జిన్ పింగ్ పై ట్రంప్ ది అసూయ.. వెటకారమా.. అంతకుమించా..?
అవును.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రిపబ్లికన్ సెనేటర్లతో జరిగిన సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఇటీవల జరిగిన సమావేశం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
By: Raja Ch | 6 Nov 2025 10:20 AM ISTఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ ది చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పై ఉన్నది అసూయా.. లేక, వెటకారమా.. లేక తనదైన నియంతృత్వాన్ని అధికారికంగా అమలు చేస్తున్నారని చెప్పే ఉద్దేశ్యమా అనేది తెలియదు కానీ.. తాజాగా ఈ సందేహాలకు, ఈ తరహా చర్చకు కారణం మాత్రం తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలే. ఈ గ్యాప్ లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పైనా ఆసక్తికర కామెంట్లు చేశారు.
అవును.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రిపబ్లికన్ సెనేటర్లతో జరిగిన సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఇటీవల జరిగిన సమావేశం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఇందులో భాగంగా... జిన్ పింగ్ సహచరులు ఉన్నట్లుగా తన సొంత మంత్రివర్గ సభ్యులు కూడా తనకు విధేయులుగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
'అంతలా భయపడే పురుషులను ఎప్పుడూ చూడలేదు'!:
తాజాగా ఈ విషయాలపై స్పందించిన ట్రంప్... జిన్ పింగ్ తో వచ్చిన అధికారులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. జిన్ పింగ్ కు ఇరువైపులా ఆరుగురు నిటారుగా నిలబడ్డారని.. వారిలో ఒకరితో తాను మాట్లాడిన అతడు స్పందించలేదని.. జీవితంలో పురుషులు ఇంతలా భయపడటం తానెప్పుడూ చూడలేదని ట్రంప్ కామెంట్ చేశారు.
'జిన్ పింగ్ లాంటి సహచరులు నాకూ కావాలి'!:
అక్కడితో ఆగని ట్రంప్ వ్యాఖ్యలు... తనకు జిన్ పింగ్ కు మధ్య జరిగిన సంభాషణ అంతటా సెనేటర్లలో ఎవరూ మాట్లాడలేదని చెప్పారు. ఆ దృశ్యాన్ని అనుకరిస్తూ.. అతని రెండు వైపులా ఆరుగురు వ్యక్తులు ఉన్నారని.. అందరూ అలాగే నిలబడి, నిశితంగా గమనిస్తున్నారని.. తాను వారిని కదిలించినా, వారి నుంచి తనకు ఎటువంటి సమాధానం రాలేదని.. జిన్ పింగ్ వారిని స్పందించనివ్వలేదని.. తనకు అలాంటి సహచరులు కావాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.
జేడీ వాన్స్ పై సెటైర్లు!:
ఇలా తన మంత్రివర్గం కూడా అలాగే ప్రవర్తించాలని తాను కోరుకుంటున్నాను అని చెప్పిన ట్రంప్.. నా మంత్రివర్గం కూడా జిన్ పింగ్ మంత్రివర్గంలా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే... ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వైపు టాపిక్ మళ్లించారు. ఇందులో భాగంగా... జేడీ మాత్రం అలా ప్రవర్తించడని.. సంభాషణల సమయంలో అధ్యలో దూరి, అంతరాయం కలిగిస్తాడని అన్నారు. అతను కనీసం కొన్ని రోజులైనా చైనీయులలా ప్రవర్తించాలని తాను కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ విధంగా తనది అసూయో, వెటకారమో, ఆగ్రహమో పూర్తిగ తెలియకుండా తనదైన శైలిలో స్పందించారు ట్రంప్.
