హైదరాబాద్ లో ‘ట్రంప్’ భారీ ప్లానింగ్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్వర్యంలోని ట్రంప్ ఆర్గనైజేషన్ భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టిసారించింది.
By: A.N.Kumar | 6 Aug 2025 2:00 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్వర్యంలోని ట్రంప్ ఆర్గనైజేషన్ భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టిసారించింది. భారత్‌ను ఒక ప్రధాన మార్కెట్‌గా చూసే ఈ సంస్థ గత దశాబ్దంలో ముంబై, పూణే, కోల్‌కతా, గురుగ్రామ్ వంటి నగరాల్లో ఇప్పటికే ఏడు ప్రాజెక్టులు పూర్తిచేసి రూ.175 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.
2024 నవంబర్ 5న ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే భారత్‌లో తమ వ్యాపార కార్యకలాపాలను వేగంగా విస్తరించేందుకు కార్యాచరణ ప్రారంభించారు. ట్రంప్ ఆర్గనైజేషన్‌కు భారతదేశంలో అధికారిక భాగస్వామిగా ఉన్న ట్రైబెకా డెవలపర్స్‌తో కలిసి — హైదరాబాద్, ముంబై, పూణే, నోయిడా, బెంగళూరు, గురుగ్రామ్‌లలో కొత్తగా ఆరు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రకటించారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తం ఎనిమిది మిలియన్ చదరపు అడుగుల నిర్మాణం జరగనుంది. ఇందులో మొదటి దశలో, హైదరాబాద్, ఫూణే, గురుగ్రాం లో సుమారు 4.3 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ గణాంకం, ట్రంప్ సంస్థ గత ఆర్థిక సంవత్సరం టార్గెట్‌తో పోల్చితే సగానికి పైగా ఉంది.
-బ్రాండ్ ఆధారిత ఆదాయం
ట్రంప్ ఆర్గనైజేషన్ ఈ నిర్మాణాల్లో నేరుగా పెట్టుబడి పెట్టదు. కానీ బ్రాండ్ లైసెన్సింగ్ లేదా డెవలప్‌మెంట్ ఫీజుల ద్వారా ఆదాయం పొందుతుంది. వీటిలో సాధారణంగా ప్రాజెక్టు విలువపై 3-5 శాతం వరకు లైసెన్స్ ఫీజు ఉంటుందని సమాచారం. ట్రంప్ బ్రాండ్ ను ఉపయోగించటం ద్వారా, ప్రాజెక్టులకు మార్కెట్లో అధిక డిమాండ్ ఏర్పడుతోంది.
భారీ ఆదాయ అంచనా
ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా సుమారుగా రూ.15,000 కోట్లకు పైగా ఆదాయం సాధ్యమవుతుందని ట్రైబెకా అంచనా వేసింది. ఈ ఏడాది మార్చిలో పూణేలో ట్రంప్ వారి మొట్టమొదటి వాణిజ్య అభివృద్ధి ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. భారత్‌లోని రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికే ఉన్న లోధా గ్రూప్, బ్రిగేడ్, మాక్స్, RIL వంటి ప్రముఖ సంస్థల సరసన ట్రంప్ బ్రాండ్ నిలిచే ప్రయత్నం చేస్తోంది.
హైదరాబాద్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి
ట్రంప్ ఆర్గనైజేషన్ వ్యాపార వ్యాప్తిని సూచిస్తూ అమెరికా ఎన్నికల కంటే ముందే అక్టోబర్ 16న “డీటీ మార్క్స్ హైదరాబాద్ ఎల్ఎల్సీ” అనే సంస్థను కూడా ట్రంప్ ప్రారంభించారు. ఇది హైదరాబాద్ ప్రాజెక్టులపై సంస్థ యొక్క ఆసక్తిని స్పష్టంగా తెలియజేస్తోంది.
ట్రంప్ & ట్రైబెకా సంబంధం
ట్రంప్ సంస్థకు భారత్‌లో భాగస్వామిగా ఉన్న ట్రైబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా, వార్టన్ స్కూల్ విద్యార్థిగా ట్రంప్‌ను పరిచయం కావడం ద్వారా ఈ భాగస్వామ్యం మొదలైందని చెబుతున్నాడు. ఈ పరిచయం ట్రంప్ బ్రాండ్‌ను భారత్‌కు తీసుకురావడానికి ప్రేరణగా మారింది.
మొత్తానికి, డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం తర్వాత ట్రంప్ ఆర్గనైజేషన్ భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింతగా కోరుతోంది. హైదరాబాద్ ప్రాజెక్టులతో పాటు, ఇతర ప్రధాన నగరాల్లో ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులు భారత రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త దిశనిచ్చే అవకాశం ఉంది. ట్రంప్ బ్రాండ్‌ను ఆశ్రయించే లగ్జరీ ప్రాజెక్టులు, భారత మార్కెట్లో ఎంతమేర విజయవంతమవుతాయో చూడాలి.
