Begin typing your search above and press return to search.

ట్రంప్ మళ్లీ కొంపముంచాడు.. లక్షడాలర్ల ఫీజుతో విద్యార్థులపై మోత మోగించాడు

అమెరికా కలలు కనే మన దేశీ కుర్రాళ్లకు డొనాల్డ్ తాత మరో సంచలన వరం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

By:  A.N.Kumar   |   31 July 2026 1:23 PM IST
ట్రంప్ మళ్లీ కొంపముంచాడు.. లక్షడాలర్ల ఫీజుతో విద్యార్థులపై మోత మోగించాడు
X

అమెరికా కలలు కనే మన దేశీ కుర్రాళ్లకు డొనాల్డ్ తాత మరో సంచలన వరం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. చదువు పూర్తయ్యాక కొద్దిరోజులు అక్కడ ప్రాక్టికల్ గా ఉద్యోగం చేసుకుందాం అని ఆశపడే పాపం ఎఫ్-1 స్టూడెంట్లకు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) రూపంలో రూ. 85 లక్షలు.. అంటే ఒక లక్ష అమెరికన్ డాలర్లు ఫీజు దండ వేసేందుకు వైట్ హౌస్ స్కెచ్ వేస్తోందట.. ఇప్పటివరకు డాలర్లు సంపాదించి.. ఎడ్యుకేషన్ లోన్లు తీర్చుకుందాం అనుకున్న వాళ్లకు... "ముందు ఆ డాలర్లు మా మొహాన పడేసి ఆ తర్వాతే ఉద్యోగం తీసుకోండి" అని చెప్పకనే చెప్తున్నారు.

100,000 డాలర్ల ఫీజా? అసలు అమెరికా వెళ్తున్నామా... లాటరీ టికెట్ కొంటున్నామా?

ఓపీటీ అనేది మన విద్యార్థులకు హెచ్-1బీ వీసా సాధించడానికి ఒక పక్కా వంతెన లాంటిది. కానీ కొత్తగా ఆలోచిస్తున్న ఈ ప్రతిపాదన చూస్తుంటే... "అమెరికాలో ఉద్యోగం అంటే ఉచితం కాదు బాస్.. అదొక సూపర్‌ లగ్జరీ ఐటమ్" అని రూడీగా చెప్పినట్లుంది. కొంపలమ్మి చదువుకున్నాక "అయ్యా.. ప్రాక్టికల్ అనుభవం కోసం ఉద్యోగం చేసుకుంటాం" అంటే... "ముందు ఆ రూ. 85 లక్షల చలానా కట్టు ఆపైన మీ మేనేజర్ ఇచ్చే తిట్లు విను" అన్నట్లుంది ఈ విచిత్ర ప్రతిపాదన. ఇప్పటికే డాలర్ రేటు చూసి గుండెలు పట్టుకుంటున్న సగటు భారతీయ తల్లిదండ్రులకు, ఈ వార్త నిజంగా నిద్రలేకుండా చేసే రకమే..

విదేశీ విద్యార్థులపై ప్రతాపం... యూనివర్సిటీలకు మాత్రం డబల్ షాక్

ట్రంప్ ప్రభుత్వానికి వీసాలు దుర్వినియోగం అవుతున్నాయనే అనుమానం ఉంటే ఉండొచ్చు. కానీ దానికి పరిష్కారం... చదువుకునే విద్యార్థుల జేబులకు చిల్లు పెట్టడమేనా? గతంలో హెచ్-1బీ వీసాకు కూడా ఇలాగే లక్ష డాలర్ల ప్రతిపాదన తెచ్చి కోర్టుల చుట్టూ తిరిగిన కథ మనకు తెలిసిందే. ఇప్పుడు ఓపీటీకి కూడా అదే మందు వేయాలనుకుంటున్నారు. అమెరికాలో ప్రతి నాలుగు అంతర్జాతీయ విద్యార్థులలో ఒకరు ఓపీటీలో ఉన్నారు. అందులో అత్యధికులు మన భారతీయులే. చదువు అయ్యాక ఉద్యోగం లేకపోతే అడ్మిషన్లు ఎవరు తీసుకుంటారు? ఫలితంగా అమెరికా విశ్వవిద్యాలయాలు ఖాళీ కావడం ఖాయం.. మరోవైపు ఎఫ్-1 వీసా గడువును కూడా నాలుగేళ్లకు పరిమితం చేస్తారట. అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విద్యార్థులను 'ప్యాక్' చేసి పంపించే ప్లాన్ అన్నమాట..

ఇకపై డిగ్రీ కన్నా... "డబ్బుల సంచే" ముఖ్యం

ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన అంతర్గత చర్చల దశలోనే ఉంది. కానీ ఇది గనుక నిజమైతే ఇకపై అమెరికా వెళ్లాలంటే తెలివితేటలు, మార్కులు మాత్రమే ఉంటే సరిపోదు... ఇంట్లో ఏకంగా ఒక మైనింగ్ కంపెనీ లేదా పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండి తీరాల్సిందే..

ఏదేమైనా "నమస్తే అమెరికా" అనుకుంటూ వెళ్లే విదేశీ విద్యార్థులకు ట్రంప్ మార్క్ "పన్నుల దెబ్బ" ఏ స్థాయిలో పడుతుందో వేచి చూడాలి..