Begin typing your search above and press return to search.

నోబెల్ అడుక్కుంటే రాదు.. పెద్దరికంతో వస్తుంది ట్రంప్

సెర్బియా-కొసావో: రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం, సాధారణీకరణ కోసం ఒక ఒప్పందం కుదరడంలో సహాయం చేసినట్లు పేర్కొన్నారు.

By:  A.N.Kumar   |   2 Oct 2025 7:00 PM IST
నోబెల్ అడుక్కుంటే రాదు.. పెద్దరికంతో వస్తుంది ట్రంప్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తన అధ్యక్ష పదవీ కాలంలో ఏడు యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్, తన విజయాలను అంతర్జాతీయ సమాజం తక్కువ చేసి చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్వాంటికోలోని సైనికాధికారులతో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

*ఎనిమిదో యుద్ధంపై ట్రంప్ దృష్టి

తాను ఇప్పటికే ఏడు యుద్ధాలను నిలిపివేశానని పేర్కొన్న ట్రంప్.. ఇప్పుడు గాజా వివాదాన్ని శాంతియుతంగా ముగించడంపై దృష్టి సారించారు. గాజా వివాద పరిష్కారానికి సోమవారం ప్రకటించిన తమ ప్రణాళిక విజయవంతమైతే.. తాను ఎనిమిది యుద్ధాలను ఆపిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రణాళికకు ఇజ్రాయెల్ అంగీకరించిందని, అయితే హమాస్ అంగీకారం తెలపాల్సి ఉందని ట్రంప్ తెలిపారు. ఒకవేళ హమాస్ ఒప్పుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు.

* "నోబెల్ నాకోసం కాదు... అమెరికా ప్రతిష్ఠ కోసం!"

తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోతే అది తన వ్యక్తిగత పరాభవం కాదని, అమెరికాకు పెద్ద అవమానం అవుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. "నోబెల్ అడుక్కుంటే రాదు... పెద్దరికంతో వస్తుంది" అని అంటూనే, "నోబెల్‌ తనకోసం కాదు, అమెరికా ప్రతిష్ట కోసం కావాలి" అని వ్యాఖ్యానించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అనేక ఘర్షణలను నిలిపి, శాంతి చర్చలకు నాంది పలికినప్పటికీ తన పాత్రను విస్మరిస్తున్నారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. గాజా వివాదం ముగిసిన తర్వాత నోబెల్ శాంతి బహుమతి రావడం ఖాయం అని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

* సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న ట్రంప్?

అధ్యక్షుడిగా ఎంపికైనప్పటి నుంచి నోబెల్ శాంతి బహుమతి తనకు రావాలంటూ ట్రంప్ తరచుగా డిమాండ్ చేస్తున్నారు. భారత్-పాకిస్తాన్ వంటి దేశాల మధ్య జరిగిన చర్చలతో ఆగిపోయిన యుద్ధాలను కూడా తన ఖాతాలో వేసుకుని "సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు" అనే విమర్శలు కూడా ఉన్నాయి.

ట్రంప్ తన ప్రచారంలో భాగంగా ఏడు యుద్ధాలను ఆపినట్లు పదేపదే చెప్పుకున్నారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి (UN) జనరల్ అసెంబ్లీ ప్రసంగంలో కూడా ఆయన ఈ విషయాన్ని నొక్కి చెప్పారు. అయితే ఈ వాదనపై విమర్శలు కూడా ఉన్నాయి.. స్వతంత్ర ఫ్యాక్ట్-చెక్ సంస్థలు దీని గురించి స్పష్టత లేదని, అతిశయోక్తి అని చెబుతున్నారు.

ట్రంప్ పేర్కొన్న ఏడు వివాదాలు/సంఘర్షణలు ఏవంటే?

భారత్-పాకిస్థాన్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ యుద్ధం జరిగింది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ విషయంలో తాను కీలక పాత్ర పోషించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీనికి పాకిస్థాన్ కృతజ్ఞతలు చెప్పగా, ఈ సంధిలో అమెరికా పాత్ర చాలా తక్కువగా ఉందని భారత్ ఖండించింది.

ఇజ్రాయెల్-ఇరాన్: ఇటీవల కాలంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగిన 12 రోజుల సంఘర్షణలో కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు ట్రంప్ చెప్పారు.

ఆర్మేనియా-అజర్‌బైజాన్: రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మరియు రవాణా మార్గాలను తిరిగి తెరవడానికి జరిగిన ఒప్పందానికి తాను కృషి చేసినట్లు తెలిపారు.

సెర్బియా-కొసావో: రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం, సాధారణీకరణ కోసం ఒక ఒప్పందం కుదరడంలో సహాయం చేసినట్లు పేర్కొన్నారు.

రువాండా - డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC): ఈ రెండు దేశాల మధ్య జరిగిన హింసను ఆపడానికి ప్రయత్నించినట్లు తెలిపారు, అయితే DRCలో ఇప్పటికీ ఘర్షణలు కొనసాగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

ఈజిప్టు-ఇథియోపియా: నైలు నదిపై నిర్మిస్తున్న గ్రాండ్ ఇథియోపియన్ రినైసెన్స్ డ్యామ్ (GERD) విషయంలో నెలకొన్న ఉద్రిక్తతలను ఆపడానికి ప్రయత్నించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.

థాయ్‌లాండ్-కంబోడియా: సరిహద్దు వివాదంపై జరిగిన ఘర్షణలకు సంబంధించి కాల్పుల విరమణకు తాను కృషి చేసినట్లు చెప్పారు, ఇందులో వాణిజ్యపరమైన బెదిరింపులను ఉపయోగించినట్లు కూడా తెలిపారు.

నిపుణుల - ఫ్యాక్ట్-చెక్ నివేదికల సారాంశం

ట్రంప్ పేర్కొన్న వాటిలో కొన్ని వివాదాలు మాత్రమే, పూర్తిస్థాయి యుద్ధాలు కావు, లేదా అవి అప్పటికే నిలిచిపోయాయి అని నిపుణులు అభిప్రాయపడ్డారు. కొన్ని చోట్ల ట్రంప్ జోక్యం కీలకమైనది కావచ్చు, కానీ మరికొన్ని సందర్భాల్లో ఆయన పాత్ర అతిశయోక్తిగా లేదా తక్కువ ప్రభావవంతంగా ఉందని ఫ్యాక్ట్-చెక్ నివేదికలు పేర్కొన్నాయి. ట్రంప్ కుదుర్చిన ఒప్పందాలలో చాలావరకు క్షీణించే దశలో ఉన్నాయని లేదా పూర్తిగా అమలు కాలేదని, కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయని విమర్శకులు ఎత్తి చూపారు.

ట్రంప్ తన ప్రచారంలో విదేశాంగ విధాన విజయాన్ని గట్టిగా నొక్కి చెప్పడానికి, ముఖ్యంగా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని చెప్పుకోవడానికి ఈ ఏడు వివాదాల పరిష్కారాన్ని ప్రధాన అంశంగా వాడుతున్నారు. అయితే, ఈ విషయంలో వాస్తవాలు అంత స్పష్టంగా లేవని నిపుణులు చెబుతున్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని గతంలో బీరాలు పలికిన ట్రంప్, ఆ యుద్ధాన్ని ఆపకుండా, ఆగిపోయిన యుద్ధాలను మాత్రం తానే ఆపానంటూ గొప్పలు చెప్పుకోవడంపై విమర్శకులు దృష్టి సారిస్తున్నారు.మొత్తానికి, ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి నోబెల్ బహుమతి చర్చలకు దారితీస్తూ, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.