మనమేమో 18 శాతం కట్టాలి అంట.. వాళ్లు అయితే జీరోనా.. ఇదేనా డీల్ అంటే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మరో సంచలనానికి తెరలేపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన అనంతరం ఆయన వెల్లడించిన వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను చర్చకు దారితీస్తున్నాయి.
By: A.N.Kumar | 3 Feb 2026 3:14 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మరో సంచలనానికి తెరలేపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన అనంతరం ఆయన వెల్లడించిన వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను చర్చకు దారితీస్తున్నాయి. స్నేహానికి స్నేహం.. వ్యాపారానికి వ్యాపారం అన్నట్లుగా సాగిన ఈ చర్చల్లో, భారత్ కుదుర్చుకున్న ఒప్పందం "సమానమైనదేనా?" అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒప్పందంలో అసలేముంది?
ట్రంప్ ప్రకటించిన వివరాల ప్రకారం.. భారత్-అమెరికా మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయితే ఇందులోని అంకెలే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధించే సుంకాన్ని 25% నుండి 18%కి తగ్గించింది. అంటే మనం అక్కడికి పంపే సరుకులపై ఇంకా 18% పన్ను కట్టాల్సిందే. అమెరికా నుండి వచ్చే ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న అన్ని రకాల సుంకాలను అడ్డంకులను పూర్తిగా జీరో (0%) కి తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు.
"అమెరికాకు మనం 18 శాతం కట్టాలి.. కానీ అమెరికా సరుకులు మాత్రం మన దేశంలోకి పైసా పన్ను లేకుండా రావాలి" ఇదేనా సమానమైన డీల్ అంటూ సామాన్యుడి నుండి ఆర్థిక నిపుణుల వరకు గొంతు ఎత్తుతున్నారు.
రష్యా ఆయిల్‌కు నో.. అమెరికాకు ఎస్!
ఈ ఒప్పందంలో మరో కీలక మలుపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ఉద్దేశంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయడానికి సిద్ధమైందని ట్రంప్ బాంబు పేల్చారు. ఆ లోటును పూడ్చుకోవడానికి అమెరికా, వెనిజువేలా దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తామని భారత్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా " బై అమెరికన్" విధానానికి మద్దతుగా సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన ఎనర్జీ, టెక్నాలజీ, బొగ్గు వంటి ఉత్పత్తులను అమెరికా నుండి కొనుగోలు చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ట్రంప్ స్పష్టం చేశారు.
నిపుణుల సందేహాలు: ఇది భారత్‌కు లాభమా? నష్టమా?
ఈ 'మెగా డీల్' పై ప్రధానంగా రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా వస్తువులు జీరో టారిఫ్‌తో భారత్‌కు వస్తే, ఇక్కడి స్థానిక పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు అమెరికా దిగుమతుల ధాటికి తట్టుకోగలవా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిగా భారత్ తన పట్టు నిలుపుకోవడానికి చైనాను అడ్డుకోవడంలో అమెరికా మద్దతు పొందడానికి మోదీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ కూడా నడుస్తోంది.
ఇదేనా అసలు డీల్?
"మేమిద్దరం పనులు చేసి చూపించే నాయకులం" అని ట్రంప్ గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఈ 'పని' వల్ల భారత ఖజానాకు ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనేది ఇప్పుడు ఆందోళనకరం. అమెరికా ఉత్పత్తులకు మన మార్కెట్‌ను పూర్తిగా వదిలేస్తూ మన ఎగుమతులపై ఇంకా 18% పన్ను భారాన్ని మోయడం.. ఒక రకంగా ఏకపక్ష ఒప్పందంగానే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
