Begin typing your search above and press return to search.

ట్రంప్ నోబెల్ మోజు తీర్చిన మచాడో.. వైట్ హౌస్ లో ఇచ్చేసింది

ఒక్కొక్కళ్లకు ఒక్కో అంశం మీద మోజు ఉంటుంది. మోతాదుకు మించకుండా ఉంటే ఫర్లేదు.

By:  Garuda Media   |   16 Jan 2026 9:28 AM IST
ట్రంప్ నోబెల్ మోజు తీర్చిన మచాడో.. వైట్ హౌస్ లో ఇచ్చేసింది
X

ఒక్కొక్కళ్లకు ఒక్కో అంశం మీద మోజు ఉంటుంది. మోతాదుకు మించకుండా ఉంటే ఫర్లేదు. కానీ.. హద్దులు దాటే మోజుతో కొత్త సమస్యలు వచ్చి పడతాయి. సహజంగానే సంపన్నుడు.. దానికి తోడు ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఏదైనా అంశం మీద మోజు పడితే ఇంకేం ఉంటుంది? అందునా.. మర్యాదల్ని పక్కన పెట్టేసి.. తాను అనుకున్నది సాధించేందుకు మొండిగా వ్యవహరించే ట్రంప్ లాంటోళ్ల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.

అన్నీ ఉన్నా ఏదో ఒకటి లేదని ఫీలయ్యే బ్యాచ్ మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. ట్రంప్ లోనూ అలాంటి వైఖరి కనిపిస్తుంటుంది. ఆయనకు ఎందుకు కలిగిందో కానీ.. నోబెల్ శాంతి బహుమతి తనకు అందాలని.. తనకు సొంతం కావాలని ఆయన కోరుకున్నారు. అంతకంటే తపించారని చెప్పాలి. అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్నోళ్లు అలాంటి వాటి మీద మనసు పడ్డా.. తమకు దక్కాల్సింది దక్కించుకోవటానికి సున్నితంగా.. గౌరవప్రదంగా వ్యవహరిస్తారు.కానీ.. ట్రంప్ అలా కాదు కదా?

తాను ఇష్టపడిన నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కాలని డిసైడ్ కావటమే కాదు.. ఓపెన్ గా పలుమార్లు అడిగేశారు. తన అర్హత లెక్కల్ని చెప్పుకున్నారు. తనకు మించి నోబెల్ శాంతి బహుమతికి అర్హత ఉన్నోళ్లు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని తేల్చేశారు. లోగుట్టు లాబీయింగ్ తో నోబెల్ శాంతి బహుమతి దక్కే ఛాన్సు అంతో కొంత ఉంటుంది. ట్రంప్ మాదిరి ఓపెన్ గా కోరుకున్న తర్వాత.. ఆ పురస్కారం ఆయనకు దక్కితే.. నోబెల్ శాంతి బహుమతికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఏమవుతాయో నోబెల్ కమిటీకి తెలిసిందే. అందుకే.. వారు ట్రంప్ మోజును పరిగణలోకి తీసుకోలేదు.

2025 ఏడాదికి వెనెజువెలా ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడోకు దక్కింది. తనకు దక్కని శాంతిపురస్కారం దక్కించుకున్న దేశం మీద అక్కసు పెంచుకున్న ట్రంప్.. ఎట్టకేలకు తన తగ్గ వాదనను తెర మీదకు తీసుకొచ్చి.. ఆ దేశం మీదా తన సైనికుల్ని పంపటమే కాదు.. ఆ దేశాధ్యక్షుడ్ని.. ఆయన సతీమణిని అదుపులోకి తీసుకొని ఆగమేఘాల మీద న్యూయార్క్ కు తరలించిన ఎపిసోడ్ అందరికి తెలిసిందే.

తాజా సీన్ విషయానికి వస్తే.. వెనెజువెలా ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడో తాజాగా అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతి మెడల్ ను ఆయనకు అందజేసినట్లుగా పేర్కొన్నారు. గంటకు పైగా సాగిన ఈ భేటీ అనంతరం వైట్ హైస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ‘మనం అధ్యక్షుడు ట్రంప్ మీద ఆధార పడొచ్చు’ అని పేర్కొనటమే కాదు.. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేయించారు. ఈ సందర్భంగా తన నోబెల్ శాంతి బహుమతి మెడల్ ను ట్రంప్ కు స్వయంగా అందజేసినట్లుగా ఆమె పేర్కొన్నారు. మరి.. ఆమె ఇచ్చిన నోబెల్ మెడల్ ను ట్రంప్ తీసుకున్నారా? లేదా? అన్న దానిపై మాత్రం ఆమె సమాధానం ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం చూస్తే.. నోబెల్ శాంతి పురస్కారాన్ని మరొకరికి బదిలీ చేయటం.. ఇతరులకు ఇవ్వటం లాంటివి సాధ్యం కాదు. అయితే.. నోబెల్ శాంతి మెడల్ ను ముచ్చట పడిన ట్రంప్ కు.. తన మెడల్ ను ఇచ్చేయటం ద్వారా ఆయన మనసును గెలుచుకున్నారని చెప్పాలి.

దీనికి తగ్గట్లే మచాడోతో భేటీ అనంతరం ట్రంప్ రియాక్టు అయ్యారు. తాను కోరుకున్నది కోరుకున్నట్లుగా దక్కకున్నా.. ఏదోలా అయినా తన చేతికి వచ్చిన నోబెల్ పతకం నేపథ్యంలో ఆయన హ్యాపీ మూడ్ ఆయన మాటల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ‘మచాడోతో భేటీ కావటం గొప్ప విషయం. ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్న అద్భుత మహిళ ఆమె. నేను చేస్తున్న కృషికి గుర్తింపుగా తన నోబెల్ బహుమతిని అందజేశారు. పరస్పర గౌరవానికి ఇది మంచి సంకేతం. థాంక్యూ మరియా’ అంటూ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు చేశారు.

తాజా భేటీ సందర్భంగా కరేబియన్ లో చమురు ట్యాంకర్లను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని ట్రంప్ తో మచాడో చర్చించినట్లుగా తెలుస్తోంది. తమ దేశ ప్రజల స్వేచ్ఛ కోసం అమెరికా అధ్యక్షుడి మీద ఆధారపడొచ్చన్న భావనను ఆమె తన మాటల్లో వ్యక్తం చేశారు. మొత్తానికి ట్రంప్ నోబెల్ మెడల్ ముచ్చటను మచాడో తీర్చారని చెప్పాలి.