Begin typing your search above and press return to search.

ఊపిరి పీల్చుకో ప్రపంచమా..!! ఇరాన్‌తో మహా ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

By:  Tupaki Political Desk   |   12 Jun 2026 3:17 PM IST
ఊపిరి పీల్చుకో ప్రపంచమా..!! ఇరాన్‌తో మహా ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన
X

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధానికి సంబంధించి తాము ఒక గొప్ప, చారిత్రాత్మక సెటిల్‌మెంట్‌ చేసుకున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. ఈ డీల్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ఫైనలైజ్ చేసే ప్రక్రియ ప్రస్తుతం శరవేగంగా సాగుతోందని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటనతో ప్రపంచ దేశాలలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని అంటున్నారు.

ఈ వీకెండ్‌లోనే సంతకాలు!

వైట్ హౌస్ వేదికగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ‘ఇరాన్‌తో డీల్ దాదాపు ఖరారైంది. రానున్న కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తికావచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ వారాంతంలోనే యూరప్‌లో ఇరు దేశాల మధ్య సంతకాల కార్యక్రమం జరగొచ్చు’ అని స్పష్టం చేశారు. ఈ ఒప్పందంతో గల్ఫ్ రీజియన్‌లో శాంతి నెలకొంటుందని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.

ఆ ఒక్క కండిషన్‌కు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశాన్ని ట్రంప్ మీడియాకు వివరించారు. ‘ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండకూడదు’ అనే ప్రధాన నిబంధనపైనే ఈ డీల్ కుదిరినట్లు ఆయన స్పష్టం చేశారు. అమెరికా పెట్టిన ఈ గట్టి కండిషన్‌కు ఇరాన్ అంగీకరించడం అంతర్జాతీయ దౌత్య చరిత్రలోనే ఒక పెద్ద మైలురాయిగా నిలిచిపోనుంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట!

అంతర్జాతీయంగా ముడిచమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’పై ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపనుందని అంటున్నారు. ఇరాన్‌తో ఒప్పందంపై సంతకాలు పూర్తి కాగానే హార్ముజ్ జలసంధి పూర్తిస్థాయిలో ఓపెన్ అవుతుందని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు అంటే 20 శాతం చమురు రవాణా హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతోంది. ఉద్రిక్తతల కారణంగా ఇక్కడ రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజా డీల్‌తో చమురు సంక్షోభానికి బ్రేక్ పడటమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లు కోలుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం గత కొంతకాలంగా తెరవెనుక నడిచిన సుదీర్ఘ దౌత్య చర్చల ఫలితంగానే ఈ ఒప్పందం సాధ్యమైందని అంటున్నారు. యూరప్ దేశాలు ఈ డీల్‌లో కీలక మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల తీవ్ర సంక్షోభంలో ఉన్న ఇరాన్.. తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకే అణ్వాయుధాల తయారీని పక్కనబెట్టి అమెరికాతో చేతులు కలపడానికి మొగ్గు చూపినట్లు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో అటు మిడిల్ ఈస్ట్‌తోపాటు ఇటు ప్రపంచ దేశాలకు పెద్ద ఊరట లభించినట్లయింది.