రష్యాపైకి అమెరికా ‘తోమహాక్’..! ట్రంప్ గట్టి వార్నింగ్..
ప్రపంచ రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగ మారింది. “నేను ఏడు యుద్ధాలను ఆపాను.. ఇప్పుడు ఎనిమిదో యుద్ధం ఆపబోతున్నాను’ అనే ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికలపై కొత్త చర్చకు దారితీశాయి.
By: Tupaki Political Desk | 13 Oct 2025 10:51 AM ISTఎంతో ఆశగా ఎదురు చూసినా ట్రంప్ కు ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి మాత్రం దక్కలేదు. తానే యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్నా.. నోబెల్ కమిటీ మాత్రం గుర్తించలేదు. భారత్-పాక్ యుద్ధాన్ని తాను ఆపానని చెప్పుకుంటున్నా.. భారత్ మాత్రం ఇందులో వాషింగ్టన్ ప్రమేయం ఏమాత్రం లేదని నొక్కి చెప్తూనే ఉంది. అయినా ట్రంప్ మాత్రం టారీఫ్ తోనే దీన్ని ఆపానని చెప్పుకుంటూనే ఉన్నడు. ట్రంప్ శైలిలోని విభిన్నతే ఆయనకు ప్రజాదరణ తెచ్చింది. కానీ అదే శైలి ప్రపంచ రాజకీయాల్లో కొత్త ముప్పులను కూడా తెస్తోంది. ఒకవైపు ఆయన ‘యుద్ధాలను ఆపుతున్నానని’ చెబుతుంటే, మరోవైపు ‘తోమహాక్ క్షిపణులు ఇవ్వగలను’ అని హెచ్చరించడం వింటే ఆశ్చర్యం వేస్తుంది.
మరోసారి ప్రపంచ రాజకీయ పటంలోకి ట్రంప్..
ప్రపంచ రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగ మారింది. “నేను ఏడు యుద్ధాలను ఆపాను.. ఇప్పుడు ఎనిమిదో యుద్ధం ఆపబోతున్నాను’ అనే ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికలపై కొత్త చర్చకు దారితీశాయి. గాజా ఒప్పందం కోసం పశ్చిమాసియాకు బయల్దేరిన ఆయన ఫ్లయిట్ లో విలేకరులతో మాట్లాడారు. ట్రంప్ మాటలు చూస్తే ఆయన దౌత్య శైలి ఎంత విభిన్నమో స్పష్టమవుతుంది. పాక్–అఫ్గాన్ యుద్ధంపై స్పందిస్తూ.. ‘నేను తిరిగి వచ్చేలోపే యుద్ధం ఆగుతుంది’ అని చెప్పడం, ఒకవైపు ఆత్మవిశ్వాసంగా కనిపిస్తే, మరోవైపు అంతర్జాతీయ దౌత్యానికి ఒక విస్మయకర శైలి అనిపిస్తోంది.
ఆర్థిక ఒత్తిడే ఆయుధం..
ట్రంప్ దౌత్య విధానం సైనిక దాడులకంటే ఆర్థిక ఒత్తిళ్లను ఆధారంగా చేసుకుంటుంది. ఆయుధాల బదులు ‘టారిఫ్’లను ఉపయోగించడం ఆయన స్టయిల్. భారత్–పాక్ యుద్ధ ఇరుదేశాలపై భారీ శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించడం ద్వారా కేవలం 24 గంటల్లో యుద్ధం ఆగిపోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆర్థిక దౌత్యం ఎంత ప్రభావవంతంగా మారగలదో సూచిస్తుంది. అయితే, ప్రపంచ వ్యవస్థలో టారిఫ్‌లు కేవలం ఆర్థిక సాధనం మాత్రమే. వాటిని నిరంతరంగా ఒత్తిడి పద్ధతిగా వాడడం దీర్ఘకాలంలో సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
ట్రంప్ నోట ‘తోమహాక్’
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి సంబంధించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. ‘మాస్కో రాజీకి రాకపోతే కీవ్‌కు తోమహాక్ క్షిపణులను అందజేస్తాను’ అని ట్రంప్ అన్నారు. కేవలం మాట కాదు, ప్రపంచ శాంతి స్థితిని ప్రభావితం చేసే హెచ్చరిక ఇదని నిపుణులు అంటున్నారు.
‘తోమహాక్’ (Tomahawk Land Attack Missile – TLAM) అమెరికా సముద్ర దళానికి గర్వకారణం. దీని అభివృద్ధి 1970లో ప్రారంభమై, 1983 నాటికి సైన్యం చేతికి వచ్చింది. దీని పొడవు సుమారు 5.6 మీటర్లు, బరువు దాదాపు 1.5 టన్నులు. ఇది సముద్రం తలం నుంచి, జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. 1600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని 880 కిలోమీటర్ల వేగంతో ఛేదించగలదు.
దీనిలోని జీపీఎస్, ఇనర్షల్ నావిగేషన్ వ్యవస్థలు రియల్‌టైమ్ డేటా లింక్‌లు దీన్ని అత్యంత ఖచ్చితమైన ఆయుధంగా నిలబెట్టాయి. ఇది ఉపరితలానికి కేవలం 30–35 మీటర్ల ఎత్తులో ఎగిరే సామర్థ్యం కలిగి ఉండడంతో రాడార్లు దీన్ని గుర్తించడానికి కష్టం అవుతుంది. ఇరాక్ యుద్ధం (డిజర్ట్ స్ట్రామ్)లో మొదటిసారి దీన్ని వాడిన అమెరికా, 42 రోజుల్లో 297 క్షిపణులను ప్రయోగించింది. ఒక్కో తోమహాక్ ఖరీదు సుమారు 2 మిలియన్ డాలర్లు, అంటే రూ. 16 కోట్లకు పైగా. ఈ క్షిపణి ఒక్కదానితో శత్రు కమాండ్ సెంటర్లను సునాయాసంగా ధ్వంసం చేయగల శక్తి ఉంది.
రష్యా కఠిన హెచ్చరిక
ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా తీవ్రంగా స్పందించింది. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ ‘ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులు అందిస్తే, మాస్కో–వాషింగ్టన్ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి’ అని హెచ్చరించారు. స్పష్టంగా చెప్పాలంటే, రష్యా ఆ క్షిపణిలో అణ్వాయుధం ఉందని భావిస్తుందని, అప్పుడు సైన్యమే తగిన ప్రతిస్పందన ఇస్తుందని తెలిపారు. ఇది అణు యుద్ధ భయాన్ని మళ్లీ ప్రపంచంలో ముందుకు తెస్తోంది. ఇప్పటికే రష్యా–ఉక్రెయిన్ ఘర్షణతో యూరప్ అస్థిరంగా ఉంది. అటువంటి సమయంలో అమెరికా నుంచి కొత్త ఆయుధ సహాయం ముఖ్యంగా తోమహాక్ వంటి దూకుడు క్షిపణుల ప్రస్తావన అంతర్జాతీయ శాంతికి మరింత ప్రమాదం.
యుద్ధాలను ఆపాలంటే ఆయుధాల వాడకం కాదు ఇరు దేశాలు మాట్లాడుకోవాలి.. రాజనీతికి ప్రాధాన్యతివ్వాలి. ట్రంప్ లాంటి నాయకులకూ.. పుతిన్ లాంటి ప్రత్యర్థులకూ శాంతి సాధనలో సమన్వయం అవసరం. లేకపోతే, ‘తోమహాక్’ వంటి శక్తివంతమైన క్షిపణి మానవజాతి శాంతికి మరొక నిశ్శబ్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంది.
