ట్రంప్ ను నగ్నంగా నిలబెట్టిన ఓ కళాకారుడి సెటైర్.. వైరల్
ఈ శిల్పానికి జతచేసిన వ్యాఖ్య మరింత పదునైన సెటైర్ గా ఉంది. "నేను ఓ మనిషి వీపుపై కూర్చున్నాను. అతడు భారం తాళలేక కుంగిపోతున్నాడు.
By: A.N.Kumar | 8 Oct 2026 2:51 PM ISTఅధికారం.. సంపద.. అహంకారం.. ఈ మూడింటినీ ఒకే ఫ్రేమ్‌లో పెట్టి చూపించాలనుకుంటే ఏం చేయాలి? సరిగ్గా ఇదే ఆలోచన వచ్చింది డానిష్ ప్రసిద్ధ కళాకారుడు జెన్స్ గాల్షియోట్‌కు. ఫలితమే ఫ్రాన్స్ పార్లమెంట్ ప్రాంగణంలో వెలిసిన డోనాల్డ్ ట్రంప్ 23 క్యారెట్ల బంగారు పూతతో ఉన్న ఒక వినూత్న వ్యంగ్య శిల్పం. సాధారణంగా నాయకులకు విగ్రహాలు పెట్టడం అంటే పొగడ్తలు, శాల్వాలు, దండలతో పూజించడం. కానీ ఇక్కడ కథ పూర్తిగా వేరు..
మెరిసే బంగారం.. మోసే సామాన్యుడు..
ఈ శిల్పంలో ట్రంప్ ఒంటిపై 23 క్యారెట్ల పసిడి వెలుగులు జిగేల్ మంటున్నాయి. బయటకు కనిపిస్తున్న ఈ వైభవం అధికార గర్వానికి, సంపద ప్రదర్శనకు ప్రతీక. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ట్రంప్ నగ్నంగా ఒక అతి చిన్న సామాన్య వ్యక్తి వీపుపై హుందాగా కూర్చుని ఉన్నారు. కింద ఉన్న ఆ చిన్న వ్యక్తి ఆ భారాన్ని మోయలేక నడుము వంగిపోయి కుంగిపోతున్నాడు. అంటే.. పాలకుల మెరిసే నిర్ణయాలు, మెరుపు దండయాత్రల భారాన్ని చివరికి మోయాల్సింది మోచేతి నీళ్లు తాగే సామాన్యుడేనని ఎంత కళ్ళకు కట్టినట్టు చెప్పారో కదా..
క్రిందికి దిగడం తప్ప.. ఏదైనా చేస్తా..
ఈ శిల్పానికి జతచేసిన వ్యాఖ్య మరింత పదునైన సెటైర్ గా ఉంది. "నేను ఓ మనిషి వీపుపై కూర్చున్నాను. అతడు భారం తాళలేక కుంగిపోతున్నాడు. అతడికి సాయం చేయడం కోసం నేను ఏమైనా చేస్తాను.. ఒక్క అతని వీపుపై నుంచి కిందికి దిగడం తప్ప" అనే కొటేషన్ ట్రంప్ ను చెంప దెబ్బ కొట్టినట్టుగా ఉంది.
రాజకీయ నాయకులు ‘ప్రజల కోసమే మేం ఉన్నాం’ అని వేదికలపై ఇచ్చే బిల్డప్‌లకు, ఆచరణలో వారు సీటును వదలకుండా చేసే జిమ్మిక్కులకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? అధికార పీఠాన్ని వదలకుండా సానుభూతి వచనాలు పలకడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని గాల్షియోట్ ఈ ఒక్క వాక్యంతో తోలు తీశారు. అందుకే ఈ శిల్పానికి ‘కింగ్ ఆఫ్ ఇన్‌జస్టిస్’ అంటే అన్యాయానికి రాజు అనే పేరు సరిగ్గా సరిపోయింది.
నగ్నత్వంలో దాగున్న ‘రాజకీయ నిజభాష’
23 క్యారెట్ల బంగారం ధనికుల, పాలకుల బాహ్య వైభవాన్ని చూపిస్తే.. నగ్నత్వం వారి అసలు స్వరూపాన్ని, అధికార అహంకారం వెనుక ఉన్న నైతిక దిగజారుడుతనాన్ని సూచిస్తోంది. 'రాజు దిగంబరుడు' అనే పాత సామెతను ఆధునిక రాజకీయాలకు అన్వయిస్తూ రాజకీయం ఎలా కళ ద్వారా ప్రశ్నించబడుతుందో ఈ శిల్పం నిరూపించింది.
ట్రంప్ బంగారు శిల్పం కేవలం ఒక కళాఖండం మాత్రమే కాదు.. అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన ప్రతీ పాలకుడికీ, వారి కింద నలిగిపోతున్న సమాజానికి వేసిన ఒక పదునైన ప్రశ్నాపత్రం.
