Begin typing your search above and press return to search.

అమెరికాలో ట్రంప్ పరువు పాయే

ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియాకు అనుకోని ఇబ్బంది ఎదురైంది.

By:  A.N.Kumar   |   24 Sept 2025 3:45 PM IST
అమెరికాలో ట్రంప్ పరువు పాయే
X

ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియాకు అనుకోని ఇబ్బంది ఎదురైంది. సభలో ప్రసంగించే ముందు వీరిద్దరూ ఎక్కిన ఎస్కలేటర్‌ ఒక్కసారిగా ఆగిపోవడంతో ఆ క్షణం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎస్కలేటర్‌పై ట్రంప్‌, మెలానియా అయోమయం

న్యూయార్క్‌లో జరుగుతున్న ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశాలకు హాజరైన ట్రంప్‌ దంపతులు వేదికకు చేరేందుకు ఎస్కలేటర్‌ ఎక్కారు. అయితే ఎక్కిన వెంటనే అది పనిచేయకుండా ఆగిపోయింది. దీంతో ట్రంప్‌, మెలానియా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఆగిపోయిన ఎస్కలేటర్‌ను మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లాల్సి వచ్చింది.

ప్రసంగంలోనే ప్రస్తావించిన ట్రంప్‌

ఈ ఘటనను స్వయంగా ట్రంప్‌ సభలో ప్రస్తావించారు. ‘‘ఈ రోజు నాకు రెండు సమస్యలు ఎదురయ్యాయి. మొదటిది చెత్త ఎస్కలేటర్‌, రెండోది పనిచేయని టెలిప్రాంప్టర్‌’’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఆయన వ్యాఖ్యలు సభలో చప్పట్లతో మార్మోగాయి.

వైట్‌హౌస్‌ ఆగ్రహం, దర్యాప్తు ఆదేశాలు

అయితే ఈ సంఘటనపై వైట్‌హౌస్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘అధ్యక్షుడు, ప్రథమ మహిళ ఎక్కిన వెంటనే ఎస్కలేటర్‌ ఆగిపోవడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆపి ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఐరాస వివరణ

ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ ఈ ఘటనపై స్పష్టత ఇచ్చారు. ‘‘ఎస్కలేటర్‌పై ఉన్న సేఫ్టీ మెకానిజం బటన్‌ అనుకోకుండా నొక్కబడింది. ట్రంప్‌ రాకకు కొన్ని నిమిషాల ముందు ఆయన వీడియోగ్రాఫర్‌ అక్కడకు వెళ్లి వీడియో తీయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పొరపాటున ఆ బటన్‌ను నొక్కినట్లు సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ గుర్తించింది’’ అని ఆయన తెలిపారు.

ఈ సంఘటనపై ట్రంప్‌ హాస్యంతో స్పందించినా వైట్‌హౌస్‌ గంభీరంగా తీసుకోవడం, ఐరాస స్పష్టత ఇవ్వడం ఆసక్తికర చర్చనీయాంశమైంది.