చుకుంటున్నారు. ఆయన వైఖరితో భవిష్యత్తులో అగ్రరాజ్యం ఇబ్బందుల పాలు అవుతుందని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. ట్రంప్ వైఖరితో పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి భారీగానే గండి పడబోతోంది. రానున్న కాలంలో భారత్ చైనా రష్యా కలిస్తే మాత్రం పెద్దన్నకు మూడినట్లే అని అంటున్నారు.

భారత్ ని కోల్పోతున్నారు :

ఈ ప్రపంచంలో అత్యంత విశ్వసనీయత కలిగిన దేశంగా భారత్ ఉంది. ఎన్నో సార్లు భారత్ అమెరికా సహజ మిత్రులు అని చెప్పిన అమెరికా ఈ రోజు తన నిజ స్వరూపం బయటపెట్టుకుంటోంది అని అంటున్నారు. నిజం చెప్పాలంటే అమెరికా ఎపుడూ భారత్ పట్ల నిజమైన స్నేహం చూపించలేదనే అంతా అంటారు. 1971లో పాకిస్తాన్ తో భారత్ కి జరిగిన యుద్ధంతో అమెరికా పాక్ కొమ్ము కాసింది. ఆయుధాలను సరఫరా చేయడమే కాకుండా ఎంతో సాయం చేసింది అన్నది చెబుతారు. ఆ సమయంలో భారత్ కి ఉన్న ఒకే ఒక మిత్ర పక్షం రష్యా. అయినా సరే భారత్ అమెరికాతో స్నెహం నెరిపింది కానీ భారత్ ని పోగొట్టుకోవడానికి ట్రంప్ సాహసిస్తున్నారు అంటే అమెరికా వైఖరి ఏమిటో చాటి చెప్పినట్లు అయింది అని అంటున్నారు.

అమెరికాకే నష్టమా :

భారత్ మీద లేని పోని ఆంక్షలు పెడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన దూకుడు కొనసాగిస్తున్న వేళ ఈ పరిణామాలలో అసలు నష్టపోయేది ఎవరు అన్నది చర్చగా ఉంది. అయితే తాత్కాలికంగా భారత్ కి ఇబ్బంది జరిగినా భవిష్యత్తులో మాత్రం అంతా బాగానే ఉంటుందని అంటున్నారు. భారత్ తన ఆలోచనలకు పదును పెట్టడంతో పాటు సరికొత్త మార్కెట్ ని అన్వేషించుకేందుకు ఇదే మార్గంగా కనిపిస్తోంది. అంతే కాదు భారత్ దీనికి ఒక సవాల్ గా తీసుకుంటే కనుక అగ్ర రాజ్యానికి చుక్కలు కనిపించినట్లే అని అంటున్నారు.

చైనాకి మోడీ :

మరో వైపు చూస్తే అగ్ర రాజ్యం భారత్ మీద సుంకాలను యాభై శాతానికి పెంచుతున్న నేపధ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది. 2019 తరువాత భారత ప్రధాని చైనా వెళ్ళడమిదే ఇదే తొలిసారి అని చెప్పాలి. చైనా భారత్ కనుక వ్యూహాత్మకమైన స్నేహానికి తెర తీస్తే కచ్చితంగా అది అమెరికాకు అతి పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుందని అంటున్నారు భారత్ కి అటు రష్యా మిత్రుడిగా ఎటూ ఉన్నారు. చైనా విషయంలో కూడా రష్యా మిత్రుడే. మొత్తానికి ఈ మూడు దేశాల మధ్య కనుక ఒక అరుదైన స్నేహం ఏర్పడితే పాశ్చాత్య దేశాల పెత్తనానికి తీర పడుతుంది అని అంటున్నారు.