Begin typing your search above and press return to search.

ట్రంప్ ను లేపేయడానికి స్పాట్ పెట్టారు.. కలకలం

అధ్యక్ష ఎన్నికల సమయంలో రెండుసార్లు దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ట్రంప్‌కు, వైట్ హౌస్ లోకి వచ్చి అమెరికా అధ్యక్షుడిగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న తర్వాత కూడా ప్రాణగండం తొలగిపోలేదని తాజా ఘటన రుజువు చేస్తోంది.

By:  A.N.Kumar   |   20 Oct 2025 3:00 PM IST
ట్రంప్ ను లేపేయడానికి స్పాట్ పెట్టారు.. కలకలం
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రత విషయంలో మరోసారి పెద్ద ప్రమాద సూచన వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల సమయంలో రెండుసార్లు దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ట్రంప్‌కు, వైట్ హౌస్ లోకి వచ్చి అమెరికా అధ్యక్షుడిగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న తర్వాత కూడా ప్రాణగండం తొలగిపోలేదని తాజా ఘటన రుజువు చేస్తోంది.

పామ్ బీచ్‌లో షాకింగ్ ఘటన

ఇటీవల ఫ్లోరిడాలోని పామ్ బీచ్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఒక పరిణామం అమెరికా పార్లమెంటరీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అధ్యక్షుడి విమానం 'ఎయిర్‌ఫోర్స్ వన్' ఆగే ప్రాంతానికి ఎదురుగా, గుర్తు తెలియని వ్యక్తులు ఒక 'స్నైపర్ నెస్ట్' (షార్ప్‌షూటర్ దాగి ఉండే గూడు) ఏర్పాటుచేసినట్లు భద్రతా అధికారులు గుర్తించారు. విమానం నిలిపే ప్రాంతానికి సుమారు 200 గజాల దూరంలో ఉన్న ఒక చెట్టుపై ఈ స్నైపర్ నెస్ట్ ఉంది. దుండగుడు చెట్టుపైకి ఎక్కడానికి వీలుగా నిచ్చెన ఏర్పాట్లు, వేటగాళ్ల గూడును పోలిన ఆకృతిని చూసి భద్రతా బృందం అప్రమత్తమైంది.

దీంతో, సెక్యూరిటీ బృందం వెంటనే స్పందించి, విమానాన్ని మరో సురక్షిత ప్రాంతానికి తరలించింది. అంతేకాకుండా, ట్రంప్‌ను ప్రధాన మెట్ల మార్గాన్ని కాకుండా, చిన్న మెట్ల ద్వారా జాగ్రత్తగా ఎయిర్‌ఫోర్స్ వన్లోకి చేర్చింది. ఇది ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన హత్యాయత్నం స్కెచ్ అయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

ఎఫ్‌బీఐ దర్యాప్తు షురూ

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అధికారులు.. అక్కడ పేలుడు పదార్థాలు లేవని, అనుమానిత వ్యక్తుల అవశేషాలు కూడా దొరకలేదని తెలిపారు. అయితే, ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎఫ్‌బీఐ (FBI) విస్తృత స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టింది. నిపుణుల పర్యవేక్షణలో అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు.

అమెరికాలో రాజకీయ నాయకులపై దాడులు కొత్తేమీ కాదు. గతంలో, ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో పెన్సిల్వేనియాలో దాడి జరిగింది. ఆ ఘటనలో కాల్పులు జరగగా, ట్రంప్ చెవికి గాయమైంది. ఆ సమయంలో సీక్రెట్ సర్వీస్ చురుగ్గా స్పందించి ఆయన్ని రక్షించింది. తాజా ఘటన ఫ్లోరిడాలోనే జరగడం అధ్యక్ష భద్రత పట్ల మరింత అప్రమత్తత అవసరమని చాటింది.

భద్రత మరింత కట్టుదిట్టం

ఈ ఘటన నేపథ్యంలో ట్రంప్ భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడే పరిమిత మెట్ల మార్గాన్ని వినియోగించడం, విమానాన్ని మారుమూల ప్రాంతాలకు తరలించడం వంటి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు.

భవిష్యత్తులో అదనపు భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి, అధ్యక్ష భద్రతకు సంబంధించి నూతన నియమావళి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ట్రంప్‌పై జరిగిన ఈ పక్కా స్కెచ్‌తో అమెరికన్ రాజకీయాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.