Begin typing your search above and press return to search.

రష్యా దగ్గర ఆయిల్ కొనటం మానేస్తే ఏం జరుగుతుంది?

అగ్రరాజ్య అధినేత ట్రంప్ భారత్ మీద వేసిన తాజా ఆర్డర్ తెలిసిందే. రష్యా నుంచి ముడి చమురు కొనటం ఆపేయాలని.

By:  Garuda Media   |   9 Aug 2025 10:00 AM IST
రష్యా దగ్గర ఆయిల్ కొనటం మానేస్తే ఏం జరుగుతుంది?
X

అగ్రరాజ్య అధినేత ట్రంప్ భారత్ మీద వేసిన తాజా ఆర్డర్ తెలిసిందే. రష్యా నుంచి ముడి చమురు కొనటం ఆపేయాలని. అలా చేయని పక్షంలో మోయలేని టారిఫ్ భారాన్ని మోపుతానని స్పష్టం చేయటం తెలిసిందే. ట్రంప్ చెప్పినట్లు చేయకపోతే భారత్ కు జరిగేదేమిటి? అన్న అంశంపై ఇప్పటికే చాలా లెక్కలు వచ్చాయి. ఇదంతా బాగానే ఉంది. మరి.. ట్రంప్ చెప్పినట్లుగా రష్యా నుంచి ముడిచమురు కొనటం ఆపేస్తే ఏమవుతుంది? భారత ఆర్థిక వ్యవస్థ మీదా.. భారతీయుల మీద పడే ప్రభావం ఎంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

మన ముడి చమురు అవసరాల్ని రష్యా చాలా వరకు తీరుస్తుంది. ఉక్రెయిన్ తో రష్యాకు పంచాయితీ మొదలైన తర్వాత యూరోపియన్ దేశాలు రష్యాపై ఆర్థికఆంక్షలు విధించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ముడిచమురును కారుచౌకగా భారత్ కు అమ్ముతోంది. దీని ద్వారా భారత్ భారీగా లాభపడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా ముడిచమురు వద్దని భారత్ భావిస్తే.. మన మీద మోపలేని భారం పడటం ఖాయం.

ఒక విధంగా చూస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రతికూలంగా మార్చే ప్రమాదం పొంచి ఉంది. అదెంత అంటటే.. ఆయిల్ దిగుమతుల బిల్లు 2026లో 9 బిలియన్ డాలర్లు..2027లో 12 బిలియన్ డాలర్ల వరకు భారం పడే ప్రమాదం ఉంది. ముడి చమురు కోసం పూర్తిగా అరబ్ దేశాల మీద ఆధారపడితే.. భారీ ఎత్తున ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. అదే జరిగితే.. ఇప్పుడున్న పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా పెరగటం ఖాయం అది నేరుగా ప్రజల జేబులకు చిల్లు పడేలా చేస్తుంది.

మన దేశ చమురు అవసరాల్లో ఇప్పుడు రష్యాదే సింహభాగం. ఉక్రెయిన్ తో యుద్ధం మొదలు కావటానికి ముందు వరకు రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసే ముడి చమురు మొత్తం దిగుమతుల్లో 1.7 శాతం వాటానే ఉండేది. అది కాస్తా ఇప్పుడు 35.1 శాతానికి చేరింది. 2025లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు 245 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు కాగా.. అందులో రష్యా వాటానే 88 మిలియన్ మెట్రిక్ టన్నులు.

ట్రంప్ సుంకాల షాక్ కు తలొగ్గి రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు ఆపేస్తే.. అదనపు భారం మాత్రమే కాదు.. భారత్ బాటలో ప్రపంచ దేశాలు కొనుగోలు తగ్గిస్తే.. ఆ ఒత్తిడి అరబ్ దేశాల మీద పడుతుంది. దీంతో.. ముడి చమురు ధర పెరగటం ఖాయం. అదే జరిగితే.. భారత్ మీద మరింత భారం పడుతుంది. రష్యా నుంచి భారత్ మాత్రమే కాదు.. పలు దేశాలు ముడి చమురు కొనుగోలు చేస్తున్నాయి. మొత్తం ఎపిసోడ్ లో ఉన్న సానుకూల అంశం ఏమంటే.. రష్యాతో పాటు దాదాపు నలభై దేశాల నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుంది. ఇదో సానుకూల అంశంగా చెప్పాలి. ఏమైనా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు ఆపేస్తే జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు.