Begin typing your search above and press return to search.

ట్రంప్ ‘టారిఫ్ లు’ మిస్ ఫైర్ అయ్యిందా?

అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న ట్రంప్ మామకు ఇప్పుడు కొత్త రకం చెమటలు పడుతున్నాయి.

By:  A.N.Kumar   |   26 Sept 2026 10:35 AM IST
ట్రంప్ ‘టారిఫ్ లు’ మిస్ ఫైర్ అయ్యిందా?
X

అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న ట్రంప్ మామకు ఇప్పుడు కొత్త రకం చెమటలు పడుతున్నాయి. ఏ సమస్య వచ్చినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి లేదా వేదికలెక్కి తన స్టైల్‌లో డైలాగులు కొడితే సరిపోతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. జనం జేబులకు పడుతున్న భారీ కన్నాలు, గ్యాస్ బంకుల దగ్గర మండిపోతున్న బిల్లులు చూసి అమెరికన్ల కడుపు రగిలిపోతోంది. విదేశాంగ విధానాలంటూ పెద్ద పెద్ద ఊహల్లో విహరించడం బాగానే ఉంది కానీ కిరాణా షాపుకు వెళ్తే బిల్లు చూసి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయని జనాలు పళ్లు నూరుతున్నారు. అదే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీని పట్టుబట్టి మరీ ఓడిస్తామని జనాలు సర్వేలు చెబుతుండడం అధికార రిపబ్లికన్ మార్టీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మధ్యంతర ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వస్తున్న సర్వేలన్నీ రిపబ్లికన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు 2026 మధ్యంతర ఎన్నికలు మామూలు పరీక్షలా లేవు.. ఏకంగా పెద్ద గండంలా ముంచుకొస్తున్నాయి. పాలన అంటే కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. వేదికలపై నిలబడి గట్టిగా కేకలు వేయడం కాదు.. జనం జేబులకు పెద్ద చిల్లులు పడకుండా చూడటమని అమెరికా ఓటర్లు ఇప్పుడు గట్టిగానే గుర్తుచేస్తున్నట్లున్నారు. విదేశాంగ విధానంలో ఊహించని మెలికలు, దానికి తోడు దేశంలో ద్రవ్యోల్బణం దెబ్బకు గ్యాస్, నిత్యావసరాల ధరలు రాకెట్ వేగంతో చుక్కలనంటుతుంటే జనం కడుపు మండి ట్రంప్ గారి వైపు చాలా కోపంగా చూస్తున్నారు.

తాజాగా వచ్చిన ‘ఎన్.పీఆర్/పీబీఎస్ న్యూస్ / మారిస్ట్ పోల్ ’ సర్వే రిపబ్లికన్ల గుండెల్లో ఏకంగా బుల్లెట్ ట్రైన్లను పరిగెత్తిస్తోంది. ఇప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారు అని అడిగితే డెమొక్రాట్లకు ఏకంగా 53 శాతం, రిపబ్లికన్లకు కేవలం 41 శాతం మద్దతు పలికారు. అంటే డెమొక్రాట్లకు సాలిడ్‌గా 12 శాతం పాయింట్ల ఆధిక్యం అన్నమాట.. ఏ పార్టీకి చెందని ‘స్వతంత్ర ఓటర్లు’ కూడా ట్రంప్ మార్క్ పాలనకు ఏకంగా 25 పాయింట్ల తేడాతో బహిరంగంగానే 'టాటా' చెప్పేస్తున్నారు. మరోవైపు రౌటర్స్ / ఇప్సోస్ తాజా సర్వే కూడా డెమొక్రాట్లకు 8 పాయింట్ల ఆధిక్యం ఉందని స్పష్టం చేసింది. ఈ ఏడాదిలో నమోదైన అతిపెద్ద ఆధిక్యాల్లో ఇది ఒకటి కావడం విశేషం.

