Begin typing your search above and press return to search.

నోబెల్ కల నెరవేరేనా? ‘శాంతి’కి, ‘యుద్ధాని’కి నడుమ డొనాల్డ్ ట్రంప్ కు అగ్నిపరీక్ష

శాంతి బహుమతి నామినేషన్ల జాబితాలో మరోసారి డొనాల్డ్ ట్రంప్ గారి పేరు మెరిసిపోతోంది.

By:  A.N.Kumar   |   5 Oct 2026 11:52 AM IST
నోబెల్ కల నెరవేరేనా? ‘శాంతి’కి, ‘యుద్ధాని’కి నడుమ డొనాల్డ్ ట్రంప్ కు అగ్నిపరీక్ష
X

శాంతి బహుమతి నామినేషన్ల జాబితాలో మరోసారి డొనాల్డ్ ట్రంప్ గారి పేరు మెరిసిపోతోంది. ఒక చేతిలో ఆలివ్ కొమ్మ పట్టుకుని 'శాంతి దూత'లా నవ్వులు చిందిస్తూనే మరో చేతితో డ్రోన్ దాడి మీట నొక్కే కళ ఒక్క ట్రంప్‌కే సొంతం మరి.. "కంబోడియా, పాకిస్థాన్, ఇజ్రాయెల్‌లు నా పేరు ప్రతిపాదించాయి సార్.. నా కంటే శాంతి కాముకుడు ప్రపంచంలో ఇంకెవరుంటారు?" అని ఆయన గంభీరంగా ప్రకటిస్తున్న వేళ ఆ ఇరాన్ యుద్ధ మేఘాలు మాత్రం "ముందు మా సంగతి తేల్చవయ్యా బాబూ" అని నోబెల్ కమిటీ వైపు చూసి నవ్వుకుంటున్నాయి. నామినేషన్లతో రికార్డులు సృష్టించడం సరే.. మరి ఈసారైనా ఆ మెడల్ చేతికొస్తుందా..? లేక నోబెల్ కమిటీ 'థ్యాంక్స్ ఫర్ ట్రయింగ్' అని సరిపెడుతుందో చూడాలి.

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని ముద్దాడాలన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దశాబ్దాల కల. ఎన్నో వేదికలపై తన మనసులోని ఈ కోరికను బహిరంగంగానే వెలిబుచ్చిన ఆయన మరోసారి ఆ డ్రీమ్ అవార్డు రేసులో నిలిచారు. నామినీల జాబితాలో ట్రంప్ పేరు చేరడంతో ఆయన అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కానీ ఈసారి ఆయన కలల సౌధానికి శాంతి చర్చల కంటే... పెల్లుబుకుతున్న ‘యుద్ధ మేఘాలే’ పెద్ద అడ్డంకిగా మారేలా కనిపిస్తున్నాయి.

కంబోడియా, పాకిస్థాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు ట్రంప్‌ను ఈ బహుమతికి నామినేట్ చేశాయన్న వార్తలు ఆయన మద్దతుదారుల్లో ఆనందాన్ని నింపాయి. శత్రువులుగా ఉన్న దేశాలను ఒకే వేదికపైకి తెచ్చి అంతర్జాతీయ వివాదాల్లో అమెరికా మధ్యవర్తిత్వాన్ని నిలబెట్టిన 'శాంతి దూత'గా ఆయనను వారు కొనియాడుతున్నారు. ప్రపంచ పటంలో దౌత్యపరమైన ఒప్పందాలకు శ్రీకారం చుట్టిన ఒక నాయకుడిగా ఆయన పేరు నామినేషన్లలో ఉండటం ఆయనకు దక్కిన గుర్తింపు అనడంలో సందేహం లేదు. ఈసారి పోటీలో 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నప్పటికీ అందరి కళ్ళు మాత్రం ట్రంప్‌‌పైనే ఉన్నాయి.

అయితే నామినేషన్ రావడం ఒకెత్తయితే... ఆ స్వర్ణ పతకాన్ని చేతుల్లోకి తీసుకోవడం మరొకెత్తు. ఒకవైపు శాంతి ఒప్పందాల జపం చేస్తూనే మరోవైపు ఇరాన్‌తో నెలకొన్న భయాందోళనలు, సైనిక చర్యల హెచ్చరికలు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. "ఒకే చేత్తో శాంతి కపోతాన్ని ఎగురవేస్తూ మరో చేత్తో యుద్ధభేరి మోగించే నాయకుడికి శాంతి బహుమతి సాధ్యమేనా?" అనే వేదనతో కూడిన ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. నోబెల్ కమిటీ కేవలం నామినేషన్లను మాత్రమే చూడదు.. ఒక నాయకుడి నిర్ణయాలు మానవాళిపై చూపిన లోతైన ప్రభావాన్ని ఆయన వెనుక ఉన్న రికార్డును లెక్కిస్తుంది.

మరికొద్ది రోజుల్లో అంటే అక్టోబర్ 9న ఈ ఉత్కంఠకు తెరపడనుంది. ట్రంప్‌ను శాంతి వైపు అడుగులు వేయించిన దార్శనికుడిగా చరిత్ర గుర్తించి నోబెల్ అందిస్తుందా? లేక యుద్ధ ఛాయల కారణంతో ఆయన కల మరోసారి తీరని ఆశగానే మిగిలిపోతుందా? ప్రపంచం మొత్తం ఇప్పుడు అత్యంత ఆత్రుతతో ఆ క్షణం కోసం ఎదురుచూస్తోంది.