Begin typing your search above and press return to search.

ఇరాన్ యుద్ధం : ఎవరిదారి వారిదే.. అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాత్మక అడుగులు

ఇరాన్‌తో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతలు, సైనిక ఘర్షణల అనంతరం అంతర్జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.

By:  A.N.Kumar   |   22 Jun 2026 10:10 AM IST
ఇరాన్ యుద్ధం : ఎవరిదారి వారిదే.. అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాత్మక అడుగులు
X

ఇరాన్‌తో చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతలు, సైనిక ఘర్షణల అనంతరం అంతర్జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. యుద్ధం కారణంగా అమెరికా భారీగా నష్టపోయిందంటూ వస్తున్న కథనాలను ట్రంప్ తీవ్రంగా ఖండించగా.. అమెరికాతో సంబంధాలు, తమ దేశ స్వతంత్ర నిర్ణయాలపై నెతన్యాహు స్పష్టతనిచ్చారు.

"మేం నష్టపోలేదు.. ఇరానే సర్వస్వం కోల్పోయింది": డొనాల్డ్ ట్రంప్

యుద్ధంలో అమెరికా బలహీనపడిందనే ప్రచారానికి చెక్ పెడుతూ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఘాటైన కౌంటర్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఎలా ఉన్నాయో ప్రపంచం గమనించాలని ఆయన కోరారు. గత నాలుగు నెలల యుద్ధంలో ఇరాన్ సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలతో పాటు వారి క్షిపణి లాంచింగ్ ప్యాడ్లు, డ్రోన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌కు చెందిన ఇద్దరు అగ్రశ్రేణి నాయకులు ఈ ఘర్షణల్లో హతమయ్యారని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ఇరాన్‌లో ద్రవ్యోల్బణం 250 శాతానికి చేరుకుందని, వారి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని ట్రంప్ వివరించారు. వ్యూహాత్మక 'హార్ముజ్ జలసంధి'ని తిరిగి తెరిపించడం ద్వారా ప్రపంచానికి చమురు సరఫరాను పునరుద్ధరించామని, అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లో పయనిస్తున్నాయని స్పష్టం చేశారు. ఇంతటి విజయం సాధించిన తర్వాత కూడా అమెరికా నష్టపోయిందని చెప్పడం కేవలం అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు.

"మాకు ఇజ్రాయెల్ భద్రతే ముఖ్యం".. బెంజమిన్ నెతన్యాహు

ఇటు ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో జెరూసలెంలో నిర్వహించిన 'జేఎన్ఎస్ సమ్మిట్'లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రసంగం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న సంబంధాలపై వస్తున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. "అమెరికాలో నేను చెప్పిన ప్రతిదీ ట్రంప్ చేస్తారని కొందరు భావిస్తారు. అలాగే ఇజ్రాయెల్‌లో ట్రంప్ ఏం చెబితే నేను అదే చేస్తానని మరికొందరు అనుకుంటారు. ఈ రెండు అభిప్రాయాలు కూడా ముమ్మాటికీ తప్పు." అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.

నెతన్యాహు తమ దేశ విధానాన్ని స్పష్టం చేస్తూ ఇజ్రాయెల్‌కు దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలే పరమావధి అని పేర్కొన్నారు. కొన్ని అంతర్జాతీయ అంశాల్లో తాము ట్రంప్‌తో పూర్తిగా ఏకీభవిస్తామని, మరికొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయని చెప్పారు. విభేదాలు ఉన్నప్పటికీ ఇరు దేశాల మధ్య పరస్పర గౌరవం కొనసాగుతుందని, అయితే తాము తీసుకునే ప్రతి నిర్ణయం ఇజ్రాయెల్ రక్షణను దృష్టిలో ఉంచుకునే ఉంటుందని స్పష్టం చేశారు.

ట్రంప్, నెతన్యాహు వ్యాఖ్యలను బట్టి అమెరికా-ఇజ్రాయెల్ బంధంలో ఒక కొత్త కోణం కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ విషయంలో ఇరు దేశాలు బలమైన వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నప్పటికీ.. అంతిమంగా తమ తమ దేశాల జాతీయ ప్రయోజనాలు, భద్రతా అవసరాల ఆధారంగానే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటామనే స్పష్టమైన సంకేతాన్ని ఈ ఇద్దరు ప్రపంచ నేతలు పంపినట్లయింది. రానున్న రోజుల్లో మిడిల్ ఈస్ట్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.