ట్రంప్ గ్రాఫ్ పై ‘ధరా’గ్రహం.. జనం ఆగ్రహం

అసలు ఈ ఎన్నికలు కాంగ్రెస్ నియోజకవర్గాలకు జరుగుతున్నాయా లేక ట్రంప్ పాలనకు గ్రేడింగ్ ఇస్తున్నారా అంటే.. రెండోదే నిజమనిపిస్తోంది. ఓటర్లలో ఏకంగా 45 శాతం మంది తమ ఓటు పక్కాగా ట్రంప్‌కు వ్యతిరేకమే అని తెగేసి చెప్పారు. ఆయనకు అనుకూలంగా ఓటేస్తామన్నది కేవలం 24 శాతం మందే.. ట్రంప్ గారి పనితీరుపై ఓవరాల్ అప్రూవల్ రేటింగ్ 32 శాతానికి దిగజారగా.. ముఖ్యంగా పెరుగుతున్న జీవన వ్యయాన్ని, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడంలో ఆయన పెర్ఫార్మెన్స్‌కు జనం ఇచ్చిన స్కోర్ కేవలం 17 శాతం.. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు జనాలు ట్రంప్ పై ఎంత పీక్స్‌ ఫస్ట్రేషన్ లో ఉన్నారో...

లక్షల రూపాయల 'ఫ్రీ బిస్కెట్' హామీ

పరిస్థితి తీవ్రతను గ్రహించిన ట్రంప్ మామ వెంటనే తన వద్ద ఉన్న పాత మాస్టర్ ప్లాన్‌ను బయటకు తీశారు. రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్లు కనుక హౌస్, సెనెట్ రెండింటినీ గెలిపించి తమ పవర్ నిలబెడితే ప్రతి అమెరికన్ వయోజనుడికి ఏకంగా $5,000.. మన భారతీయ కరెన్సీలో రూ. 4 లక్షలకు పైగా ఉచితంగా చెల్లిస్తామని కొత్త ఉచిత హామీ ఇచ్చారు. దీనికి ప్రేమగా ‘ట్రంప్ డివిడెండ్’ అని పేరు కూడా పెట్టారు..

అయితే ఈ ఉచిత పథకానికి ఏకంగా 1.2 నుంచి 1.35 ట్రిలియన్ డాలర్లు కావలసి వస్తుంది. వేరే దేశాలపై భారీగా టారిఫ్‌లు వేసి ఆ డబ్బు తెస్తామని ట్రంప్ గారు లెక్కింపులు చెబుతున్నారు కానీ ఆర్థిక నిపుణులు మాత్రం "అంత బొమ్మ లేదు.. ఆ లెక్కలకు పొంతన లేదు" అని పెదవి విరుస్తున్నారు. అసలు కాంగ్రెస్ అనుమతి లేకుండా ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేస్తున్నారు.

ముందుంది అసలైన ముసళ్ల పండుగ!

సాధారణంగా అమెరికా చరిత్రలో మధ్యంతర ఎన్నికల్లో అధికారంలో ఉన్న అధ్యక్షుడి పార్టీకి కొంత వ్యతిరేకత ఉండటం సహజమే. కానీ ఈసారి ట్రంప్ సొంత నిర్ణయాలు, ఆకాశాన్నంటిన ధరలు ఆ వ్యతిరేకతను సునామీలా మార్చేలా ఉన్నాయి. ఓటర్ల మైండ్ సెట్ ఎన్నికల నాటికి మారే అవకాశం లేకపోలేదు కాబట్టి డెమొక్రాట్ల గెలుపుపై ఇప్పుడే పక్కాగా సీల్ వేయలేం కానీ ప్రస్తుతం ఉన్న వేవ్ మాత్రం ట్రంప్ మామకు, ఆయన రిపబ్లికన్ పార్టీకి గట్టి హెచ్చరిక సంకేతాలనే పంపుతోంది.