Begin typing your search above and press return to search.

భారత్ పై పడి ఏడుస్తున్న ట్రంప్ సలహాదారు.. ఇంత ఫస్ట్రేషన్ ఎందుకు సామీ

అమెరికా రాజకీయాల్లో మళ్ళీ పాత రాగం వినిపిస్తోంది. ట్రంప్ అనుచరులకు ముఖ్యంగా ఆయన ఆర్థిక సలహాదారులకు భారత్ పేరు వింటేనే ఎక్కడో లేని అసహనం తన్నుకొస్తోంది.

By:  A.N.Kumar   |   18 Jan 2026 11:00 PM IST
భారత్ పై పడి ఏడుస్తున్న ట్రంప్ సలహాదారు.. ఇంత ఫస్ట్రేషన్ ఎందుకు సామీ
X

అమెరికా రాజకీయాల్లో మళ్ళీ పాత రాగం వినిపిస్తోంది. ట్రంప్ అనుచరులకు ముఖ్యంగా ఆయన ఆర్థిక సలహాదారులకు భారత్ పేరు వింటేనే ఎక్కడో లేని అసహనం తన్నుకొస్తోంది. తాజాగా ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. అసలు భారత్ ఎదుగుదల చూసి ఆయనెందుకు అంతగా రగిలిపోతున్నారో అర్తం కావడం లేదని పలువురు కౌంటర్ ఇస్తున్నారు.

ఏఐ సేవలు అక్కడ.. ఖర్చు మాత్రం మాదా?

ఇటీవల స్టీవ్ బానన్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో నవారో వింత వాదనను తెరపైకి తెచ్చారు. చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ ప్లాట్‌ఫామ్‌లు అమెరికా వనరులను విద్యుత్తును వాడుకుంటూ భారత్, చైనా వంటి దేశాలకు సేవలు అందించడమేంటని ఆయన ప్రశ్నించారు. "భారత్‌లో ఏఐ సేవల కోసం అమెరికన్లు ఎందుకు మూల్యం చెల్లించాలి?" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. సాంకేతిక ప్రపంచంపై ఆయనకున్న అవగాహన రాహిత్యాన్ని లేదా భారత్ పట్ల ఉన్న ఫ్రస్ట్రేషన్‌ను సూచిస్తున్నాయి.

అసలు మంట ఎక్కడ మొదలైంది?

నవారో వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కారణం ఒక్క ఏఐ మాత్రమే కాదు. గ్లోబల్ డిజిటల్ మార్కెట్‌లో భారత్ ఇప్పుడు ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది. అమెరికా కంపెనీలకు భారత్ అతిపెద్ద ఆదాయ వనరుగా ఉంది. ప్రపంచ టెక్నాలజీ రంగంలో భారతీయుల ప్రభావం పెరగడం కూడా ఒక కారణం.. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి విషయాల్లో భారత్ తన సొంత నిర్ణయాలకు కట్టుబడి ఉంటోంది.

వ్యవసాయం నుంచి చమురు వరకు.. అంతా టార్గెట్టే!

నవారో విమర్శలు కేవలం టెక్నాలజీకే పరిమితం కాలేదు. అమెరికాలో విదేశీ సంస్థలు వ్యవసాయ భూములను భారీ ధరలకు కొనుగోలు చేస్తున్నాయని.. దీనివల్ల ఆహార ధరలు పెరుగుతున్నాయని ఆయన వాపోయారు. గతంలోనూ భారత్ విధిస్తున్న సుంకాలు.. అమెరికా ఉద్యోగాల కోత వంటి అంశాలపై ఆయన భారత్‌ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో భారత్ రష్యా నుంచి చమురు కొనడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే "ఇది మా దేశ ఇంధన భద్రతకు సంబంధించిన విషయం.. ఇందులో రాజకీయం లేదు" అని భారత్ ఇప్పటికే గట్టి కౌంటర్ ఇచ్చింది.

ఇది భయమా? అసూయనా?

ప్రపంచీకరణ యుగంలో సాంకేతికత ఒక దేశానికే పరిమితం కాదని తెలిసి కూడా నవారో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ అజెండా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ శక్తి సమీకరణాలు మారుతున్న వేళ భారత్ ఒక గ్లోబల్ లీడర్‌గా ఎదగడం ట్రంప్ వర్గంలోని కొందరికి మింగుడు పడటం లేదు. అందుకే ఈ ఏడుపు ఈ ఫ్రస్ట్రేషన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.