Begin typing your search above and press return to search.

క్రెడిట్ కార్డులపై ట్రంప్ '10 శాతం' పంజా.. వాల్‌స్ట్రీట్‌లో వణుకు!

పొద్దున లేస్తే చాలు ఈరోజు ఎవరి మీద పడుదామా? ఎవరి మీద పన్నులు వేద్దామా? అని కాచుకు కూర్చుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్.

By:  A.N.Kumar   |   17 Jan 2026 10:23 PM IST
క్రెడిట్ కార్డులపై ట్రంప్ 10 శాతం పంజా..  వాల్‌స్ట్రీట్‌లో వణుకు!
X

పొద్దున లేస్తే చాలు ఈరోజు ఎవరి మీద పడుదామా? ఎవరి మీద పన్నులు వేద్దామా? అని కాచుకు కూర్చుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా కంటే ఒక మంచి వ్యాపారవేత్తగా డొనాల్డ్ ట్రంప్ రూపాంతరం చెందారు. వెనిజువెలను కబళించి.. గ్రీన్ లాండ్ పై మోహరించి.. ఇరాన్ ను కాలరాయడానికి పూనుకుంటున్న ట్రంప్ మిత్ర దేశాలను టారిఫ్ లతో వేధిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన క్రెడిట్ కార్డులను కూడా వదలకుండా బాధడానికి రెడీ అయిపోయాడు. ఇదే అందరినీ కలవరపెడుతోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రతిపాదనతో అగ్రరాజ్య బ్యాంకింగ్ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లపై గరిష్ట పరిమితి (సీఏపీ) విధిస్తామన్న ఆయన ప్రకటన అటు సామాన్యుల్లో ఆశలు.. ఇటు వాల్‌స్ట్రీట్ దిగ్గజాల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది.

అసలేమిటా ప్రతిపాదన?

ప్రస్తుతం అమెరికాలో క్రెడిట్ కార్డుల వడ్డీ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. సగటున 20% నుండి 30% వరకు వడ్డీ వసూలు చేస్తుండటంతో మధ్యతరగతి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ ఒక కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. "క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లను ఒక సంవత్సరం పాటు గరిష్టంగా 10 శాతానికి మాత్రమే పరిమితం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వినియోగదారులకు ఇది భారీ ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ బ్యాంకుల లాభాల వేటపై ఇది గొడ్డలి పెట్టు వంటిదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

బ్యాంకుల 'కాసుల వర్షం' ముగుస్తుందా?

బ్యాంకులకు క్రెడిట్ కార్డు వ్యాపారం అనేది ఒక బంగారు బాతు వంటిది. దీని వెనుక ఆర్థిక సమీకరణాలున్నాయి. బిల్లులు సకాలంలో చెల్లించని వారి నుంచి వసూలు చేసే అధిక వడ్డీనే బ్యాంకులకు ప్రధాన ఆదాయ వనరు. మనం పొందే క్యాష్‌బ్యాక్, ఎయిర్‌లైన్ మైల్స్, గిఫ్ట్ వోచర్లు అన్నీ కూడా ఈ అధిక వడ్డీ లాభాల నుంచే వస్తాయి. ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నా క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే ఆదాయం స్థిరంగా ఉండటంతో పెట్టుబడిదారులు బ్యాంకింగ్ షేర్ల వైపు మొగ్గు చూపుతారు.

వాల్ స్ట్రీట్ ఆందోళనకు 3 ప్రధాన కారణాలు

ట్రంప్ నిర్ణయం అమలైతే బ్యాంకులు తమ నష్టాన్ని పూడ్చుకోవడానికి కఠినమైన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. తక్కువ వడ్డీ అంటే రిస్క్ ఎక్కువ. కాబట్టి క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నవారికి కార్డులు ఇవ్వడం బ్యాంకులు ఆపేయవచ్చు. ఇప్పటివరకు అందిస్తున్న ఉచిత రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు భారీగా తగ్గే లేదా పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. వినియోగదారుల ఖర్చు చేసే పరిమితిని బ్యాంకులు తగ్గించవచ్చు. ఇది పరోక్షంగా మార్కెట్‌లో కొనుగోళ్లు తగ్గిపోయేలా చేస్తుంది.

సామాన్యుడికి లాభమా? నష్టమా?

అప్పుల్లో ఉన్న కుటుంబాలకు నెలవారీ వడ్డీ భారం సగానికి పైగా తగ్గుతుంది. దీనివల్ల వారి చేతిలో ఖర్చు చేయడానికి మరికొంత నగదు మిగులుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు స్వల్పకాలికంగా మేలు చేస్తుంది. వడ్డీ ఆదాయం పడిపోతే బ్యాంకుల షేర్ విలువలు పడిపోతాయి. ఇది వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లకు భారీ నష్టాన్ని మిగులుస్తుంది. అలాగే బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి వెనుకాడితే మార్కెట్‌లో నగదు చలామణి తగ్గి ఆర్థిక మందగమనానికి దారితీసే ప్రమాదం ఉంది.

ట్రంప్ ప్రతిపాదన ఇప్పుడు ఒక రాజకీయ, ఆర్థిక యుద్ధానికి వేదికైంది. వినియోగదారుల ప్రయోజనాలే ముఖ్యమా లేక బ్యాంకింగ్ రంగం స్థిరత్వం ముఖ్యమా? అనే ప్రశ్నపై అగ్రరాజ్యం తలమునకలవుతోంది. ఒకవేళ ఇది చట్టరూపం దాల్చితే అమెరికా క్రెడిట్ మార్కెట్ చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద మలుపు కానుంది.