Begin typing your search above and press return to search.

మిత్రదేశం మిత్రదేశం అంటూ పాతిక శాతం... భారత్ కు ట్రంప్ షాక్!

అవును... ఆగస్టు 1 నుంచి భారతదేశం 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు.

By:  Garuda Media   |   30 July 2025 8:47 PM IST
మిత్రదేశం మిత్రదేశం అంటూ పాతిక శాతం... భారత్  కు ట్రంప్  షాక్!
X

మోడీ మంచి స్నేహితుడు.. భారత్ తమకు ఎప్పుడూ మిత్రదేశమే.. భారత్ - అమెరికా మధ్య ఉన్నది గొప్ప బంధం.. ఇలాంటి కబుర్లు ఇంతకాలం చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా అనుకున్నంత పని చేశారు. ఇందులో భాగంగా... భారతదేశం ఇకపై 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని చావు కబురు చల్లగా చెప్పారు! దీంతో.. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... ఆగస్టు 1 నుంచి భారతదేశం 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఇదే సమయంలో... రష్యా నుంచి ఇంధనం, ఆయుధాలు కొనుగోలు చేసినందుకు అదనపు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కూడా ట్రంప్ అన్నారు. అదేవిధంగా... అమెరికా వస్తువులపై భారత్‌ అధిక సుంకాలు విధిస్తోందని తెలిపారు.

ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియా వేదికగా స్పందించిన ట్రంప్... భారత్‌ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున, వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాం అని అన్నారు. ఇదే సమయంలో... ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఒకటని.. ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అడ్డంకులున్నాయని తెలిపారు.

ఇదే క్రమంలో... రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను భారత్‌ కొనుగోలు చేస్తోందని.. ఉక్రెయిన్‌ పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తోందని.. అయినా.. భారత్‌, చైనాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయని అన్నారు. అందుకే భారత్‌ పై ఆగస్టు 1వ తేదీ నుంచి 25% సుంకాలు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.

కాగా... ఈ నెల మొదట్లో 14 దేశాలకు ట్రంప్ టారిఫ్ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవి 25% నుంచి మొదలై 40% వరకూ ఉన్నాయి. ఇందులో భాగంగా.. జపాన్, దక్షిణ కొరియాలతో పాటు కజకస్తాన్, మలేషియా, ట్యునీషియాలపై 25% టారిఫ్ విధించిన ట్రంప్... మయన్మార్, లావోస్ లపై అత్యధికంగా 40% విధించారు.

ఇదే సమయంలో... దక్షిణాఫ్రికా, బోస్నియాలపై 30%, ఇండోనేషియాపై 32%.. బంగ్లాదేశ్, సెర్బియాలపై 35%.. కంబోడియా, థాయిలాండ్ లపై 36% సుంకాలు విధించారు. ఈ సందర్భంగా... జపాన్, దక్షిణ కొరియాతో పాటు మిగిలిన దేశాలకూ ప్రతీకార సుంకాల గడువును ఆగస్టు 1 వరకూ పొడిగించారు.