రష్యా కట్టడికి సుంకాల షాక్.. భారీ ప్యాకేజ్ భారత్ కు ఇవ్వొచ్చుగా?
మీరు కోరుకున్నది సొంతం చేసుకోవటానికి అయితే ప్రయత్నం చేయాలి. లేదంటే.. అంతో ఇంతో ఖర్చు చేయాలి.
By: Garuda Media | 25 Aug 2025 10:42 AM ISTమీరు కోరుకున్నది సొంతం చేసుకోవటానికి అయితే ప్రయత్నం చేయాలి. లేదంటే.. అంతో ఇంతో ఖర్చు చేయాలి. అందుకు భిన్నంగా.. మన ఎజెండాను అమలు చేసేందుకు ఎదుటోడు భారం మోయాలని కోరటంలో అర్థముందా? ఇప్పుడు భారత్ విషయంలో అగ్రరాజ్యం చేస్తున్నది ఇదే. సుంకాల పేరుతో షాకుల మీద షాకులు ఇస్తున్న ట్రంప్ కు వంత పాడేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు తెర మీదకు వచ్చారు. సుభాషితాల మాదిరి భారత్ కు ఉపదేశాల్ని ఇవ్వటం మొదలు పెట్టారుజేడీ వాన్స్.
రష్యాకు చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గించటం.. తద్వారా యుద్ధాన్ని కొనసాగించలేకుండా చేయటమే లక్ష్యమన్న వాన్స్.. అందుకే రష్యా నుంచి చమురు కొంటున్న భారత్ పై సుంకాల్ని విధించినట్లుగా చెప్పుకొచ్చారు. రష్యాపై అధ్యక్షుడు ట్రంప్ బలమైన ఆర్థిక ఒత్తిడిని తీసుకొచ్చారన్న వాన్స్.. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించే విషయంలో అగ్రరాజ్యం మధ్యవర్తి పాత్ర పోషిస్తుందన్నారు.
భారత్ పై అదనపు సుంకాల్ని విధించటం ద్వారా.. చమురు నుంచి వచ్చే రష్యా ఆదాయాలు తగ్గుతాయని.. రష్యా దాడుల్ని ఆపివేస్తే.. దానిని మళ్లీ ప్రపంచ ఆర్థిక వ్యవస్తలో చేర్చవచ్చని.. దాడులు కొనసాగితే ఆ దేశం ఒంటరిగా ఉండాల్సి వస్తుందన్న సందేశాన్ని ఇవ్వటానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. తమ అధ్యక్షులు ఏం ఆలోచిస్తున్నారో చెప్పిన ఉపాధ్యక్షుడి సుభాషితాల్లో వాస్తవ కోణంలో చూస్తే.. అగ్రరాజ్యం చెప్పే దొంగమాటలు ఇట్టే అర్థమైపోతాయి.
భారత్ మీద పడి ఏడ్చే ట్రంప్.. అదే రష్యా నుంచి భారత్ కంటే ఎక్కువగా ముడి చమురు కొనుగోలు చేసే చైనా విషయంలో ఎందుకు తగ్గి ఉంటున్నారు? అగ్రరాజ్యంగా.. పెద్దన్న మాదిరి వ్యవహరించాలంటే అందరి విషయంలో ఒకేలాంటి న్యాయాన్ని పాటించాలి కదా? రష్యా నుంచి భారీగా ముడి చమురు కొనే చైనాను ఏమీ అనలేని అమెరికా.. భారత్ మీద మాత్రం సుంకాల షాక్ ఎందుకు విధిస్తోంది? భారత్ ను ఆంక్షల పేరుతో నియంత్రించాలని ఎందుకు భావిస్తోంది?
భారత్ మాదిరి అత్యంత నమ్మకస్తుడైన మిత్రుడ్ని అమెరికా దూరం చేసుకుంటుందనే కన్నా.. ట్రంప్ తెంపరితనంతోనే ఇదంతా జరుగుతుందని చెప్పాలి. రష్యా ముడిచమురుతో జరిగే లాభంలో సగం తాము భర్తీ చేస్తామని ట్రంప్ అనొచ్చు కదా? అంటే.. ట్రంప్ తన బొక్కసంలోని రూపాయి ఇవ్వటానికి ఇష్టపడడు కానీ.. భారత్ మాత్రం తన గల్లా పెట్టెకు గండి పడేలా మాత్రం చేయాలని భావించటం దేనికి నిదర్శనం? ట్రంప్ అడ్డగోలు మాటల్ని వాన్స్ విభేదించాలని కోరుకోవటం అత్యాశే అవుతుంది. అదే సమయంలో.. ఆచితూచి మాట్లడాలన్న ఆలోచన లేకపోవటం చూస్తే.. అగ్రరాజ్యానికి తన ప్రయోజనాలు తప్పించి మిగిలిన వారి ప్రయోజనాలు ఏ మాత్రం పట్టవనటానికి వాన్స్ వ్యాఖ్యలు నిలువెత్తు నిదర్శనంగా చెప్పక తప్పదు.
