Begin typing your search above and press return to search.

ట్రంప్‌ టారిఫ్‌ గేమ్స్‌ : భారత్‌తో మసాలా డీల్‌ లక్ష్యం..!

అసలు ఆయన లక్ష్యం స్పష్టమే ఒత్తిడి సృష్టించి “మసాలా డీల్స్‌” పేరిట అమెరికాకు మేలు కలిగించే ఒప్పందాలను భారత్‌ వంటి దేశాలపై రుద్దడం.

By:  A.N.Kumar   |   11 Sept 2025 10:50 PM IST
ట్రంప్‌ టారిఫ్‌ గేమ్స్‌ : భారత్‌తో మసాలా డీల్‌ లక్ష్యం..!
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాటలు ఎప్పుడూ ఒక్క లయలో ఉండవు. ఒకవైపు “మోదీ నా మిత్రుడు” అని ప్రేమతో పలుకుతూనే, మరోవైపు భారత్‌ ఎగుమతులపై టారిఫ్‌లు పెంచుతానని బెదిరించడం ఆయన వైఖరి. యూరప్‌ యూనియన్‌ను కూడా భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు విధించమని డిమాండ్‌ చేయడం దీనికి తాజా ఉదాహరణ. అసలు ఆయన లక్ష్యం స్పష్టమే ఒత్తిడి సృష్టించి “మసాలా డీల్స్‌” పేరిట అమెరికాకు మేలు కలిగించే ఒప్పందాలను భారత్‌ వంటి దేశాలపై రుద్దడం.

తీపి మాటలు – కఠిన చర్యలు

అమెరికా గతంలోనూ ఇదే పద్ధతి అనుసరించింది. ఒక చేతిలో క్యారెట్‌, మరో చేతిలో కర్ర పట్టుకొని భాగస్వామి దేశాలను ఒప్పందాల వైపు నెట్టడం. ఈ తరహా ఒప్పందాలు మ్యూచువల్‌ అగ్రిమెంట్స్‌ అన్న పేరుతో సాగించేది. వాస్తవానికి అమెరికా ప్రయోజనాలను మాత్రమే కాపాడతాయి. భారత్‌ వ్యవసాయరంగం, ఔషధాలు, ఆటోమొబైల్‌, ఆభరణాల మార్కెట్లలో విస్తృత అవకాశాలు ఉన్నందున ట్రంప్‌ నిశితంగా వాటిని లక్ష్యంగా చేసుకున్నాడు.

మసాలా డీల్స్‌ – ఉచ్చులో పడితే?

గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ గతంలోనే హెచ్చరించింది. ట్రంప్‌ మసాలా డీల్స్‌ ఏకపక్షమే అవుతాయి. ఒకసారి అంగీకరిస్తే కోలుకోలేని నష్టం వాటిల్లుతుంది. అమెరికా వస్తువులపై టారిఫ్‌లు తగ్గించమని ఒత్తిడి పెడతారు. కానీ భారత్‌కు ఎటువంటి రాయితీలు లభించవు. ఇంకా భవిష్యత్తులో మళ్లీ టారిఫ్‌లు పెంచరని హామీ కూడా ఉండదు. అంటే ఇవన్నీ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వేసే ఉచ్చు తప్ప మరేం కావు.

* ఈయూ దృక్పథం.. ట్రంప్‌ను పట్టించుకోదా?

ట్రంప్‌ సూచనల మేరకు యూరప్‌ యూనియన్‌ కూడా భారత్‌పై టారిఫ్‌లు విధిస్తుందా? అనేది పెద్ద ప్రశ్న. వాస్తవానికి ఈయూ నిర్ణయాలు అమెరికా లాగా తక్షణ చర్యల ఆధారంగా ఉండవు. నిబంధనల ప్రకారం సుదీర్ఘ దర్యాప్తు చేసి ఆధారాలు కనుక్కొనకపోతే పన్నులు విధించడం సాధ్యం కాదు. అంతేకాక భారత్‌తో ఈయూ వాణిజ్య ఒప్పందం చివరి దశలో ఉండటంతో ఇలాంటి చర్య తీసుకునే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.

* భారత్‌ వ్యూహం ఏమిటి?

ట్రంప్‌ అనిశ్చితి భారత్‌ వ్యూహాన్ని మరింత పదును పెట్టాల్సిన పరిస్థితి సృష్టించింది. మన ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో ఎంత స్థలం లభిస్తుందో ముందుగా అంచనా వేసుకోవాలి. ఇప్పటికే టారిఫ్‌లు పెంచడంతో ఎగుమతులు ప్రభావితమయ్యాయి. కాబట్టి చర్చల బృందం ప్రస్తుతం అమలులో ఉన్న టారిఫ్‌లను వెనక్కి తగ్గించుకోవడం, నాన్‌-టారిఫ్‌ అవరోధాలను తొలగించుకోవడం, 2030 నాటికి వాణిజ్యాన్ని 500 బిలియన్‌ డాలర్లకు చేర్చే మార్గాలను అన్వేషించడం అనే మూడు అంశాలపై దృష్టి పెట్టాలి.

* దీర్ఘకాల ప్రయోజనాలే ముఖ్యం

ట్రంప్‌ శైలిలోని అనూహ్యత ఆయనకు రాజకీయ బలం కావొచ్చు. కానీ భారత్‌ కోసం అది ఆర్థిక భారం మాత్రమే. ఒక్క పోస్టు, ఒక్క ప్రకటనతో మనకు వచ్చిన రాయితీలు మాయమవుతాయనే పరిస్థితి సహించరాని విషయం. అందుకే తాత్కాలిక మసాలా డీల్స్‌ కన్నా దీర్ఘకాలిక వ్యూహం, బలమైన మార్కెట్‌ యాక్సెస్‌ సాధించడం మాత్రమే మనకు మార్గం.

ట్రంప్‌ ఆటలు కొత్తవి కావు. తాత్కాలికంగా ఒత్తిడి తెచ్చి ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆయన విధానం. కానీ భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న మహా ఆర్థిక వ్యవస్థకు ఇది మేలు చేయదు. అందువల్ల ట్రంప్‌ మసాలా డీల్‌ ఉచ్చులో పడకుండా స్థిరమైన దృష్టితో బలమైన మార్కెట్‌ అనుమతులు, దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కేలా భారత్‌ తన చర్చలు కొనసాగించాలి. అదే మన ఆర్థిక భద్రతకు నిజమైన హామీ.