Begin typing your search above and press return to search.

నోబెల్ కాదన్నది.. ట్రంప్‌ కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రతిష్టాత్మక ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్ ను ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ సోమవారం అధికారికంగా ప్రకటించారు.

By:  A.N.Kumar   |   13 Oct 2025 12:26 PM IST
నోబెల్ కాదన్నది.. ట్రంప్‌ కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారం
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రతిష్టాత్మక ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్ ను ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. శాంతి స్థాపనలో గాజాలో బందీల విడుదలకు సంబంధించిన ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించినందుకు గానూ ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ అవార్డును ఇజ్రాయెల్ దేశానికి లేదా మానవాళికి అసాధారణమైన కృషి చేసిన వ్యక్తులకు ఇస్తారు.

* పురస్కారానికి కారణాలు

ట్రంప్‌కు ఈ గౌరవం దక్కడానికి ముఖ్యంగా ఈ అంశాలను ఇజ్రాయెల్ అధ్యక్షుడు హెర్జోగ్ తన ప్రకటనలో ప్రస్తావించారు. హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు, అలాగే గాజాలో రెండు సంవత్సరాలకు పైగా కొనసాగిన యుద్ధాన్ని ముగించడానికి ఉద్దేశించిన శాంతి ఒప్పందాన్ని కుదర్చడంలో ట్రంప్ చేసిన అలుపెరుగని కృషికి ఈ అవార్డు దక్కింది. ట్రంప్ నిరంతర ప్రయత్నాల ద్వారా తమ ప్రియమైన వారిని ఇంటికి తీసుకురావడమే కాకుండా, మధ్యప్రాచ్యంలో భద్రత, సహకారం, శాంతియుత భవిష్యత్తుపై ఆధారపడిన నూతన శకానికి పునాదులు వేశారని హెర్జోగ్ పేర్కొన్నారు. అబ్రహాం ఒప్పందాల ద్వారా శాంతి వృత్తాన్ని విస్తరించడం, ఇజ్రాయెల్ భద్రత, పౌరుల శ్రేయస్సుకు ఆయన చేసిన ప్రత్యేక సహకారంతో ఈ అవార్డు లభించింది..

* అధ్యక్షుడు హెర్జోగ్ ప్రకటన

"ఆయన అలుపెరగని కృషి ద్వారా అధ్యక్షుడు ట్రంప్ మన ప్రియమైన వారిని ఇంటికి తీసుకురావడమే కాకుండా భద్రత, సహకారం , శాంతియుత భవిష్యత్తుపై ఆధారపడిన మధ్యప్రాచ్యంలో కొత్త శకానికి పునాదులు వేశారు. ఆయనకు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్ ను ప్రదానం చేయడం నాకు గొప్ప గౌరవం."గా పేర్కొన్నారు.

* ప్రదానోత్సవం ఎప్పుడు?

అవార్డును రాబోయే కొన్ని నెలల్లో అందజేయనున్నట్లు హెర్జోగ్ కార్యాలయం తెలిపింది. ట్రంప్ సోమవారం ఇజ్రాయెల్‌ను సందర్శించినప్పుడు.. ఆయనకు ఈ నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేయనున్నారు. ఈ పర్యటనలో ట్రంప్ బందీల కుటుంబాలను కలవడంతో పాటు ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది.

* పూర్వపు గ్రహీతలు

ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా (2013లో) , జో బైడెన్ (2022లో) కూడా అందుకున్నారు. ట్రంప్‌కు ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి దక్కకపోయినా, ఈ ఇజ్రాయెల్ అత్యున్నత పౌర గౌరవం అంతర్జాతీయంగా ఆయన కృషికి లభించిన ఒక ముఖ్యమైన గుర్తింపుగా పరిగణించబడుతోంది.