అమెరికా కలల సౌధానికి గ్రహణం? రూ.95 లక్షల ఫీజు మోతతో భారతీయ విద్యార్థుల గుండెల్లో గుబులు
ఇది చాలదన్నట్లు విదేశీ నైపుణ్య నిపుణులను నియమించుకునే హెచ్-1బీ వీసాలపై కూడా కంపెనీలు చెల్లించాల్సిన రుసుమును $1,03,265కి పెంచేందుకు చట్రం సిద్ధమవుతోంది.
By: A.N.Kumar | 25 Aug 2026 10:50 AM ISTకళ్లల్లో వేయి ఆశలతో.. రెక్కలు ముడుచుకున్న పేద, మధ్యతరగతి తల్లిదండ్రుల జీవితకాల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి... సముద్రాలు దాటి అమెరికా నేలపై అడుగుపెట్టే వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై ఇప్పుడు తీవ్ర అనిశ్చితి మేఘాలు అలుముకున్నాయి. రాత్రింబవళ్లు కష్టపడి చదివి.. డిగ్రీ చేతికొచ్చాక ఉద్యోగం సాధించి తమ కష్టాలను గట్టెక్కిద్దామనుకున్న యువత కలలపై ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదిత నిర్ణయాలు సిడిపాతమై పడుతున్నాయి.
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)పై భారీ ఫీజు బాంబు
విదేశీ విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు ఎంతో కీలకమైన ఓపీటీ పై ఏకంగా 1,00,000 డాలర్ల.. మన భారతీయ కరెన్సీలో సుమారు ₹95 లక్షలకు పైగా ఫీజు విధించే దిశగా ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగాల్లో ప్రతిభ చాటుతూ చదువు పూర్తి కాగానే ఉద్యోగం చేసి తీసుకున్న విద్యారంగ రుణాలను తీర్చుకుందామని భావిస్తున్న భారతీయులకు ఇది కోలుకోలేని దెబ్బ. చదువుకే లక్షలు ధారపోసిన కుటుంబాలు, చదువు పూర్తయ్యాక పనిచేసే హక్కు కోసం మళ్లీ కోటి రూపాయల దాకా ఫీజు చెల్లించడమంటే సజీవ నరకమే.
హెచ్-1బీ వీసాలపైనా అదే దెబ్బ
ఇది చాలదన్నట్లు విదేశీ నైపుణ్య నిపుణులను నియమించుకునే హెచ్-1బీ వీసాలపై కూడా కంపెనీలు చెల్లించాల్సిన రుసుమును $1,03,265కి పెంచేందుకు చట్రం సిద్ధమవుతోంది. దీనివల్ల భారతీయ ఐటీ నిపుణులను నియమించుకునేందుకు అమెరికన్ కంపెనీలు వెనకాడే పరిస్థితి ఏర్పడుతుంది. కష్టపడి చదివినా.. ప్రతిభ ఉన్నా కేవలం ఈ భారీ రుసుముల భయం వల్ల అవకాశాలు చేజారిపోతాయేమోనని ప్రతిభావంతులు ఆందోళన చెందుతున్నారు.
బీ1/బీ2 వీసాలు, ఆశ్రయం దరఖాస్తులపై ఉక్కుపాదం
మరోవైపు పర్యాటక, వ్యాపార వీసాలపై వచ్చి అనంతరం ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 2 లక్షల మంది వీసాలను రద్దు చేసేందుకు కూడా కసరత్తు జరుగుతోంది. 2016 నుండి 2026 మధ్య కాలంలో జారీ చేసిన బీ1/బీ2 వీసాలపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం దృష్టి సారించడంతో అక్కడ నివసిస్తున్న ఎంతోమంది విదేశీయుల్లో భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
అయితే ఇవన్నీ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నప్పటికీ న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నప్పటికీ... అమెరికాను తమ భవిష్యత్తుగా నమ్ముకున్న వేలాదిమంది నమ్మకంపై ఈ వార్తలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. కష్టపడి పైకొద్దామనుకున్న మధ్యతరగతి కలలకి ఫీజుల రూపంలో రేట్లు కడుతుంటే.. ఇప్పుడు భారత్‌లోని వేలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
