ట్రంప్ మాటల యుద్ధం.. ఇరాన్ ప్రజల ప్రాణసంకటం: నమ్మి నిండా మునిగారా?
అంతర్జాతీయ రాజకీయాల్లో అగ్రరాజ్యం అమెరికా తీసుకునే నిర్ణయాలు ప్రపంచ గమనాన్ని మారుస్తాయి.
By: A.N.Kumar | 19 Jan 2026 7:00 PM ISTఅంతర్జాతీయ రాజకీయాల్లో అగ్రరాజ్యం అమెరికా తీసుకునే నిర్ణయాలు ప్రపంచ గమనాన్ని మారుస్తాయి. కానీ, అదే అమెరికా ఇచ్చే 'అరకొర' హామీలు, సోషల్ మీడియా హెచ్చరికలు నమ్మి పోరాటంలోకి దూకితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి ప్రస్తుతం ఇరాన్ లో నెలకొన్న పరిస్థితులే నిదర్శనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి ఇప్పుడు ఇరాన్ ప్రజలను అటు ఇటు కాకుండా మిగిల్చింది.
గందరగోళంలో ట్రంప్ వ్యూహాలు
ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచీ పరస్పర విరుద్ధమైన ధోరణిని అవలంబిస్తున్నారు. ఒకరోజు సైనిక చర్యకు ఆదేశిస్తానని హెచ్చరించడం.. మరుసటి రోజే తాము శాంతిని కోరుకుంటున్నామని చెప్పడం, ఆపై ఇరాన్ పాలకులను పొగుడుతూ ట్వీట్లు చేయడం.. ఈ విచిత్ర ప్రవర్తన ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. అయితే ఈ అయోమయ వ్యూహాల మధ్య ఇరాన్ నిరసనకారులు మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఆశ పెంచిన అమెరికా ప్రకటనలు
ఇరాన్ లో మతపరమైన పాలన, నియంతృత్వ పోకడలపై సామాన్య ప్రజల్లో ఏళ్ల తరబడి అసంతృప్తి ఉంది. దీనికి తోడు పెరిగిన నిత్యావసరాల ధరలు, ఆర్థిక సంక్షోభం ప్రజలను రోడ్ల మీదకు తెచ్చాయి. సరిగ్గా అదే సమయంలో ట్రంప్ చేసిన "సహాయం వస్తోంది.. నిరసనలు కొనసాగించండి" వంటి వ్యాఖ్యలు ఆందోళనకారుల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి.
అమెరికా సైన్యం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని తమను ఈ పాలకుల నుంచి విముక్తులను చేస్తుందని ఇరాన్ ప్రజలు బలంగా నమ్మారు. గతంలో వెనిజులా విషయంలో అమెరికా వ్యవహరించిన తీరును చూసి ఇక్కడ కూడా అదే జరుగుతుందని వేలాది మంది ప్రాణాలకు తెగించి నిరసనల్లో పాల్గొన్నారు.
నిట్టనిలువునా ముంచేసిన వెనకడుగు
నిరసనలు ఉధృతమై ఇరాన్ ప్రభుత్వం అణచివేత చర్యలు మొదలుపెట్టిన తరుణంలో అమెరికా పెంటగాన్ నుంచి వచ్చిన ప్రచారం అందరినీ ఆశ్చర్యపరిచింది. "యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి.. లాక్డ్ అండ్ లోడెడ్" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ప్రజలు ఆకాశం వైపు చూస్తూ గడిపారు. కానీ చివరి నిమిషంలో ట్రంప్ గొంతు మార్చారు. "ఇరాన్ పాలకులతో చర్చలు జరుగుతున్నాయి.. వారు హామీ ఇచ్చారు" అంటూ ట్రంప్ వెనక్కి తగ్గడం నిరసనకారుల గుండెల్లో పిడుగులా పడింది. అప్పటికే వందలాది మంది ఇరాన్ పౌరులు భద్రతా దళాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. వేల మంది జైళ్లపాలయ్యారు. ఈ దశలో అమెరికా చేతులెత్తేయడం తమను బలిపశువుల్ని చేయడమేనని అక్కడి ప్రజలు గొంతెత్తుతున్నారు.
బలిపశువులైన నిరసనకారులు
ప్రస్తుతం ఇరాన్ వీధుల్లో నిశ్శబ్దం ఆవరించింది. కానీ ఆ నిశ్శబ్దంలో ఒక రకమైన ఆవేదన, ఆగ్రహం గూడుకట్టుకున్నాయి. "మేము ఆయన మాటలు నమ్మి రోడ్ల మీదకు వచ్చాం. మా కుటుంబ సభ్యులను కోల్పోయాం. ఇప్పుడు ఆయన మమ్మల్ని వదిలేసి ఇరాన్ ప్రభుత్వంతో రాజీ పడుతున్నారు" అని ఒక బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారులు ఇప్పుడు అటు ప్రభుత్వం నుంచి శిక్షలు అనుభవిస్తూ ఇటు అమెరికా నుంచి సహాయం అందక "నిండా మునిగిన" పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
కొందరు రాజకీయ విశ్లేషకులు దీనిని ట్రంప్ యొక్క "మైండ్ గేమ్"గా అభివర్ణిస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వాన్ని చర్చల ద్వారా దారికి తెచ్చుకోవడానికి నిరసనకారులను ఒక పావుగా వాడుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అంతర్జాతీయ రాజకీయాల్లో అగ్రరాజ్యాల మాటలు ఎంత ప్రమాదకరంగా మారతాయో చెప్పడానికి ఇరాన్ ఒక చేదు ఉదాహరణగా నిలిచింది. నాయకుల మాటలకు నైతికత లేకపోతే చివరకు బలి అయ్యేది సామాన్య ప్రజలేనని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
