Begin typing your search above and press return to search.

ట్రంప్ ‘ఫ్రెండ్‌షిప్’ ఫార్ములా.. పొద్దున్నే పొగడ్త.. సాయంత్రం తిట్లే.. రాత్రికి డీల్ గురు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిక్షనరీలో "స్నేహం" అనే పదానికి సరికొత్త అర్థాలు వెతుక్కోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఆయన మాటలు ఏ క్షణంలో ఎలా మారతాయో ఊహించడం.. వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పడం కంటే కష్టంగా మారింది.

By:  A.N.Kumar   |   5 Jun 2026 11:34 AM IST
ట్రంప్ ‘ఫ్రెండ్‌షిప్’ ఫార్ములా.. పొద్దున్నే పొగడ్త.. సాయంత్రం తిట్లే.. రాత్రికి డీల్ గురు!
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిక్షనరీలో "స్నేహం" అనే పదానికి సరికొత్త అర్థాలు వెతుక్కోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఆయన మాటలు ఏ క్షణంలో ఎలా మారతాయో ఊహించడం.. వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పడం కంటే కష్టంగా మారింది. గత వారమేమో "భారత్ మాకు జిగ్రీ దోస్త్.. అత్యంత స్నేహపూర్వక దేశం" అంటూ కితాబిచ్చిన ట్రంప్ తాత.. వారం తిరక్కుండానే ప్లేట్ ఫిరాయించేశారు. "ఏళ్ల తరబడి భారత్ అమెరికాను వాడుకుంది.. మమ్మల్ని దోచేసింది" అంటూ వైట్ హౌస్ వేదికగా కొత్త రాగం అందుకున్నారు. ట్రంప్ గారి ఈ ‘యూ-టర్న్’ రాజకీయాలు చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఆయన మాటలు స్టాక్ మార్కెట్ సూచీల కంటే వేగంగా ఊగిసలాడుతున్నాయని సెటైర్లు పేలుతున్నాయి.

స్నేహం ఒక మాట.. సుంకాలు మరో మాట!

వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ తన మార్క్ ప్రసంగాన్ని దంచికొట్టారు. ఆ ప్రసంగ సారాంశం చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. "భారత్ మాపై భారీగా సుంకాలు విధించింది. ఇన్నాళ్లూ మేం భారత్ నుంచి ఏమీ సంపాదించలేదు, వారే మమ్మల్ని వాడుకున్నారు." కానీ.. ఇప్పుడు రూటే వేరు ఇప్పుడు పరిస్థితి మారింది. మేమే భారత్ నుంచి బాగా డబ్బు సంపాదిస్తున్నాం. "ఏదేమైనా భారత్‌తో ఒప్పందం కుదురుతుంది. ఎందుకంటే మీ ప్రధాని మోడీ నాకు చాలా ఇష్టం. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్!" అంటూ ట్రంప్ గారు దెబ్బేశారు.

ఇదండీ అసలు ట్విస్ట్! "నువ్వు నన్ను దోచేశావ్.. నా దగ్గర లాక్కున్నావ్.. కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి!" ఇలాంటి లాజిక్ ఒక్క ట్రంప్‌కే సాధ్యం. ఉదయం లేస్తే పొగడటం, సాయంత్రానికి తిట్టడం, రాత్రికి డిన్నర్ చేస్తూ ‘డీల్’ మాట్లాడటం.. ఇదీ ఆయన స్టైల్!

టారిఫ్ అంటే ట్రంప్‌కు పూనకమే

నిజానికి తాజా సుంకాల వివాదంపై అమెరికా సుప్రీంకోర్టు కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. కానీ ట్రంప్‌కు కోర్టుల లెక్కల కంటే తన సొంత ‘టారిఫ్’ లెక్కల మీదే మోజు ఎక్కువ. "టారిఫ్" అనే పదం వినపడడమే ఆలస్యం.. ఆయనలో ఉన్న బిజినెస్‌మెన్ నిద్ర లేస్తాడు. వెంటనే పాత లెక్కలన్నీ తీసి కొత్త సమీకరణాలు చెప్పేస్తుంటారు.

భారత్ ఏళ్ల తరబడి అమెరికాను దోచుకుందని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఇప్పుడు భారత విదేశాంగ శాఖ ( దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే డిప్లొమాటిక్ వర్గాలతో పాటు ట్రంప్ మనస్తత్వాన్ని బాగా స్టడీ చేసిన నెటిజన్లు మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

ట్రంప్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. "ఒకరోజు ఇండియా ఈజ్ గ్రేట్ అంటారు.. మరుసటి రోజే ఇండియా టూక్ అడ్వాంటేజ్ అంటారు.. అసలు మీ స్టాండ్ ఏంటి తాతా?" అని ప్రశ్నిస్తున్నారు.

అయితే ట్రంప్‌ను క్రమం తప్పకుండా ఫాలో అయ్యే విశ్లేషకులు మాత్రం ఒకటే చెబుతున్నారు.. "కంగారు పడకండి.. రేపు ఉదయం ట్రంప్ నిద్ర లేచేసరికి మూడ్ మారొచ్చు. మళ్లీ భారత్‌ను ప్రపంచంలోనే నంబర్ వన్ బెస్ట్ ఫ్రెండ్ అని పొగిడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు!" ఏది ఏమైనా ట్రంప్ మార్క్ ‘స్నేహం’ భారత్‌కు ఒక పట్టాన అర్థం కానంత విచిత్రంగా తయారైందన్నది మాత్రం వాస్తవం!