Begin typing your search above and press return to search.

యుద్ధోన్మాది ట్రంప్ కు అడ్డూ అదుపు లేదా? మరో దేశంపైకి దండయాత్ర?

గతంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ దేశాల్లో ప్రజాస్వామ్యం, భద్రత పేరుతో అమెరికా అడుగుపెట్టి ఏం సాధించింది? దశాబ్దాల పాటు సాగిన ఆ యుద్ధాలు లక్షలాది మంది పిలకాయలను అనాథలుగా మార్చాయి.

By:  A.N.Kumar   |   23 July 2026 11:49 PM IST
యుద్ధోన్మాది ట్రంప్ కు అడ్డూ అదుపు లేదా? మరో దేశంపైకి దండయాత్ర?
X

ప్రపంచశాంతికి మళ్ళీ ముప్పు పెరిగిందా? అగ్రరాజ్యపు అహంకారం మరో నిర్దోషి దేశాన్ని బలితీసుకోబోతోందా? అధికార పీఠమెక్కిన నాటి నుంచి క్షిపణులు, దాడుల మంత్రమే జపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు పశ్చిమ ఆఫ్రికా వైపు తన యుద్ద కన్ను వేశారు.

ఏళ్ళ తరబడి సాగుతున్న ఆధిపత్య పోరులో ఎందరో అమాయకుల రక్తం చిందినా అగ్రరాజ్యాల దాహం తీరడం లేదు. ఇప్పటికే సోమాలియా, ఇరాక్, సిరియా, యెమెన్, నైజీరియా వంటి దేశాలను యుద్ధ భూములుగా మార్చి అక్కడి ప్రజల జీవితాలను ఛిద్రం చేసిన చరిత్ర అమెరికాది. ఇప్పుడు ఆ నల్లటి నీడ పశ్చిమ ఆఫ్రికాలోని 'మాలి' దేశంపై పడనుందనే వార్తలు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం

ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ వెలువరించిన కథనం ప్రకారం మాలి దేశంలో విస్తరిస్తున్న 'జమాత్ నుస్రత్ అల్-ఇస్లామ్ వల్-ముస్లిమీన్' అనే ఉగ్రవాద సంస్థను మట్టుబెట్టే నెపంతో అక్కడ ప్రత్యక్ష సైనిక చర్యకు ట్రంప్ ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. అల్-ఖైదాతో సంబంధాలున్న ఈ సంస్థ బుర్కినా ఫాసో, నైజర్‌లలో కూడా విస్తరిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నది నిజమే కావచ్చు. ఉగ్రవాదం అంతమవ్వాలన్నది సమస్త మానవాళి కోరిక.. కానీ ఉగ్రవాదాన్ని అణచివేసే పేరుతో అమెరికా జరిపే దాడుల్లో బలైపోయేది మాత్రం ఏ పాపం ఎరుగని సామాన్య ప్రజలే.. శాంతి స్థాపన పేరుతో ముష్కరులపై జరిపే దాడులు.. ఆఖరికి కొన్ని వేల కుటుంబాల కన్నీటికి, నిర్బంధాలకు కారణమవుతున్నాయి.

చరిత్ర నేర్పిన పాఠాలేమిటి?

గతంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ దేశాల్లో ప్రజాస్వామ్యం, భద్రత పేరుతో అమెరికా అడుగుపెట్టి ఏం సాధించింది? దశాబ్దాల పాటు సాగిన ఆ యుద్ధాలు లక్షలాది మంది పిలకాయలను అనాథలుగా మార్చాయి. పేదరికం, ఆకలి కేకల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆఫ్రికా ఖండంలో ఇప్పటికే మానవహక్కుల ఉల్లంఘనలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా కనుక మాలిపై నేరుగా క్షిపణులు రువ్వితే ఆ ప్రాంతం మరో తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడటం ఖాయం.

తుది నిర్ణయంపై ఉత్కంఠ

ప్రస్తుతానికి మాలిపై దాడులకు సంబంధించి అమెరికా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ వైట్ హౌస్ గుమ్మాల్లో ఈ రకమైన చర్చలు జరగడమే వినాశనానికి సంకేతమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి అంతర్జాతీయ సహకారంతో కూడిన దౌత్యపరమైన చర్యలు అవసరమా? లేక సైనిక బలాన్ని ప్రదర్శిస్తూ మరొక దేశాన్ని రక్తాసిక్తం చేయడం సరియైనదా? ట్రంప్ తీసుకునే ఒక్క నిర్ణయం పశ్చిమ ఆఫ్రికా భవిష్యత్తును, అక్కడి కోట్ల మంది ప్రజల జీవితాలను తిరగరాసే ప్రమాదం ఉంది. అగ్రరాజ్యం తన యుద్ధ దాహాన్ని పక్కనపెట్టి శాంతియుత మార్గంలో ఆలోచించాలని ప్రపంచ మేధావులు, శాంతి కాముకులు బిగ్గరగా కోరుకుంటున్నారు.