Begin typing your search above and press return to search.

చైనాకు మాఫీ.. భారత్ పై సుంకాలు.. ఆగమవుతోన్న రష్యా.. ఇదేందయ్యా ట్రంప్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

By:  A.N.Kumar   |   13 Aug 2025 10:28 AM IST
చైనాకు మాఫీ.. భారత్ పై సుంకాలు.. ఆగమవుతోన్న రష్యా.. ఇదేందయ్యా ట్రంప్?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. చైనాపై సుంకాల విధింపు విషయంలో మెతక వైఖరి అవలంబిస్తున్న ట్రంప్, మరోవైపు భారతదేశంపై భారీ సుంకాలు విధించడంపై ఆయన వ్యాఖ్యలు రాజకీయ, ఆర్థిక వర్గాలలో పెద్ద చర్చకు కారణమయ్యాయి. ముఖ్యంగా రష్యా-భారత్ వాణిజ్య సంబంధాలపై, ప్రత్యేకించి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా నిలిచాయి.

- భారత్‌పై భారీ సుంకాలు.. రష్యాకు దెబ్బ?

ట్రంప్ తన తాజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమెరికా విధించిన భారీ సుంకాల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుందని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రకారం.. రష్యా ప్రపంచంలోనే అత్యధిక వనరులు కలిగి ఉన్నప్పటికీ.. అమెరికా ఆంక్షల వల్ల దాని ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సందర్భంలో భారత్‌ను ప్రస్తావించిన ఆయన "రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన భారత్‌కు 50% టారిఫ్ విధించాం, ఇది రష్యాకు భారీ దెబ్బ" అని స్పష్టం చేశారు. అయితే భారత్ ఈ సుంకాలను అన్యాయమని పేర్కొంటూ తన జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ట్రంప్ 25% ప్రతీకార సుంకాలను, ఆ తర్వాత మరో 25% పెనాల్టీ టారిఫ్‌లను విధించారు. అయినప్పటికీ భారత్ తన వైఖరిలో ఎలాంటి మార్పు చూపలేదు.

- చైనాకు 90 రోజుల ఉపశమనం

మరోవైపు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంలో అనూహ్యమైన మలుపు చోటుచేసుకుంది. భారీ సుంకాల విధింపును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం ఇరు దేశాలకు చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కల్పించింది. అమెరికా-చైనా మధ్య టారిఫ్‌ల విషయంలో చైనాకు ఉన్న ప్రాధాన్యత గురించి విశ్లేషకులు వేలెత్తి చూపుతున్నారు. ముఖ్యంగా కీలక ఖనిజాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, జెట్ ఇంజిన్లకు అవసరమైన మాగ్నెట్ల ఉత్పత్తిలో చైనా ఆధిపత్యం వహించడం వల్ల ట్రంప్ కొంత తాత్సారం చూపుతున్నారని అంటున్నారు.

- పుతిన్‌తో ట్రంప్ భేటీ

ఉక్రెయిన్ శాంతి చర్చల నేపథ్యంలో ఆగస్టు 15న అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపుపై చర్చలు జరిగే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఐదు యుద్ధాలను ఆపానని, ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ముగిస్తానని ఆయన ప్రకటించారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఈ చర్చల్లో భాగం చేస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు, నిర్ణయాలు రాబోయే నెలల్లో ప్రపంచ వాణిజ్య, రాజకీయ సమీకరణాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది.