హాట్ టాపిక్: ట్రంప్ టార్గెట్‌లో జార్జియా మెలోనీ.. అసలు కారణం ఇదేనా?
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు.. ఇటీవల జరిగిన జీ7 సదస్సు నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మరో ఆసక్తికర రాజకీయ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
By: A.N.Kumar | 21 Jun 2026 11:39 AM ISTఅమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు.. ఇటీవల జరిగిన జీ7 సదస్సు నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మరో ఆసక్తికర రాజకీయ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు పరస్పర గౌరవంతో మిత్రులుగా కనిపించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య ఇప్పుడు మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. వీరిద్దరూ బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది.
వివాదానికి కారణమైన ఆ ‘ఫొటో’ వ్యాఖ్యలు
ఈ వివాదానికి నాంది జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పడింది. ఇటాలియన్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. "మెలోనీ ఎంతో వేడుకోవడంతోనే ఆమెతో ఫొటో దిగాను" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై జార్జియా మెలోనీ అంతే ఘాటుగా స్పందించారు. ట్రంప్ చెప్పినది పూర్తిగా అసత్యమని కొట్టిపారేస్తూ.. అంతర్జాతీయ వేదికపై తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ట్రంప్ సోషల్ మీడియా వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. ఇటలీలో మెలోనీ రాజకీయ ప్రజాదరణ రోజురోజుకూ తగ్గిపోతోందని.. అందుకే తనతో దిగిన ఫొటోలను రాజకీయ ప్రయోజనాల కోసం.. మైలేజ్ కోసం ఆమె ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇటలీలో ఆమె నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉందంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు.
అసలు కారణం ‘ఇరాన్’ వ్యూహమేనా?
పైకి ఇది వ్యక్తిగత ఈగోల పోరాటంగా కనిపిస్తున్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు దీని వెనుక బలమైన అంతర్జాతీయ రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఇరాన్ విషయంలో అమెరికా తీసుకుంటున్న కొన్ని దూకుడు నిర్ణయాలను మెలోనీ బహిరంగంగానే తప్పుపట్టారు. అమెరికా చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆమె వ్యాఖ్యానించడం ట్రంప్‌కు తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఇరాన్‌పై వ్యూహాత్మక దాడుల కోసం సిసిలీలోని కీలక సైనిక స్థావరాన్ని ఉపయోగించుకునేందుకు అమెరికా బాంబర్ విమానాలకు ఇటలీ అనుమతి నిరాకరించిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది అమెరికా రక్షణ వ్యూహాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
పోప్ వివాదం
గతంలో పోప్‌పై ట్రంప్ చేసిన కొన్ని విమర్శలను మెలోనీ తీవ్రంగా ఖండించారు. క్యాథలిక్ దేశమైన ఇటలీ ప్రధానిగా ఆమె పోప్‌కు బహిరంగ మద్దతు ప్రకటిస్తూ మత నాయకుల పట్ల కనీస గౌరవం ఉండాలని ట్రంప్‌ను ఉద్దేశించి పేర్కొనడం కూడా ఈ వివాదాన్ని మరింత పెంచింది.
సంబంధాలపై ప్రభావం చూపుతుందా?
ప్రస్తుతానికి ట్రంప్-మెలోనీ మధ్య చోటుచేసుకున్న ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలపై ఇరు దేశాల అధికారిక ప్రభుత్వాలు ఎలాంటి సంయుక్త ప్రకటన విడుదల చేయలేదు. ఈ వివాదం కేవలం ఇద్దరు నేతల వ్యక్తిగత రాజకీయ విమర్శల స్థాయిలోనే ఆగిపోతుందా? లేక భవిష్యత్తులో అమెరికా-ఇటలీ దేశాల దౌత్య, ఆర్థిక సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్స్ మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ ప్రస్తుతం ప్రపంచ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
