ఇరాన్ తో వ్యాపారం చేస్తే.. 25 శాతం టారిఫ్
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఉంది ఇరాన్ పరిస్థితి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది.
By: A.N.Kumar | 13 Jan 2026 3:22 PM ISTమూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఉంది ఇరాన్ పరిస్థితి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు తాజాగా ట్రంప్ తీసుకున్న చర్యలు మరింత ఇబ్బందికరంగా మారబోతున్నాయి. ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకం విధించినట్టు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇరాన్ కు మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఇరాన్ తో చైనా, భారత్, టర్కీ, యూఏఈ, ఇరాక్ దేశాలు వ్యాపారం చేస్తున్నాయి. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఈ దేశాలపై 25 శాతం టారిఫ్ లు ఉండే అవకాశం ఉంది.
25 శాతం టారిఫ్ లు ..
ఇరాన్ తో వ్యాపారం చేస్తున్న దేశాలు.. అమెరికాకు వస్తువులు ఎగుమతి చేస్తే ఆ ఎగుమతులపైన ట్రంప్ 25 శాతం టారిఫ్ విధిస్తారు. ఫలితంగా ఆయా దేశాల వస్తువుల ధరలు అమెరికాలో పెరుగుతాయి. దీంతో అమెరికన్లు ఆ వస్తువులకు బదులుగా తక్కువ ధరకు వచ్చే వస్తువులు కొనుగోలు చేస్తారు. దీంతో క్రమంగా అమెరికాకు ఎగుమతులు తగ్గుతాయి. అది వాణిజ్య లోటుకు దారితీస్తుంది. ఇప్పటికే భారత్ పై 50 శాతం టారిఫ్ విధించారు. ఇప్పుడు ఇరాన్ తో వ్యాపారం కొనసాగితే .. 50 శాతానికి అదనంగా 25 శాతం టారిఫ్ లు విధించవచ్చు.
ఇరాన్ తో వ్యాపారం ఆగతుందా ?
ట్రంప్ 25శాతం టారిఫ్ విధించడంతో చైనా, ఇండియా, టర్కీ, యూఏఈ, ఇరాక్ లాంటి దేశాలు ఇరాన్ తో వ్యాపారం ఆపుతాయా అన్న ప్రశ్న వినిపిస్తోంది. చైనా ఎట్టిపరిస్థితుల్లోనూ అమెరికా ఆంక్షలకు వెనక్క తగ్గదు. ఇరాన్ తో వ్యాపారం కొనసాగిస్తుందనే వాదన ఉంది. అదే సమయంలో ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆధారపడి ట్రంప్ టారిఫ్ లు భారత ఎగుమతులపై ప్రభావం చూపుతాయి. రష్యాతో వ్యాపారం చేయొద్దన్నా.. ఇండియా వ్యాపారం కొనసాగిస్తోంది. మరి ఇరాన్ విషయంలో భారత్ ఎలాంటి వైఖరి ప్రదర్శించబోతుందన్న చర్చ ఉంది.
కరెన్సీ విలువ భారీ పతనం..
13-1-2026 రోజున ఉన్న సమాచారం మేరకు ఒక అమెరికన్ డాలర్ తో దాదాపుగా 10 లక్షల ఇరాన్ రియాల్ లు కొనుగోలు చేయవచ్చు. దీనిని భారీ పతనంగా చూడవచ్చు. ఆర్థిక పతనం అంచున ఇరాన్ ఉన్నట్టు అంచనా ఉంది. ఇరాన్ ప్రభుత్వంపై ట్రంప్ సైనిక చర్య చేపడతారనే ప్రచారం ఉంది. అందుకే అమెరికా ఇరాన్ లోని తన పౌరులకు కీలక సూచన చేసింది. వీలైనంత త్వరగా ఇరాన్ వదలాలని సూచించింది. లేదంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఉంది.
