Begin typing your search above and press return to search.

ట్రంప్ దెబ్బకు వెనక్కి తగ్గిన ఇరాన్.. మంత్రి కీలక వ్యాఖ్యలు!

ఇరాన్ లో సుమారు గత రెండు వారాలుగా పరిస్థితి ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేలాది మంది రోడ్లపైకి వచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు.

By:  Raja Ch   |   15 Jan 2026 10:18 PM IST
ట్రంప్ దెబ్బకు వెనక్కి తగ్గిన ఇరాన్.. మంత్రి కీలక వ్యాఖ్యలు!
X

ఇరాన్ లో సుమారు గత రెండు వారాలుగా పరిస్థితి ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వేలాది మంది రోడ్లపైకి వచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. మరోవైపు వారిపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది.. నిరసనకారులపై భద్రతా దళాలు పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకూ సుమారు 3,500 వరకూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ట్రంప్ మరింత గట్టిగా హెచ్చరించారు.

ఇందులో భాగంగా... నిరసనకారుల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని టెహ్రాన్‌ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సూచించారు. అలాకానిపక్షంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నట్లు హెచ్చరించారు. మరోవైపు ఓ నిరసనకారుడిని బహిరంగంగా ఉరితీసేందుకు ఇరాన్ సిద్ధమైనట్లు వార్తలు రాగా.. ట్రంప్ దీనిపై ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అలాంటి ఆలోచన లేదని ఆ దేశ మంత్రి తాజాగా స్పందించారు.

ఆందోళనకారులకు మరణశిక్ష విధించాలని టెహ్రాన్‌ భావిస్తుందని కథనాలొస్తున్న వేళ.. అదే జరిగితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్న వేళ.. అరెస్టయిన ఆందోళనకారులపై విచారణను త్వరితగతిన పూర్తిచేసి, వారిపై ఏ చర్యలు తీసుకోవాలన్నా వెంటనే తీసుకోవాలని.. ఆలస్యమైతే తీవ్రత తగ్గిపోయి, పెద్ద ప్రభావం ఉండదని ఇరాన్‌ జ్యుడీషియరీ చీఫ్‌ ఘొలామ్‌ హుసేన్‌ మొహ్సెనీ-ఎజీ అభిప్రాయపడిన వేళ.. ఇరాన్ విదేశాంగ మంత్రి స్పందించారు.

అవును... ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులను ఉరితీయాలని టెహ్రాన్ యోచిస్తోందని.. ఈ విషయంలో తాను సీరియస్ గా రియాక్ట్ అవుతానని.. అలాంటి ఆలోచనలు మానుకోకపోతే ఇరాన్ సరికొత్త విషయాలను చూడాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో.. నిరసనకారులను ఉరి తీయాలనే విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ఖండించారు. తమ వద్ద అలాంటి ప్రణాళికలు లేవని చెప్పుకొచ్చారు. దీంతో ట్రంప్ దెబ్బ పనిచేసినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా... వాషింగ్టన్ - టెహ్రాన్ వివాదం మళ్లీ మొదలవుతుందనే భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఖతార్‌ లోని వైమానిక స్థావరం నుండి అమెరికా కొంతమంది సిబ్బందిని ఉపసంహరించుకోవడం ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా తనకున్న సోర్సెస్ ద్వారా.. ఇరాన్ లో సంక్షోభం ఎలా అభివృద్ధి చెందిందో తాను తెలుసుకుంటున్నానని.. నిశితంగా గమనిస్తున్నానని అన్నారు. అయితే అమెరికా సైనిక చర్య తీసుకునే అవకాశాన్ని మాత్రం ఆయన తోసిపుచ్చలేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐ.ఆర్.జీ.సీ) స్పందించింది. ఈ సందర్భంగా ఇరాన్ తన శత్రువులైన ఇజ్రాయెల్, అమెరికాలపై నిర్ణయాత్మకంగా స్పందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఇదే సమయంలో.. దేశాన్ని ముంచెత్తుతున్న నిరసనల వెనుక ఇజ్రాయెల్, అమెరికా హస్తం ఉందని ఐ.ఆర్.జీ.సీ కమాండర్ మొహమ్మద్ పక్పూర్ ఆరోపించారు. అమెరికా ఈ విషయంలో జోక్యం చేసుకుంటే ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.