Begin typing your search above and press return to search.

ట్రంప్ ని చూసి ప్రపంచం హడలెత్తుతోంది !

అమెరికా అంటే అగ్ర రాజ్యం. అక్కడ అధ్యక్షుడిగా ఉంటూ పాలించే వారు అంతా పెద్దన్నగా భావిస్తారు.

By:  Satya P   |   20 Sept 2026 11:00 PM IST
ట్రంప్ ని చూసి ప్రపంచం హడలెత్తుతోంది !
X

అమెరికా అంటే అగ్ర రాజ్యం. అక్కడ అధ్యక్షుడిగా ఉంటూ పాలించే వారు అంతా పెద్దన్నగా భావిస్తారు. అమెరికా అలా ప్రపంచ పెద్దగా ప్రపంచ పోలీసుగా అవతారం ఎత్తి తనదైన శైలిలో అంతర్జాతీయ సమాజం మీద ఆధిపత్యం చేస్తూ వస్తోంది. అయితే గత పాలకుల విషయం ఒక ఎత్తు అయితే ప్రస్తుతం పాలిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తీరు వేరు అన్నది గత రెండేళ్లుగా అందరికీ అర్ధం అయిన విషయమే. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన దుందుడుకు చర్యలతో ఈ రోజుల ప్రపంచం హడలిపోతోంది. అంతే కాదు భారీ మూల్యం చెల్లిస్తోంది. ఈ రోజున పేద దేశాల నుంచి వర్ధమాన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలే కాదు అభివృద్ధి చెందిన దేశాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి.

పశ్చిమాసియా చిచ్చు :

ఒకటి చెప్పి మరొకటి అన్నట్లుగా పశ్చిమాసియా చిచ్చుకుని అమెరికా రగిలినిచంది. ఇది అంతకంతకు తీవ్రం అవుతోంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి నియంత్రణ కోసం యుద్ధం అని మొదలెట్టిన అమెరికా ఇపుడు హర్మూజ్ జల సంధి వద్దకు వచ్చి ఆగింది. ఇది మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకోవడంతో ప్రపంచ దేశాలలో భారీ ఆందోళన కనిపిస్తోంది. పశ్చిమాసియాలో శాంతి అన్నది నెలకొనే వరకూ ప్రపంచ ఇంధన చక్రం సాఫీగా సాగే చాన్స్ లేదు. ప్రస్తుతం ఈ ఘర్షణలు ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద కేంద్రీకృతం కావడంతో అంతర్జాతీయంగా పెను ప్రభావం పడుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం వాటా ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటి దూసుకుపోతోంది.

విస్తరిస్తున్న చిచ్చు :

ఇక ఈ చిచ్చు కేవలం ఇరాన్ సరిహద్దులకే పరిమితం కాకుండా పశ్చిమాసియా అంతటా విస్తరిస్తోంది. ఇరాన్ మద్దతుగల యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై క్షిపణి దాడులు చేపట్టారు. అలాగే మరో కీలక జలమార్గమైన బాబ్ ఎల్-మండేబ్ పై పట్టు సాధించేందుకు హౌతీలు ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ తన క్షిపణులతో జోర్డాన్ కువైట్ యూఏఈ లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ప్రస్తుతం ఖతార్, పాకిస్తాన్ వంటి దేశాలు ఇరుపక్షాల మధ్య రాయబారం నడుపుతున్నప్పటికీ ఇరాన్ యుద్ధం చేస్తూనే చర్చలు జరుపుతాం అనే వ్యూహాన్ని అవలంబిస్తుండటంతో ఈ ప్రాంతంలో శాంతి స్థాపన మరింత సంక్లిష్టంగా మారిందని అంటున్నారు.

భారీ సుంకాలతో :

అంతే కాదు అమెరికా భారీ సుంకాలను అనేక దేశాల మీద విధిస్తోంది. దీంతో భారత్ చైనా వంటి దేశాల ఆర్ధిక వ్యవస్థల మీద కూడా ఇది విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. ట్రంప్ దూకుడు నిర్ణయాలతో అంతర్జాతీయంగా సరఫరా గొలుసు కట్టు దెబ్బ తింటోంది అని అంటున్నారు. దాంతో అంతర్జాతీయంగా కూడా ఆర్ధిక వృద్ధి రేటు గతానికి కంటే తక్కువగా నమోదు అవుతోంది అంటున్నారు. ఇక కఠినమైన వీసా నిబంధనలు అమలు చేయడం ద్వారా భారతదేశంతో పాటు అనేక దేశాల యువత ఆశలకు ఆకాంక్షలకు ట్రంప్ విధానాలు గండి కొడుతున్నాయి. ఇలా ఒకటి రెండూ కాదు తన రెండేళ్ల పాలనలో ట్రంప్ తీసుకుంటున్న అనేక ఏకపక్ష నిర్ణయాలు ప్రపంచాన్ని సంక్షోభంలో పడేస్తున్నాయని అంటున్నారు. దాంతో ప్రపంచ గతిని పెద్దన్న ఏ విధంగా ప్రమాదకరమైన మలుపు తిప్పుతారో అన్న భయం అందరికీ పట్టుకుంది.

పర్యటన రద్దుతో :

ఇపుడు కూడా చూస్తె ట్రంప్ తన క్యాంప్ డేవిడ్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని వైట్ హౌస్‌కు తిరిగి రావడం, అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది అని అంటున్నారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై క్షిపణులు డ్రోన్లతో దాడులు చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి. దీంతో ఇరాన్ అణు రక్షణ కేంద్రాలపై గతంలో చేసిన తరహాలోనే మరోసారి అమెరికా భారీ సైనిక దాడులు చేసే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ మధ్యనే ట్రంప్ ఇరాన్ సంక్షోభంపై తాను ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నానని ఆ దేశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలా వద్దా అనే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నానని ప్రకటించడం కూడా ఆందోళన రేపుతోంది.

ఇరాన్ సైతం సిద్ధం :

మరో వైపు చూస్తే అమెరికాకు ఇరాన్ ఏడు కఠిన షరతులు విధించింది. ఇపుడు జరుగుతున్న యుద్ధాన్ని ముగించి చర్చలు ప్రారంభించాలంటే అమెరికా తమ ఏడు షరతులను అంగీకరించాలని డిమాండ్ చేస్తోంది. అమెరికా అన్ని వైపులా యుద్ధాన్ని ఆపడంతో పాటు తమ స్తంభింపజేసిన నిధులను విడుదల చేయడం అమెరికా విధించిన నావికా దళ దిగ్బంధనాన్ని) తొలగించడం ఈ షరతులలో ముఖ్యమైనవిగా ఉన్నాయి. తమ షరతులు అంగీకరించకపోతే నిర్ణయాత్మక యుద్ధానికి సిద్ధమని ఇరాన్ హెచ్చరించింది. మరో వైపు ఇరాన్ తన సాయుధ దళాలు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ను అప్రమత్తం చేస్తూ దేశంలో కోడ్ 100 అత్యవసర అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతానికి దౌత్యపరమైన చర్చలకు ఇరాన్ మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ అమెరికా పెద్దన్న తీసుకోబోయే నిర్ణయంపైనే ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారుతుందా లేదా అనేది ఆధారపడి ఉంది. అంటే ఇపుడు ట్రంప్ ఏ స్టెప్ తీసుకుంటారు అన్నదే ప్రపంచ గమనాన్ని డిసైడ్ చేస్తుంది అన్న మాట.