ట్రంప్ సంతకం చెప్పేదేంటి? గ్రాఫాలజీ నిపుణుల విశ్లేషణ ఏంటి?
కొద్ది నెలలుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి కాస్త ఊపిరి పీల్చుకునేలా ఇరాన్ తో యుద్ధ విరమణకు సంబంధించిన చారిత్రక పత్రాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.
By: Garuda Media | 18 Jun 2026 12:01 PM ISTకొద్ది నెలలుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి కాస్త ఊపిరి పీల్చుకునేలా ఇరాన్ తో యుద్ధ విరమణకు సంబంధించిన చారిత్రక పత్రాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికా కాలమానం ప్రకారం జూన్ 17 రాత్రి ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ తో యుద్ధాన్ని శాశ్వతంగా ముగించే లక్ష్యంతో రూపొందించిన పద్నాలుగు అంశాల చారిత్రాత్మక అవగాహనఒప్పందం హార్డ్ కాపీపై ఫ్రాన్స్ లోని వర్సయ్స్ ప్యాలెస్ లో ట్రంప్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సంతకాన్ని మీడియాలో స్పష్టంగా.. చాలా దగ్గరగా చూపించారు. ఈ క్రమంలో ఆయన సంతకంపై పలువురు ఆసక్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
మిగిలిన ప్రపంచ దేశాల అధినేతల సంతకాలకు భిన్నంగా ట్రంప్ సంతకం ఉంటుందని చెబుతారు. ట్రంప్ సంతకంతోనే ఆయన తీరును ఇట్టే చెప్పేయొచ్చని హ్యాండ్ రైటింగ్ సిగ్నేచర్ అనాలిసిస్ నిపుణులు చెబుతుంటారు. ఇందుకు తగ్గట్లే ట్రంప్ సంతకం ఎలా ఉంటుంది?ఆయన సంతకం చెప్పేదేంటి? ట్రంప్ మైండ్ సెట్ కు సరిపోయేలా ఆయన సంతకం ఉంటుందా? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే..
ప్రపంచంలోనే అత్యంత సులువుగా గుర్తించే ప్రపంచ అధినేత సంకతాల్లో ట్రంప్ సంతకం ఒకటిగా చెబుతారు. ఆయన తన సంతకాన్ని నల్లటి లావుపాటి మార్కర్ పెన్ తో చాలా పెద్ద సైజ్ లో స్పష్టంగా సంతకం చేస్తుంటారు. ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆయన ఇదే శైలిని అనుసరించినట్లుగా చెబుతారు. గ్రాఫాలజీ నిపుణుల విశ్లేషణ చూస్తే..ట్రంప్ సంతకం ఆయన వ్యక్తిత్వాన్ని.. తీరును చెప్పకనే చెప్పేస్తుందని చెబుతారు. ట్రంప్ సంతకంలో ఆసక్తికర కోణం ఏమంటే.. ఎక్కడా అక్షరాలు కనిపించవు. సాధారణంగా గుండ్రంగా ఉండే అక్షరాలకు బదులుగా.. కేవలం పైకి.. కిందకు ఉండే నిలువు గీతల మాదిరి కనిపిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే కొండల వరుస మాదిరిగా ఆయన సంతకం ఉంటుంది.
మరింత సులువుగా చెప్పాలంటే సీస్మోగ్రాఫ్ రీడింగ్ చూస్తున్నట్లుగా ఆయన సంతకం ఉంటుంది. ఈ తీరు ఆయనలోని తీవ్రమైన దూకుడు.. పట్టుదల.. మొండితనాన్ని సూచిస్తుందని చెబుతారు. కాగితం మీద ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేలా.. చూసినంతనే కొట్టొచ్చినట్లుగా కనిపించేలా పెద్ద అక్షరాలతో సంతకం చేయటం ట్రంప్ నకు అలవాటు. ఇది ఆయనలోని అపరిమితమైన ఆత్మవిశ్వాసం.. ఇగోతో పాటు ప్రపంచం తనను గమనించాలనే తపనను తెలియజేస్తుందని చెబుతారు. తన సంతకంతో తాను ఒక పవర్ ఫుల్ బ్రాండ్ అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడని చెబుతారు. మార్కర్ పెన్ ను బలంగా నొక్కి పెట్టి సంతకం చేసే తీరు చూస్తే.. ఆయనలోని అధికార కాంక్ష.. కఠిన నిర్ణయాలు తీసుకునే తీరును చెబుతాయని చెబుతారు.
మరో ఆసక్తికర అంశం ఏమంటే.. సాధారణంగా అంతర్జాతీయ దౌత్య ఒప్పందాలపై అధినేతలు తమ సంతకాల్ని చిన్నగా.. హుందాగా ఉండేలా పెట్టేస్తుంటారు. అయితే.. ట్రంప్ మాత్రం అందుకు భిన్నంగా తన సంతకం స్పష్టంగా.. పెద్దగా కనిపించేలా పెట్టే తీరు చూస్తే.. మొత్తం క్రెడిట్ తనకే దక్కాలన్న తపన ఆయన సంతకం ద్వారా కొట్టొచ్చినట్లుగా ఉంటుందని చెబుతారు. తన శక్తిని ప్రదర్శిస్తూ.. ఆంక్షల ముప్పుతో ఒప్పించినట్లుగా ఆయన సంతకంలో కనిపిస్తుందని చెబుతారు.
