Begin typing your search above and press return to search.

మాటకు విలువేది ట్రంప్ మహాశయా ?

అమెరికా వంటి అగ్ర రాజ్యానికి రెండోసారి కూడా అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ తన ఇరవై నెలల పాలనలో ఎన్నో విన్యాసాలు చూపించారు అని అంటున్నారు.

By:  Satya P   |   3 Aug 2026 1:23 PM IST
మాటకు విలువేది ట్రంప్ మహాశయా ?
X

అమెరికా వంటి అగ్ర రాజ్యానికి రెండోసారి కూడా అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ తన ఇరవై నెలల పాలనలో ఎన్నో విన్యాసాలు చూపించారు అని అంటున్నారు. అన్నింటికీ మించి ప్రపంచమంతా విసిగి వేసారుతున్న పశ్చిమాసియా సంక్షోభం విషయంలో తడవకో మాట మారుస్తూ ట్రంప్ తన నిలకడలేని తనాన్ని చాటుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన ఒకసారి ఇరాన్ తో యుద్ధం అంటారు, మరోసారి శాంతి చర్చలు అంటారు. ఇలా గడచిన ఆరు నెలలుగా ట్రంప్ చేసిన ప్రకటనలతో ఆయన చెప్పే మాటలను ఏది నమ్మాలో తెలియక అంతర్జాతీయ సమాజం అలా నివ్వెరపోతూ చూస్తోంది.

తాజా ప్రకటన ఇది :

ఇక ఇరాన్ మీద దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. యుద్ధాన్ని నివారించే ప్రయత్నం ఇది అన్నారు. అంతే కాదు హర్మూజ్ జల సంధి ద్వారా నౌకలు అన్నీ సజావుగా సాగేందుకు మార్గం సుగమం చేసేందుకే ఈ నిర్ణయం అని చెప్పారు. ఇలా ట్రంప్ చేసిన ప్రకటన ఇపుడు ప్రపంచానికి ఏమీ వింతగా కొత్తగా తోచడం లేదు అని అంటున్నారు. ఎందుకంటే ఆయన మళ్ళీ ఎపుడు ఇరాన్ మీద దాడులు మొదలెడతారో అన్న చర్చ సాగుతోంది.

ప్రపంచ బాధలు ఎన్నో :

ప్రపంచం ఈ రోజు నానా రకాలుగా సమస్యలు పడుతోంది. హర్మూజ్ జల సంధి చుట్టూ ఆధారపడి పేద మధ్య తరహా దేశాలు ఎన్నో ఉన్నాయి. ముడి చమురు ఆగిపోయి దానితో పాటు నిత్యావసర సరకుల ధరలు కూడా ఎక్కడికక్కడ భారీగా పెరిగిపోయి జనాలు పడుతున్న అవస్థలు నరక ప్రాయంగా ఉంటున్నాయి. ఇలా ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం పశ్చిమాసియా సంక్షోభం వల్ల ముప్పతిప్పలు పడుతూంటే ట్రంప్ పూటకో మాట రోజుకో ప్రకటన చేస్తూ అయోమయానికి గురి చేస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన చెప్పే మాటలను దేనిని నమ్మాలో తెలియక ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి.

ఇరాన్ అయితే నమ్మట్లేదా :

ఇక ఇరాన్ దేశం అయితే అమెరికాను పట్టించుకోవడం మానేసిందా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ఒక రోజు యుద్ధం అని చెప్పి మరో రోజు శాంతి అంటున్న ట్రంప్ తో ఇలాగే ఉంటుంది అని గ్రహించి తన పని తాను వ్యూహాత్మకంగా చేసుకుంటోంది అని అంటున్నారు. నిజానికి ఫిబ్రవరి 28న ఇరాన్ తో అమెరికా ఇర్జాయెల్ తో కలసి యుధ్ధం మొదలెట్టింది. అలా యుద్ధం సాగుతూనే ఉంది, అమెరికా దాడులు చేస్తూనే ఉంది. మధ్యలో శాంతి అంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటనలే వింత గొలిపేలా ఉన్నాయని అంటున్నారు.

ఎన్ని పిల్లి మొగ్గలో :

ఇక ఫిబ్రవరి 28 నుంచి ఆగస్టు 3 దాకా చూస్తే ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్ని కూడా అమెరికా పెద్దన వేస్తూ వచ్చారని గుర్తు చేస్తున్నారు. తేదీల వారీగా నెలల వారీగా ట్రంప్ చేసిన విభిన్న ప్రకటనలు చూస్తే కనుక ఇంతలా అగ్ర రాజ్యం అధినేత ఎవరైనా మాట మారుస్తూ పోయారా అన్న సందేహాలు రావడం ఖాయం. పోనీ ఇది అమెరికా వ్యూహం అని అనుకున్నా అక్కడ మ్యాటర్ సీరియస్ గా ఉంది. ఇది ఏ ఒకటి రెండు దేశాలతో ముడి పడి ఉన్న అంశం అయితే కానే కాదు, ప్రపంచంలో అనేక దేశాలతో ముడి పడి ఉన్న ఈ సమస్య విషయంలో పెద్దన్న తీరు ఇలాగేనా అన్న చర్చ కూడా సాగుతోంది.

శాంతి దిశగా చర్చలను ముగించాలని :

ఇరాన్ మీద బాంబులు వేస్తామని ఒక రోజు అంటారు, మరో రోజు ఇరాన్ దారికి వచ్చింది, ఇక అన్నీ మంచి రోజులే అని చెబుతారు. ఆ వెంటనే తనను హత్య చేయాలని చూస్తున్నారు అని ఆయనే అంటారు. తాను ఇక చూస్తూ ఊరుకోనని ఇరాన్ సంగతి తేల్చేస్తాను అంటారు. ఇలా అమెరికా ప్రెసిడెంట్ హోదాలో ట్రంప్ కేవలం ఇరాన్ విషయంలో చేసిన డజన్ల కొద్దీ ప్రకటనలు చూసిన వారు అంతా మాట విలువ నిలుపుకో పెద్దన్నా అని అంటున్నారు. ఇప్పటికైనా ఇరాన్ విషయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకుని శాంతి దిశగా చర్చలను ముగించాలని అంతా కోరుతున్నారు.