Begin typing your search above and press return to search.

నేనేం మీ ఫొటో కోసం అడుక్కోలేదు.. ట్రంప్ కు ఇచ్చిపడేసిన మెలోనీ

డొనాల్డ్ ట్రంప్ ఏ వేదికపై మాట్లాడినా.. ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం కొత్త విషయం కాదు.

By:  A.N.Kumar   |   20 Jun 2026 12:11 AM IST
నేనేం మీ ఫొటో కోసం అడుక్కోలేదు.. ట్రంప్ కు ఇచ్చిపడేసిన మెలోనీ
X

డొనాల్డ్ ట్రంప్ ఏ వేదికపై మాట్లాడినా.. ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం కొత్త విషయం కాదు. మిత్రదేశాల నేతలను సైతం వదలకుండా ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు తాజాగా అమెరికా-ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితిని సృష్టించాయి. వ్యక్తిగత అహంకారం, వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య సంబంధాలను ఎలా ప్రమాదంలో పడేస్తాయనే దానికి ఈ ఘటన ఒక తాజా ఉదాహరణగా నిలుస్తోంది.

వివాదానికి కారణం ఏమిటి?

ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు ముగిసిన అనంతరం ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "మెలోని తనతో ఫోటో దిగేందుకు ప్రాధేయపడిందని.. ఆమెపై జాలి వేసి మాత్రమే తాను ఫోటోకు అంగీకరించాను. ఆమె నాతో మాట్లాడినందుకు సంతోషంగా ఉండి ఉంటుంది, కానీ నాకు ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి.

ఎక్స్ వేదికగా మెలోని ఘాటు స్పందన

ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తక్షణమే అంతే ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ట్రంప్ వ్యాఖ్యలను పూర్తిగా అవాస్తవం, కల్పితం అంటూ కొట్టిపారేశారు. "నేను కానీ ఇటలీ దేశం కానీ ఎవరి ముందూ ఎన్నటికీ ప్రాధేయపడవు" అని ఆమె స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు తన మిత్రదేశాల పట్ల ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొంటూ ఇటలీ లాంటి భాగస్వామ్య దేశాల పట్ల గౌరవంతో వ్యవహరించాలని ఆమె సున్నితంగానే హెచ్చరించారు.

భగ్గుమన్న ఇటలీ ప్రభుత్వం.. దౌత్యపరమైన చర్యలు

ఈ వివాదం కేవలం సోషల్ మీడియా విమర్శలకే పరిమితం కాలేదు. ఇది ఇటలీ దేశ సార్వభౌమాధికారానికి.. ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా మారడంతో ఇటలీ ప్రభుత్వం మొత్తం ట్రంప్‌పై ఒకే స్వరంతో విరుచుకుపడింది. ట్రంప్ వ్యాఖ్యలకు నిరసనగా తన అధికారిక అమెరికా పర్యటనను ఇటలీ విదేశాంగమంత్రి ఆంటోనియో తక్షణమే రద్దు చేసుకున్నారు. ఇది ఇటలీ దేశాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.

దశాబ్దాల బంధంలో పెరుగుతున్న దూరం

నిజానికి ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన ప్రారంభంలో మెలోని అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావించారు. అయితే గతంలో పోప్ లియోపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, అలాగే ఇరాన్ అంతర్జాతీయ వ్యూహాల అంశంపై ఇరు దేశాల మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పటికే సంబంధాల్లో చీలికలు తెచ్చాయి. ఇప్పుడు నేరుగా మెలోనిపైనే ట్రంప్ వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఆ దూరం మరింత పెరిగేలా కనిపిస్తోంది.

అంతర్జాతీయ దౌత్యంలో ప్రతి మాటకు.. ప్రతి హావభావానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా మిత్రదేశాల నేతల మధ్య పరస్పర గౌరవం అనేది ద్వైపాక్షిక బంధాలకు మూలస్తంభం. అలాంటి సమయంలో ట్రంప్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు అమెరికా విదేశాంగ విధానంపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ వివాదం తాత్కాలిక రాజకీయ దుమారంగానే ముగుస్తుందా? లేదా అమెరికా–ఇటలీ దౌత్య సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.