Begin typing your search above and press return to search.

ట్రంప్ మాస్టర్‌ క్లాస్ : క్రెడిట్ నాదే.. బురద నీదే! జేడీ వాన్స్‌తో ‘సేఫ్ గేమ్’

ఇరాన్‌పై చమురు ఆంక్షల సడలింపు, నిధుల విడుదల వంటి ప్రతిపాదనలపై సొంత రిపబ్లికన్ పార్టీలోనే అగ్గి రాజుకుంటోంది.

By:  A.N.Kumar   |   23 Jun 2026 1:42 PM IST
ట్రంప్ మాస్టర్‌ క్లాస్ : క్రెడిట్ నాదే.. బురద నీదే! జేడీ వాన్స్‌తో ‘సేఫ్ గేమ్’
X

రాజకీయాల్లో "నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చెయ్" అనే సామెత పాతబడిపోయింది. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటో తెలుసా? "సక్సెస్ అయితే నా ఖాతా.. ఫెయిల్ అయితే నీ నెత్తిన.." సరిగ్గా ఇదే ఫార్ములాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్లై చేశారని గట్టిగా టాక్ వినిపిస్తోంది. స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చల ఎపిసోడ్ చూశాక.. ట్రంప్ రాజకీయ చాణక్యానికి దౌత్యవేత్తలే ముక్కున వేలేసుకుంటున్నారు.

వాన్స్‌కు దౌత్య ‘షాక్’?

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌లతో హ్యాపీగా ముచ్చటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లిపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పాపం వాన్స్ మాత్రం "అబ్బే.. అలాంటిదేం లేదు, ఆ తర్వాత కూడా మేం గంటల తరబడి మాట్లాడుకున్నాం" అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇరాన్ మీడియా మాత్రం "ఫొటోలకు పోజులిచ్చేది లేదు, ట్రంప్ హెచ్చరికలు మాకు నచ్చలేదు" అంటూ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

'వాన్స్ డీల్' వెనుక అసలు ‘స్కెచ్’!

ఇరాన్‌పై చమురు ఆంక్షల సడలింపు, నిధుల విడుదల వంటి ప్రతిపాదనలపై సొంత రిపబ్లికన్ పార్టీలోనే అగ్గి రాజుకుంటోంది. మరి ఇంత పెద్ద తలనొప్పి వ్యవహారంలో ట్రంప్ లాంటి కింగ్ మేకర్ డైరెక్ట్‌గా సీన్‌లోకి వస్తారా? అస్సలు రారు.. అందుకే తెలివిగా జేడీ వాన్స్‌ను ముందు సీట్లో కూర్చోబెట్టారు. విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ శాఖ పెద్దలు ఈ వ్యవహారానికి సుదూరంగా ఉండటం చూస్తుంటే.. "వస్తే లాభం.. పోతే వాన్స్" అనే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.

ట్రంప్ మార్క్ పంచ్

"ఒప్పందం కుదిరితే క్రెడిట్ నాదే.. ఫెయిల్ అయితే నింద జేడీదే!" అని ట్రంప్ సరదాగా అన్నారో.. సీరియస్‌గా అన్నారో కానీ.. అమెరికా మీడియా మాత్రం దీన్ని అక్షరాలా నిజం చేస్తోంది. ఇప్పటికే పార్టీ వర్గాల్లో దీన్ని ‘వాన్స్ డీల్’ అని పిలవడం మొదలుపెట్టేశారు.

పొలిటికల్ లెక్కలు: ప్లస్సా? మైనస్సా?

ఈ దౌత్య నాటకంలో జేడీ వాన్స్ భవిష్యత్తు ఇప్పుడు ఇరాన్ చేతుల్లో పడింది. ఒకవేళ డీల్ సక్సెస్ అయితే 2028 అధ్యక్ష ఎన్నికల్లో జేడీ వాన్స్ రేంజ్ మారిపోతుంది. "నేను సాధించిన శాంతి" అంటూ ఆయన కాలర్ ఎగరేయొచ్చు. ఒకవేళ ఫెయిల్ అయితే రిపబ్లికన్ పార్టీలోనే వాన్స్‌ను ఒక ఆట ఆడేసుకుంటారు. ట్రంప్ మాత్రం క్లీన్ చిట్‌తో సైడ్ అయిపోతారు.

ఏదేమైనా స్విట్జర్లాండ్ చర్చలు ఇరాన్ దౌత్యం కంటే ట్రంప్ ‘సేఫ్ గేమ్’ వ్యూహాలకే ఎక్కువ పాపులర్ అయ్యాయి. "క్రెడిట్ నాది.. రిస్క్ నీది" అనే ఈ సరికొత్త పొలిటికల్ మేనేజ్‌మెంట్‌లో జేడీ వాన్స్ పాస్ అవుతారా లేదా ట్రంప్ వ్యూహానికి బలిపశువు అవుతారా అనేది కాలమే నిర్ణయించాలి.