గ్లెండేల్‌లో ట్రంప్–మస్క్ రీయూనియన్: రాజకీయ–బిజినెస్ వర్గాల్లో సంచలనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా–స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య చోటుచేసుకున్న అనూహ్య రీయూనియన్ అంతర్జాతీయ రాజకీయ–ఆర్థిక రంగాన్ని కుదిపేస్తోంది.
By: A.N.Kumar | 22 Sept 2025 8:00 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా–స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య చోటుచేసుకున్న అనూహ్య రీయూనియన్ అంతర్జాతీయ రాజకీయ–ఆర్థిక రంగాన్ని కుదిపేస్తోంది. గత కొద్ది నెలలుగా బహిరంగంగా విభేదించిన ఈ ఇద్దరు ప్రముఖులు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ మెమోరియల్ సర్వీస్‌లో ఒకే వేదికపై ఏకమై సన్నివేశాన్ని సృష్టించారు.
మహత్తరమైన ఈ కార్యక్రమంలో ట్రంప్ ప్రైవేట్ బాక్స్‌లో తొలుత కనిపించిన మస్క్, అధ్యక్షుని సమీపంలో కూర్చోవడంతో అంతటా చర్చలు మొదలయ్యాయి. ఈ క్షణాన్ని అక్కడే ఉన్న యూఎఫ్‌సీ సీఈఓ డానా వైట్ సాక్షాత్కరించగా.. మీడియాలోని కెమెరాలు ఈ దృశ్యాన్ని ప్రపంచానికి విస్తరించాయి. ఒకప్పుడు బలమైన మైత్రి గల ఈ ఇద్దరి సంబంధాలు ఇటీవల కలకలం రేపే విధంగా దూరమయ్యాయి. కానీ ఈసారి మాత్రం వారు మర్యాదపూర్వకంగా పలకరించుకోవడం, చిన్న సంభాషణ జరుపుకోవడం పర్యవేక్షకులలో కొత్త ఆశలు, కొత్త ప్రశ్నలు రేపింది.
*మస్క్–ట్రంప్ మధ్య విభేదాల నేపథ్యం
మస్క్ ఒక దశలో ట్రంప్ ప్రభుత్వంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషెన్సీ (DOGE) ను నడిపిన తర్వాత ఆ స్థానాన్ని వీడారు. తరువాతి కాలంలో మస్క్, అనేక కీలక అంశాలపై ట్రంప్‌తో విభేదించారు. ముఖ్యంగా ఇటీవల ప్రవేశపెట్టిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ అనే వివాదాస్పద బిల్లుపై మస్క్ ఘాటైన వ్యతిరేకత వ్యక్తం చేశాడు. అదనంగా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌ని అన్‌సీల్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టాలని మస్క్ చేసిన డిమాండ్ పెద్ద వాదనకు దారితీసింది. ఇవే కారణాల వలన ఇద్దరి మధ్య కఠినమైన దూరం ఏర్పడింది.
*గ్లెండేల్‌లో కొత్త స్నేహానికి నాంది?
ఈ నేపథ్యంతోనె గ్లెండేల్‌లో జరిగిన ఈ సన్నివేశం కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. చిరునవ్వుతో పలకరించి, కొద్దిసేపటి పాటు మాట్లాడుకున్న ఈ సంఘటనను మీడియా ప్రపంచవ్యాప్త ప్రధాన శీర్షికగా ఎత్తిచూపింది. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ “ఎలాన్ వచ్చి మాతో మాట్లాడటం నాకు ఎంతో నచ్చింది. మేమిద్దరి మధ్య ఒకప్పుడు చాలా స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. ఇప్పుడు కూడా ఆయన దగ్గరకు వచ్చి పలకరించడంతో నాకు ఆనందంగా ఉంది,” అని చెప్పారు.
మస్క్ మాత్రం ఈ సంఘటనపై స్పష్టమైన వ్యాఖ్య చేయకపోయినా, ఆయన హాజరు అంతర్జాతీయంగా పవర్‌ఫుల్ మెసేజ్‌గా పరిగణించబడుతోంది.
*రాజకీయ–ఆర్థిక ప్రభావంపై ఊహాగానాలు
ట్రంప్–మస్క్ మళ్ళీ కలయికకి అనేక అర్థాలు చెబుతున్నారు. కొందరు దీన్ని సాధారణ మర్యాదపూర్వక పరిచయంగా తీసుకుంటున్నప్పటికీ, మరికొందరు వచ్చే అమెరికా ఎన్నికల నేపథ్యంలో జరిగే ఈ పరిణామం ప్రాధాన్యమూ వేరే కోణంలో చూడాలని అంటున్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆధునిక టెక్నాలజీపై ఆధారపడుతున్న క్రమంలో ట్రంప్–మస్క్ కలయిక బిజినెస్ రంగంపై పాజిటివ్ సిగ్నల్ అవుతుందనే అభిప్రాయం వెలువడుతోంది.
మరోవైపు మస్క్ వివాదాస్పద అంశాలపై నేరుగా స్పందిస్తూ రావడం వల్ల ట్రంప్‌తో కొత్త వివాదాలు మళ్ళీ తలెత్తే అవకాశమూ ఉందని పర్యవేక్షకులు భావిస్తున్నారు.
ప్రపంచం ఇప్పుడు ఒకే ప్రశ్నపై దృష్టి పెట్టింది. ఈ రీయూనియన్ మస్క్–ట్రంప్ మధ్య పాత స్నేహానికి నూతన నాంది అవుతుందా? లేక ఇది కేవలం ఒక మర్యాదపూర్వక పరిచయం మాత్రమేనా? అన్నది వేచిచూడాలి.
