Begin typing your search above and press return to search.

ఆ 35 నిమిషాల ఫోన్ కాల్ తర్వాతనే గ్యాప్ పెరిగిందా?

నిన్న మొన్నటి వరకూ ప్రపంచవ్యాప్తంగా ట్రంప్, మోడీ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   9 Aug 2025 11:07 AM IST
ఆ 35 నిమిషాల ఫోన్  కాల్  తర్వాతనే గ్యాప్  పెరిగిందా?
X

నిన్న మొన్నటి వరకూ ప్రపంచవ్యాప్తంగా ట్రంప్, మోడీ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వారిద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారేవి. కట్ చేస్తే ఇప్పుడు లెక్కలు పూర్తిగా మారిపోయాయనే చెప్పాలి. ఈ క్రమంలో అందుకు కారణం వీరిద్దరి మధ్య జరిగిన 35 నిమిషాల ఫోన్ కాల్ సంభాషనే అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒకరిపై ఒకరు డైలాగులు పేల్చుకుంటున్న పరిస్థితి!

అవును... ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌ లోని పహల్గాంలో ఉగ్రమూకలు దాడి చేయడం.. దానికి ప్రతీకారంగా జూలై 6-7 తేదీల్లో ‘ఆప‌రేష‌న్ సిందూర్’ చేపట్టిన భారత్.. పాక్ లోని ఉగ్రవాదులను, వారి శిభిరాలను వణికించి వదలడం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ – పాక్ మధ్య యుద్ధం జరిగింది. ఈ క్రమంలో పాక్ కాలబేరానికి రావడంతో మే 10 సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి.

అయితే భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తత‌లు త‌గ్గడంలో త‌న పాత్ర కీలకమని.. వాణిజ్యం పేరు చెప్పి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం చేయించానని.. లేదంటే, అణ్వాయుధాలు కలిగి ఉన్న ఇరు దేశాల మధ్య యుద్ధం ఇంకా జరుగుతూ ఉండేదని ట్రంప్ ప్రకటించుకున్నారు. అయితే ఈ వాదనను భార‌త్ తిర‌స్కరించింది. ఘ‌ర్షణ త‌గ్గడానికి కార‌ణం డీజీఎంవో స్థాయిలో జ‌రిగిన చ‌ర్చలేన‌ని.. మూడో దేశం పాత్ర లేద‌ని స్పష్టం చేసింది.

అయినప్పటికీ ట్రంప్ ఏమాత్రం తగ్గడం లేదు. ఏ దేశం వెళ్లిన, అక్కడ మైకుల ముందుకు వచ్చిన ప్రతీసారీ ఈ టాపిక్కే ఎత్తుతున్నారు. ఈ నేపథ్యంలో.. జూన్ 17న అమెరికా ట్రంప్‌ కు ప్రధాని న‌రేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. సుమారు 35 నిమిషాల పాటు ఫోన్ లో సంభాషించారు! ఈ సంద‌ర్భంలో పాక్ విష‌యంలో భార‌త్.. ఏ మూడో దేశం మ‌ధ్యవ‌ర్తిత్వాన్ని అంగీక‌రించ‌ద‌ని ట్రంప్‌ కు మోడీ స్పష్టం చేశారు.

ఇదే ఈ ఇరు దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితి కారణమని అంటున్నారు పరిశీలకులు. ఈ ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ పద్దతి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తుంది. ఈ ఫోన్ కాల్ తర్వాతే... పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ ను వైట్ హౌస్‌ లో భోజ‌నానికి ఆహ్వానించారు ట్రంప్. ఈ సందర్భంగా పాక్ కు 'ఐ లవ్ యూ' చెబుతూ.. భార‌త్‌ పై బ‌హిరంగంగానే తీవ్రమైన వ్యాఖ్యలు చేయ‌డం మొద‌లుపెట్టారు.

ఈ సందర్భంగా భారత్ ఎగుమతులపై భారీ సుంకాలు విధించడంతో పాటు రష్యాతో భారత్ వ్యాపారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పతనమైన ఆర్ధిక వ్యవస్థలు అనీ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో అమెరికా సుంకాల‌ నిర్ణయాన్ని, వ్యాఖ్యలను భార‌త్ తీవ్రంగా ఖండించింది. మరోవైపు ఈ వ్యవహారంపై తాజాగా ప్రధాని మోడీ పరోక్షంగా స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రైతుల సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని.. రైతులు, మత్స్యకారులు, పాడిరైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీపడబోమని.. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎంత మూల్యమైనా చెల్లించేందుకు తాను సిద్ధమేనని వ్యాఖ్యానించారు. దీంతో... అమెరికాను ఉద్దేశిస్తూ గట్టిగా బదులిచ్చినట్లయ్యింది!

అమెరికా రెండు నాలుకల ధోరణి!:

ఈ క్రమంలో అమెరికా రెండు నాలుకల ధోరణి అవలంభిస్తుంది. భారత్ పై తన కఠిన వైఖరిని కంటిన్యూ చేస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్... రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని తాజాగా స్పష్టం చేశారు.

మరోవైపు ట్రంప్‌ వ్యాఖ్యలకు విరుద్ధంగా అమెరికా విదేశాంగ శాఖ మరో కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... 'ఇండియా.. అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి' అని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్‌ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.