Begin typing your search above and press return to search.

భారత్ కు ట్రంప్ హెచ్చరిక.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఇండియా

ట్రంప్ ఆరోపణలకు భారత్ తక్షణమే స్పందించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా, ఐరోపా దేశాల నుంచి వస్తున్న అభ్యంతరాలను తిప్పికొట్టింది.

By:  A.N.Kumar   |   5 Aug 2025 10:32 AM IST
భారత్ కు ట్రంప్ హెచ్చరిక.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఇండియా
X

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడంపై ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. రానున్న కాలంలో భారత్‌పై మరింత ఎక్కువ సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

సోమవారం ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉక్రెయిన్ యుద్ధంలో అమాయక ప్రజలు చనిపోతున్నా, భారత్ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. ఈ చర్య ద్వారా భారత్ పెద్ద లాభాలు పొందుతోందని, ఇది సహించదగిన విషయం కాదని ఆయన పేర్కొన్నారు. దీనికి ప్రతీకారంగా భారత్‌పై భారీ సుంకాలు విధిస్తానని ట్రంప్ తెలిపారు.

అంతేకాకుండా వలస విధానాల విషయంలో కూడా ట్రంప్ బృందం నుంచి భారత్‌పై విమర్శలు వచ్చాయి. వైట్‌హౌస్‌లో కీలక పాత్ర పోషించిన స్టీఫెన్ మిల్లర్ మాట్లాడుతూ, భారత్ వలసల విషయంలో అమెరికాను మోసం చేస్తోందని, దీనివల్ల అమెరికన్ కార్మికులకు నష్టం జరుగుతోందని ఆరోపించారు.

-భారత్ గట్టి కౌంటర్

ట్రంప్ ఆరోపణలకు భారత్ తక్షణమే స్పందించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా, ఐరోపా దేశాల నుంచి వస్తున్న అభ్యంతరాలను తిప్పికొట్టింది. ఢిల్లీ వర్గాలు స్పష్టం చేస్తూ దేశ ప్రజల ఇంధన అవసరాలను తీర్చడానికే ఈ నిర్ణయాలు తీసుకున్నామని తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరలను దృష్టిలో ఉంచుకొని, తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నాయి.

అలాగే, అమెరికా చర్యలను ఏకపక్షంగా పేర్కొంటూ భారత్ విదేశీ వ్యవహారాల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా నుంచి అణు విద్యుత్ పరిశ్రమ కోసం యురేనియం హెక్సాఫ్లోరైడ్, విద్యుత్ వాహనాల తయారీకి అవసరమైన పల్లాడియం వంటి ఖనిజాలను అమెరికా కూడా కొనుగోలు చేస్తోందని, ఆ విషయాలను పట్టించుకోకుండా కేవలం భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని పేర్కొంది.

- భవిష్యత్ సంబంధాలు

గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా సంబంధాలు వ్యూహాత్మకంగా బలోపేతం అవుతున్నప్పటికీ, ఈ మధ్య కొన్ని విషయాలపై ఇద్దరి మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు, వలస విధానాలు వంటి అంశాలపై ఇద్దరి దేశాల వైఖరులు భిన్నంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ మాత్రం తమ ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడంలో స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తోంది.